Home తాజా వార్తలు ఇసి ఖుష్

ఇసి ఖుష్

CEC OP Rawat to meet Telangana political parties today

ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి, ఆందోళన తొలగింది, ఓటర్ల జాబితా తపులు తొలగిస్తాం

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు భేషుగ్గా జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఒ.పి రావత్ ప్రశంసించారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి న అనంతరం ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితుల్లో స్పెషల్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని పంపి సన్నాహక చర్యలను, సన్నద్ధత గురించి అధ్యయనం చేసినపుడు కొంత ఆందోళనపడ్డామని, అయితే ఇప్పుడు మూడురోజు ల పర్యటనలో భాగంగా సమీక్ష చేసిన తర్వాత చాలా సంతృప్తి కలిగిందని వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఓటర్ల తుది జాబితాలో దొర్లిన తప్పులను సరిదిద్దాలని జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల రిటర్నింగ్  వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నామని, ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని భరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా తక్షణమే ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశిస్తూ ఉన్నామని స్పష్టం చేశారు.

బోగస్ ఓటర్లు, తొలగింపు ఓటర్లపై మూడు పేజీల ప్రకటన కూడా విడుదల చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో అన్ని పార్టీలనూ సమ దృష్టితో చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ‘ఇఆర్‌ఒ నెట్’లో బాలరిష్టాలు (సాంకేతిక సమస్యలు) ఉన్నమాట వాస్తవమేనని రావత్ అంగీకరించారు. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి పూణెకు చెందిన ‘సి డాక్’ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్), ఇతర సాంకేతిక నిపుణలు హైదరాబాద్‌లోనే మకాంవేసి పనిచేస్తున్నారని అన్నారు. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ‘యాక్సెసిబల్ అబ్జర్వర్‌ల’ను నియమిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో నమోదైన నేరాల్లో 25 శాతం కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయని, మిగతా రాష్ట్రాలతో చూస్తే ఇది చాలా తక్కువ అని రావత్ వ్యాఖ్యానించారు. మహిళల కోసం ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ‘ఆల్ ఉమన్ పోలింగ్ స్టేషన్’లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది, అధికారులు తెలంగాణలో తిరుగుతూ ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నట్లు కొన్ని పార్టీల నుంచి వచ్చిన ఆరోపణలను రావత్ ప్రస్తావిస్తూ, ఈ విషయంలో ఆలోచిస్తామని, తప్పకుండా ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 38 సీట్లు ఒకటికంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ జిల్లాల ఎన్నికల యంత్రాంగంమధ్య మెరుగైన సమన్వయం కోసం ప్రత్యేక మార్గదర్శకాలను అమలుచేయనున్నట్లు వివరించారు. ఇక సరిహద్దు రాష్ట్రాల నుంచి తలెత్తే సమస్యల కోసం ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, పోలీసు అధికారులు సైతం చర్చలు జరుపుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు, ఎస్‌పిలు ఎన్నికల నిర్వహణ పనుల్లో చాలా బాగా పని చేస్తున్నారని, ఏర్పాట్లపై వందశాతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల పర్యటన వివరాలను వివరించారు. ఈ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావాసా, డిప్యూటీ కమిషనర్లు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సెనా, సుదీప్ జైన్, చంద్రభూషన్ కుమార్, దిలీప్ శర్మ, ఇతర అధికారులు ధీరేంద్ర ఓఝా, సుందర్‌బెల్ శర్మ, రాష్ట్ర సిఇఒ రజత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిష్కరిస్తాం
మొదటి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులు, సూచనలు స్వీకరించామన్నారు. రెండోరోజు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్‌పిలు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. మూడో రోజు నగదు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు సంబంధిత శాఖ అధికారులతో పాటు రవాణాకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్, రైల్వే అధికారులతో సమావేశమై వివరాలను తెలుసుకున్నామని రావత్ వివరించారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాటిల్లో ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని, అలా ఉన్నవాటిని మార్చాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అలాగే డబ్బు పంపిణీపై కూడా మెజారిటీ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన 7 మండలాల గురించి ఒక రాజకీయ పార్టీ అడిగిందని, కొత్త ఓటర్లకు ఓట వేసేందుకు అవకాశం గురించి మరో రాజకీయ పార్టీ అడిగినట్లు తెలిపారు. దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చి దగ్గరలో ఏర్పాటు చేయాలని ఇంకో రాజకీయ పార్టీ కోరిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు సలహా ఇచ్చాయన్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కొత్త యాప్స్ కుడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు వైకల్యం ఉన్నవారికి చేసిన ఏర్పాట్లపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా
ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు సరఫరా విస్తృతంగా ఉంటుందని రాజకీయ పార్టీల నుంచే తమకు ఫిర్యాదులు అందాయని, నివారించడానికి కొన్ని సూచనలు కూడా చేశారని రావత్ వివరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొన్ని పార్టీలు ‘టోకెన్’ విధానాన్ని అమలుచేస్తున్న విషయాన్ని కూడా తమ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. మరికొన్ని పార్టీలు గిఫ్టులు పంచుతున్న విషయాన్ని ప్రస్తావించాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రలోభాలన్నింటినీ ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంటుందని, ‘ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ’ బృందాలు విశ్లేషిస్తూ ఉంటాయని అన్నారు. పోలీసు శాఖ, ఆదాయపు పన్ను శాఖ, ఎక్సయిజ్ శాఖ అధికారులతో దీనిపై లోతుగా సమీక్షించామని, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పటిష్ట యంత్రాంగం తదితరాల గురించి చర్చించామని, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని తెలిపారు.

ముస్లిం మహిళా ఓటర్లకు ప్రత్యేకం
ఓటు వేసేందుకు వచ్చే ముస్లిం మహిళలు బురఖా ధరించి వస్తారని, వారిని తనిఖీ చేసి గుర్తించేందుకు పోలింగ్ బూత్‌లలో మహిళా సిబ్బందినే నియమిస్తున్నామని రావత్ స్పష్టంచేశారు. కొద్దిమంది పురుషులు మహిళల తరహాలో బురఖా ధరించి వస్తున్నారని, వీరిని తనిఖీ చేయడంలో ఉన్న ఇబ్బందులను అనుకూలంగా మల్చుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా మహిళా సిబ్బందినే వినియోగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

CEC OP Rawat to meet Telangana political parties today

Telangana news