Home జాతీయ వార్తలు పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసు!

పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసు!

JK students arrest in Agra
ఆగ్రాలో ముగ్గురు జెకె విద్యార్థుల అరెస్ట్

ఆగ్రా(యూపి): ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ జట్టు గెలిచినందుకు వేడుక చేసుకున్నం జమ్మూకశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులను బుధవారం ఆగ్రాలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ గెలుపును వేడుక చేసుకునే వారిపై రాజ ద్రోహం(సెడిషన్) నేరారోపణ బనాయిస్తామని యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం గురువారం ఉదయం ట్వీట్ చేసింది. అరెస్టయిన ఈ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆగ్రాలోని రాజా బలవంత్ సింగ్ కాలేజ్‌లో చదువుకుంటున్నారు. వారిలో అర్షీద్ యూసుఫ్, ఇనాయత్ అల్తాఫ్ షేఖ్ మూడో సంవత్సరం కోర్సులో చదువుతుండగా, షౌకత్ అహ్మద్ గని నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వారి మీద గ్రూపుల మధ్య మతపరంగా శత్రుత్వాన్ని పెంచుతున్నారు, సైబర్ టెర్రరిజంకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బనాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసినట్లుగా వారిపై రాజద్రోహం కేసు కూడా బనాయించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులపై ఇలా చేయడాన్ని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. బిజెపి తప్పుడు దేశభక్తి భారత్ భావనను అసలు గుర్తించదు అని ఆమె ట్వీట్ చేశారు.
“మ్యాచ్ ముగిశాక ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. వారు దేశవ్యతిరేక వ్యాఖ్యానాలు చేశారు. మాకు ఫిర్యాదు కూడా అందింది. ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలయింది. దర్యాప్తు అనంతరమే వారిని అరెస్టు చేశాము” అని ఆగ్రా సిటీ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ కుమార్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

భారతీయ జనతా యువ మోర్చా(బిజెవైఎం)కు చెందిన గౌరవ్ రజావత్ నేతృత్వంలో కొందరు బిజెపి యువ విభాగం కార్యకర్తలు బీచ్‌పురిలోని కాలేజ్ క్యాంపస్‌కుచేరుకుని, కాలేజ్‌లో కొందరు పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలుచేశారని, ‘కాలేజ్ దేశద్రోహులకు ఆశ్రయం ఇస్తోంది’ అని ఆరోపించారు.ఆ తర్వాత బిజెవైఎం నాయకుడు ఆ కశ్మీరీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఫిర్యాదును దాఖలు చేశారు. దాంతోనే ఆ విద్యార్థులను అరెస్టు చేయడం జరిగింది.

ఇదిలా ఉండగా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మరునాడు విలేకరులు సమావేశాన్ని ఏర్పాటుచేసి అనుమతి లేకుండానే బయటివారు కాలేజ్ క్యాంపస్‌లోకి కారులో ప్రవేశించారని, హాస్టల్ గేట్ వరకు వెళ్లారని పేర్కొంది. “ విద్యార్థులను రెచ్చగొట్టి వారిని దేశద్రోహులు అనడం, మేము దేశద్రోహులకు ఆశ్రయం ఇస్తున్నామనడం సముచితమేనా?” అని కాలేజ్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. “ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మా విద్యా సంస్థ దేశవ్యతిరేకమైనదే అయితే, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు మా సంస్థను ఎందుకు సందర్శించారు?” అని ఆ ప్రతినిధి ప్రశ్నించారు. కాగా అరెస్టు చేసిన విద్యార్థులను లోహామండీలోని జగదీశ్‌పురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. వారిపైన ఐపిసి 153ఎ, 505(1)(బి), ఐటి చట్టం 2008కి చెందిన 66ఎఫ్ సెక్షన్ కింద నేరారోపణలు నమోదుచేశారు.