Home తాజా వార్తలు షెడ్యూల్ ప్రకారమే సిబిఎస్‌ఇ పరీక్షలు

షెడ్యూల్ ప్రకారమే సిబిఎస్‌ఇ పరీక్షలు

 

CBSE exam will Class 10, 12 exams get postponed

 

కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ
విద్యార్థుల విజ్ఞప్తులపై స్పందించి స్పష్టం చేసిన సిబిఎస్‌ఇ

హైదరాబాద్ : సిబిఎస్‌ఇ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయి. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సిబిఎస్‌ఇ స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సిబిఎస్‌ఇ స్పందించింది. విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

లక్ష మంది విద్యార్థుల పిటిషన్
ప్రస్తుతం కరోనా కేసులు ఉధృతిని దృష్టిలో పెట్టుకుని మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. గత రెండు రోజులుగా cancelboardexams2021 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. దేశంలో గత సంవత్సరం తక్కువ కేసులు ఉన్న సమయంలోనే పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు కేసులు నాటికన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు..? ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని త్వరలో జరగబోయే వార్షిక పరీక్షలను రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నామంటూ విద్యార్థులు పేర్కొన్నారు. తమపై ఉన్న పరీక్షలనే తీవ్ర ఒత్తిడిని తొలగించాలని కోరారు.

విద్యార్థుల పిటిషన్‌పై స్పందించిన సిబిఎస్‌ఇ
విద్యార్థుల పిటిషన్‌పై సిబిఎస్‌ఇ సీనియర్ అధికారి స్పందించారు.షెడ్యూల్ ప్రకారమే సిబిఎస్‌ఇ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే పరీక్షా కేంద్రాలను కూడా 40- నుంచి 50 శాతం పెంచామని అన్నారు. కొవిడ్ నిబంధనలను పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నామని వివరించారు. దీంతో మే 4 నుంచి సిబిఎస్‌ఇ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సిబిఎస్‌ఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ కూడా స్పష్టం చేశారు. కాగా, కరోనా కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సిబిఎస్‌ఇ ఇప్పటికే ప్రకటించింది. అయితే థియరీ పరీక్షలకు కూడా ఇదే మినహాయింపు ప్రకటిస్తారా..? లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు.

CBSE exam will Class 10, 12 exams get postponed