Thursday, April 25, 2024

ఠాణాల్లో సిసిటివిల నిఘా

- Advertisement -
- Advertisement -

CCTV should be set up in every Police station

 

సమాజం అల్పసంఖ్యాక బలవంతులుగా, అధిక సంఖ్యాక బలహీనులుగా, పీడించేవారు, పీడనకు గురి అయ్యేవారుగా చీలిపోయి ఉన్నంతకాలం రాజకీయ ఆధిపత్యం బలవంతుల ఆధీనంలోనే ఉంటుంది. ఎంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మరెంతటి సమన్యాయ చట్టాలను రూపొందించుకున్నా వాటిని అమలు చేసే బాధ్యత గల అధికార వ్యవస్థలు సైతం వారికే లొంగిపోయి ఉంటాయి. దానివల్ల బలహీన వర్గాలకు చెందిన ప్రజానీకం హక్కులకు, వారి ప్రశాంత జీవనావకాశాలకు తరచూ ప్రమాదం కలుగుతుంది. దీనిని అరికట్టే బాధ్యతను న్యాయస్థానాలు తీసుకోకపోతే నిరంకుశత్వం రాజ్యమేలుతుంది. ఈ ప్రమాదాన్ని రాజ్యాంగకర్తలు ముందుగానే ఊహించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వర్తించేలా ప్రాథమిక హక్కులను రూపొందించి పొందుపరిచారు. చట్టప్రకారం తప్ప ఏ ఒక్కరి ప్రాణాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం, హక్కు ఎవరికి ఉండవని మన రాజ్యాంగంలోని 21వ అధికరణ స్పష్టం చేస్తున్నది. ఆ విధంగా పౌరుల జీవన హక్కుకు రక్షణ లభించింది. జీవన హక్కు అంటే ఒక జంతువు మాదిరిగా బతకడం కాదని, సకల గౌరవాలతో కూడినదని కూడా సుప్రీం కోర్టు ఈ అధికరణకు ఇచ్చిన నిర్వచనంలో పేర్కొని ఉంది.

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం సుప్రీంకోర్టు అవసరమైనప్పుడల్లా కలుగజేసుకొని తగిన ఆదేశాలు ఇస్తున్నది. అటువంటి ప్రశంసనీయమైన ఉత్తర్వులను న్యాయమూర్తులు రోహింటన్ నారిమన్, కె.ఎన్.జోసెఫ్, అనిరుద్ధ బోస్‌ల సుప్రీం ధర్మాసనం మొన్న బుధవారం నాడు జారీ చేసింది. నేర పరిశోధనలో భాగంగా నిందితులను, ఆయా కేసులకు సంబంధించిన వ్యక్తులను ప్రశ్నించేటప్పుడు పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించకుండా, అతిక్రమణలకు పాల్పడ కుండా చూసేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లోని ముఖ్య ప్రదేశాలన్నింటిలోనూ సిసిటివి (క్లోజ్డ్ సర్కూట్ టెలివిజన్) లను ఏర్పాటుచేయాలని, రాత్రిపూట కూడా దృశ్య శ్రవణ పరికరాలతో నిరాటంకంగా పనిచేసేందుకు వీలుగా నైట్ విజన్ కెమెరాలు వాటిలో అమర్చాలని ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలు దేశ ప్రజలకు అభయప్రదాతలు అనడానికి వెనుకాడవలసిన పని లేదు. విద్యుత్ సదుపాయం లేని పోలీస్‌స్టేషన్లు ఏమైనా ఉంటే సౌర, పవన విద్యుత్తులనైనా ఉపయోగించి వాటికి తక్షణం ఆ సౌకర్యం కల్పించాలని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

సిసిటివిలు నిత్యం సవ్యంగా సమగ్రంగా పనిచేసేలా చూసే బాధ్యత స్టేషన్ హౌజ్ అధికారిదేనని కూడా స్పష్టం చేసింది. ఇంటరాగేషన్ (పోలీసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించడం) చేసేటప్పుడు పోలీసులు చేయి చేసుకోవడం, గాయపర్చడమో జరిగితే దానిని బాధితులు మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ఆ సంఘం సంబంధిత సిసిటివి ఫుటేజీలను రప్పించుకొని చూడాలని కూడా ఆదేశించింది. ఫుటేజీలను ఏడాదిన్నరకాలం భద్రపరిచి తీరాలని స్పష్టం చేసింది. పోలీసు కస్టడీలో వేధించారంటూ పంజాబ్ నుంచి దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. 2019లో దేశంలో 1731 మంది పోలీస్ కస్టడీ లో మరణించారు. అంటే, రోజుకు ఐదుమంది కస్టడీలో చనిపోయారు. నిర్బంధంలో జరిగిన వేధింపుల్లో భాగంగా శరీరంలోకి సూదులు గుచ్చడం, సున్నిత భాగాలపై కొట్టడం, మూత్రం తాగించడం వంటి హేయమైన పద్ధతులను కూడా పోలీసులు ప్రయోగిస్తున్నట్టు వెల్లడైంది.

అంటే కొట్టి, హింసించి, అవమానపర్చడం ద్వారా బలవంతంగా నేరాన్ని ఒప్పించడం జరుగుతున్నదే కాని నేర పరిశోధన శాస్త్రీయ పద్ధతుల్లో సాగడం లేదని స్పష్టపడుతున్నది. పోలీసు నిర్బంధంలో ఉండి మరణిస్తున్న వారిలో బలహీనవర్గాలకు చెందినవారు, దళితులు, ముస్లింలే అధికులని కూడా తేలింది. గత జూన్ నెలలో తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి వుంచారన్న స్వల్పస్థాయి అభియోగంపై దళితులైన ఒక తండ్రిని, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పశ్నించిన వెంటనే వారు కస్టడీలోనే మరణించిన దారుణోదంతం తెలిసిందే. పోలీసు విధి నిర్వహణ అంటే ప్రజల పట్ల విధేయతతో వారి శాంతి భద్రతలకు హామీ ఇచ్చే విధంగా నడుచుకోవలసిన బాధ్యతగా కాకుండా వ్యక్తిగతంగా తమకు సంక్రమించిన నిరంకుశా ధికారాల ప్రయోగంగా భావించడం జరుగుతున్నది. ఇందుకు అధికారంలో ఉండేవారి అండదండలు ఉన్నచోట పోలీసు దౌర్జన్యకాండ మితిమించిపోతున్నది. పోలీస్ స్టేషన్లలో సిసిటివిల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఈ ధోరణిని కొంతవరకైనా అరికట్టగలవని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News