Home జాతీయ వార్తలు జైళ్లలో ఆరోగ్య భద్రతపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

జైళ్లలో ఆరోగ్య భద్రతపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

Jail

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్లలో ఆరోగ్యభద్రత, పారిశుద్ధం పాటించడం లోను, ఖైదీలను బయటకు తీసుకెళ్లి తీసుకొచ్చే విషయం లోను సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు, డిజిపిలకు లేఖలు పంపినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. జైళ్లలో ఆరోగ్యానికి పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఖైదీలను కోర్టుల్లో ప్రవేశ పెట్టడం తదితర కదలికలను తగ్గించాలని సామాజిక దూరం పాటించాలని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీ వాస్తవ లేఖలో సూచించారు. అలాగే విదేశీయులు, జైళ్లకు వచ్చే సందర్శకుల విషయంలో ఈ నిబంధనలు పాటించాలని కోరారు. జైళ్ల లోని ఖైదీలకు, సందర్శకులకు స్క్రీనింగ్ పరీక్షల కోసం ఆరోగ్య విభాగాలను అభ్యర్థించి ఏర్పాట్లు చేయాలని కోరారు.

భౌతిక అనుబంధాన్ని తప్పించడానికి సందర్శకులతో ఖైదీలు మాట్లాడడానికి వీలుగా ఇములాకత్ సౌకర్యం కింద వీడియో కాన్ఫరెన్సులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రోత్సహించాలని సూచించారు, కోర్టుల్లో ఖైదీలను హాజరు పరిచే విషయంలో వీడియో కాన్ఫరెన్సు సౌకర్యం వినియోగించుకోవాలని, చాలా జైళ్లలో, కోర్టుల్లో ఈ సౌకర్యం ఉందని వివరించారు. అలాంటి సౌకర్యం లేనిచోట రాష్ట్ర ఎన్‌ఐసి యూనిట్లు యూజర్‌ఐడ్స్, పాస్‌వర్డ్‌లు ఉపయోగించి వీడియో సిస్టమ్ అమలయ్యేలా చూస్తాయని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా ఈ యూజర్‌ఫ్రెండ్లీ వ్యవస్థను ఆపరేట్ చేయవచ్చని ఈమేరకు రాష్ట్ర ఎన్‌ఐసి యూనిట్లు జైళ్లకు సహకరిస్తాయని వివరించారు. దీనివల్ల ఖైదీల కదలికలు తగ్గుతాయని, రద్దీగా ఉండే కోర్టు కాంపెక్సులకు ఖేదీలు వెళ్ల వలసిన అగత్యం తప్పుతుందని వివరించారు.

Center advice to states on health care in jails