Thursday, April 18, 2024

అందుకే కేంద్రం నాపై ఆగ్రహం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Center angry on me over farmers protest: Kejriwal

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల కోసం తాత్కాలిక జైళ్లుగా స్టేడియంలను వాడుకోవడాని కి అనుమతించనందుకు కేంద్రం తనపై ఆగ్రహంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై మండిపడ్డారు. ఢిల్లీలో మూడు వ్యవసాయ చట్టాలను తన ప్రభుత్వం ఆమోదించిందంటూ అమరీందర్ సింగ్ చేసిన ఆరోపణ బిజెపి భాషలో ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి నీచ రాజకీయాలు చేస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మీ కుటుంబ సభ్యులపై ఇడి కేసులు నమోదు కావడంతో ఒత్తిడికి గురై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా అని ఆయన అమరీందర్ సింగ్‌ను ప్రశ్నించారు.

రాష్ట్రపతి సంతకంతో జారీ అయిన మూడు వ్యవసాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమలయ్యాయని, వాటిని ఏ రాష్ట్రం అడ్డుకోలేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ మూడు చట్టాలలో ఒకదానిపై ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నల్ల చట్టాలను ఆమోదించానని పంజాబ్ ముఖ్యమంత్రి తనపై ఆరోపణలు చేశారని, ఇటువంటి కీలక సమయంలో ఆయన ఇంత దిగజారుడు రాజకీయాలకు ఎలా పాల్పడగలరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను ఆపగలిగే అవకాశాలు అమరీందర్ సింగ్‌కు ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. రైతుల డిమాండ్లన్నిటినీ కేంద్రం వెంటనే ఆమోదించి, రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించే భరోసా ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

Center angry on me over farmers protest: Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News