Home తాజా వార్తలు జనావాసాల మధ్య సెల్ టవర్ దగ్ధం

జనావాసాల మధ్య సెల్ టవర్ దగ్ధం

cell-tower-fire

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని గాజుల్ పేట్‌లో ఓ ఇంటిపై ఉన్న సెల్ టవర్ శనివారం మధ్యాహ్నం దగ్ధం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్ టవర్ విభాగంలో అంటుకున్న మంటలు ఒక్కసారిగా టవర్ మొతానికి అంటుకోవడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సెల్‌ఫోన్ టవర్ గదిలోని విలువైన పరికరాలతో పాటు టవర్ కేబుల్, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే, ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

గాజుల్ పేట్‌లోని నర్సింగ్‌రావు అనే వ్యక్తి ఇంటి పై ఉన్న టవర్‌ను తొలగించాలంటూ గత కొంతకాలంగా స్థానికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కాలనీవాసులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మరోవైపు ప్రమాదానికి కారణం ఎక్కువ సేపు జనరేటర్‌ను వినియోగించడమేనని టవర్ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టవర్ సిబ్బందికి, ప్రజలకు ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే పలు కాలనీల్లోని సెల్‌ఫోన్ టవర్ల ద్వారా రేడియేషన్ వస్తుందని, వాటిని తొలగించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. తాజా సంఘటనతో ప్రజలు మరింత ఆందోళనలో పడ్డారు.

Cell Tower Fire At Nizamabad