Home తాజా వార్తలు డ్రగ్స్‌కేసులో ‘తెర’ వెనుక విఐపిలు

డ్రగ్స్‌కేసులో ‘తెర’ వెనుక విఐపిలు

Celebrities and Film industry in Drugs case

 

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో ‘తెర’ వెనుక ఉన్నవారి కోసం ఎక్సైజ్ అధికారులు వేట సాగిస్తున్నారు.

ఇటీవల నగరంలోని తిరుమలగిరిలో తరణ్ జ్యోతిసింగ్, అమిత్‌కుమార్‌లు 54 గ్రాముల కొకైన్ తరలిస్తూ పట్టబడ్డారు. వీరు బెంగళూరులో ఓ నైజీరియన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలోని ప్రముఖులకు, చిత్ర పరిశ్రమలోని కొందరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కొత్త నిజాలు బయటకొస్తున్నాయి. అదేవిధంగా గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారితో పాటు మరో 300 వందల మందిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. లాక్‌డౌన్ సడలింపుతో మళ్లీ వారంతా డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అనుమానిస్తున్నారు. 300 మందిలో సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, విద్యార్థుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కొంతమంది ప్రముఖులు బెంగుళూరుకి వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అలాగే గతంలో డ్రగ్స్ విక్రయాలు జరిపిన వారి కదలికలపై కూడా అధికారులు నిఘా ఉంచారు. అమిత్, తరణ్‌జ్యోతి సింగ్‌ల అరెస్ట్‌తో ప్రముఖుల చిట్టా బయటపడింది. 15 రోజులుగా హైదరాబాద్‌లో డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లుగా గుర్తించారు. దీంతో డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అమిత్, తరణ్‌జ్యోతిసింగ్ లిద్దరూ వాట్సాప్ చాటింగ్‌తో పాటు కాల్‌డేటాను డిలీట్ చేసేశారు. దీంతో వాట్సాప్ చాటింగ్‌ను రీట్రైవ్ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ అధికారుల సహాయాన్ని ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్నారు.

వాట్సాప్ చాటింగ్ బయటకు వస్తే మరికొంతమంది ప్రముఖుల బండారం బయటపడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా నగరంలో గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన వారిపై నిఘాఅధికం చేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న కొందరిని పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో చిత్రపరిశ్రమలో ప్రకంపనాలు మొదలయ్యాయి. గతంలో చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వినయోగించిన వారిని మరోసారి ప్రశ్నించేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.