Tuesday, September 26, 2023

రైతును కష్టాల్లోకి నెట్టిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Center that pushed Farmers into trouble with New Farm bills

 

కోవిడ్ మహమ్మారికి మన దేశంలో లక్షలాది మంది బలవుతున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రైతు సంఘాలతో సంప్రదించకుండా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి అందరికీ విదితమే. ఆ చట్టాలకు వ్యతిరేకంగా భారత దేశ రైతాంగం శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తూ గత నాలుగు వారాలుగా ఢిల్లీ వెలుపల అత్యంత చలిలో రాత్రింబవళ్ళు అలుపెరగని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం.

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులు శాంతియుత నిరసనలకు నిలయాలు అయిన జంతర్ మంతర్, రామ్ లీల మైదాన్, బోట్స్ క్లబ్ లలో జరుపుకోడానికి అనుమతి నిరాకరించి నగరంలోనికి రాకుండా నిరోధించడం వలనే వారు ఢిల్లీ సరిహద్దుల వెలుపల ఆందోళన కొనసాగించవలసి వస్తోంది. ఇప్పటికే 25 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశం నలుమూలల నుండి సంఘీభావంగా రైతు సంఘాల ప్రతినిధులు వారితో బాటు ఆందోళన కొనసాగిస్తున్నారు. పేరెన్నికగన్న కళాకారులు, క్రీడాకారులు, విశ్రాంత వీర జవాన్లు, లాయర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు తదితర అన్ని వర్గాల ప్రజలు వారిని సందర్శించి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.

దేశవ్యాప్త కార్మిక సంఘాలు ఈనెల 8వ తేదీ బంద్‌కు తమ మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు, రైతుల పరిస్థితి, మార్కెట్ శక్తుల వల్ల వారికి జరుగుతున్న నష్టం, ఈ దుస్థితి నుండి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి మనం తెలుసుకుందాం. స్వాతంత్య్రానంతరం ప్రతి ఎన్నిక సందర్భంలోనూ రాజకీయ పార్టీలు తమ పార్టీ మేనిఫెస్టోలలో అన్నదాతలైన రైతులను ఉద్ధరించడం తమ లక్ష్యమని, వారి కోసమే తమ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అంకితం అవుతారని నమ్మించి ఓట్లు కొల్లగొట్టిన తర్వాత ఆ వాగ్దానాలను తుంగలో తొక్కడం ఆనవాయితీగా మారింది.

నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి తన 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర వ్యవసాయానికి అయ్యే ఖర్చుకు 50% లాభం జతచేసి నిర్ణయిస్తామని వాగ్దానం చేసింది. ఇవాళ ఆందోళన చేస్తున్న రైతులు అదే వాగ్దానాన్ని చట్ట రూపంలో తీసుకురమ్మని మాత్రమే కోరుతున్నారు. ఈ డిమాండ్ను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ నాటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుతామని గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ తమకు ఓట్లు వేయవలసిందిగా విజ్ఞప్తిచేయగా సానుకూలంగా స్పందించి ఓటు వేసిన భారతదేశ రైతాంగం నమ్మకాన్ని వమ్ము చేయడం జరిగింది.

తదనంతరం జరుగుతున్నది ఏమిటి? ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు నిర్ణయించడంలో రైతులకు అన్యాయం చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సిఫార్సులను పక్కన పెట్టి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు మద్దతు ధరలు అమలు చేస్తే ఒక ఎకరం వరి ధాన్యం కు, రూ. 6722 , జొన్న లకు రూ. 3798, మొక్కజొన్న లకు రూ.6630 రాగులుకు రూ. 4529, కందులకు 9425, పెసలుకు 4430, వేరుసెనగకు 8319, సోయాబీన్ 6726, సన్‌ఫ్లవర్ రూ. 6141 రైతాంగానికి అదనంగా ఆదాయం లభించేది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరలు ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నాయి అనేది వాస్తవం. ఆ కనీస మద్దతు ధరలు కూడా అన్ని పంటలకు నిర్ణయించడం లేదు. కేవలం 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన ధరల కంటే తక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయించే ప్రభుత్వాల విధానాల వలన రైతులు ఎంతగానో నష్టపోతున్నారు.

ఆ మద్దతు ధరలకు కూడా ప్రభుత్వాలు సేకరించేది కేవలం 20 శాతం మాత్రమే. ఇటీవల ఒఇసిడి ఐసిఆర్‌ఐఇఆర్ సంయుక్త అధ్యయనం ప్రకారం 2000- 2016 – 17 సంవత్సరాల మధ్య ఈ విధానాల వలన భారతదేశ రైతాంగం 45 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు తేల్చారు. ఇక ప్రకృతి వైపరీత్యాలయిన కరువులు, వరదల వలన వచ్చే నష్టాలు కొన్ని లక్షల కోట్లు మొత్తంలో ఉంటాయి. పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఈ రెండు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోలేక ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల నుండి కోట్లాది మంది రైతులు పట్టణాలకు కూలీలుగా వలసపోవలసి వస్తోంది. రైతులను ఈ సంక్షోభం నుండి బయటపడ్డ వేయాలంటే వారు పండిస్తున్న పంటలు అన్నింటికీ గిట్టుబాటు ధరలు కల్పించాలి. కనీస మద్దతు ధర చట్టబద్ధ హక్కుగా గుర్తించాలి. మిగిలిన రంగాల వారితో పోల్చినప్పుడు రైతుల ఆర్థిక పరిస్థితి ఎంత వెనుకబడి ఉందో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ దేవేంద్ర శర్మ సోదాహరణంగా వివరించారు.

1970 -2015 సంవత్సరాల మధ్య 45 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వ్యవసాయ సేకరణ ధరలు బేరీజు వేయగా 1970లో గోధుమ సేకరణ ధర రూ.76 ఉంటే 2015 నాటికి రు.1450కి పెరిగింది. అదే ఇతర వర్గాల వారి వేతనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 120 -150 రెట్లు, కాలేజీ లెక్చరర్లు, ప్రొఫెసర్లకు 150- 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయులకు 280- 320 రెట్లు, కార్పొరేట్ రంగంలోని ఉన్నతాధికారులకు వెయ్యి కోట్లు పెరిగాయి. వారితో సమానంగా పెరగాలంటే వరి, గోధుమల మద్దతు ధరలు కనీసం ఏడు వేల రూపాయలు ఉండాలి. ఇక ఈ వ్యవసాయ రంగంలో స్వదేశీ, విదేశీ ప్రైవేట్ పెట్టుబడులు, వాటి లాభాలు గురించి చూద్దాం. వ్యవసాయశుద్ధి పరిశ్రమల్లోకి పెట్టుబడి దేశీయ మార్కెట్ల నుండి మాత్రమే కాక, బహుళజాతి సంస్థల నుండి కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించడం జరిగింది. ఈ పెట్టుబడులు వ్యవసాయాధార పరిశ్రమల్లో ఇతర రంగాల కంటే ఎక్కువ లాభాలు రావడం వలన వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

ఈ రంగంలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు స్థూల లాభం 2016 -17లో 18.4 శాతం ఉండగా, ప్రైవేట్ కంపెనీలకు ఇదే కాలంలో 140.8 శాతం లాభం చేకూరిందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. విత్తన రంగంలో బహుళజాతి సంస్థలు, వాటితో మిలాకత్ అయిన కార్పొరేట్ సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. పై ప్రభుత్వ విధానాల వలన మన దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 99% ప్రజల ఆదాయం 20 శాతం మాత్రమే ఉండగా, ఒక శాతంగా ఉన్న అత్యున్నత సంపన్నుల చేతుల్లోకి 80% ఆదాయం పోగుపడింది. ముఖేష్ అంబానీ ప్రపంచ జాబితాలో 6 నుండి 4వ స్థానానికి ఎదిగాడు. గౌతమ్ అదాని దేశంలోని కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. కోవిద్ మహమ్మారి పరిస్థితుల్లో కూడా వీరి సంపద పెరగడం దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత ఏడాదిలోనే కేంద్రం కార్పొరేట్ సంస్థలకు పన్ను 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించి 1.45 లక్షల కోట్లు సంపద సమకూర్చింది.

2013 భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం చట్టాన్ని క్రమంగా నీరుగార్చింది. 2006 అటవీ హక్కుల చట్టాన్ని విస్మరించి ప్రజల భూములు లాక్కొని కార్పొరేట్లకు ధారాదత్తం చేసింది. బడా పెట్టుబడిదారులు పట్టణ పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాలు భూముల కొనుగోలు చేసి అర్ధరాత్రి కోటీశ్వరులు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలేమిటి అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. క్షేత్రస్థాయిలో రైతులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగానే మనం వీటిని వివరించుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధర అనేది ప్రధానమైన అంశం అయినప్పటికీ విదేశాలతో పోలిస్తే వ్యవసాయంలో మన రైతుల ఉత్పాదకత చాలా తక్కువ అని చెప్పాలి. అందువలన మన దేశం అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి తట్టుకోలేకపోతుంది. కావున ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు నమ్ముకున్న నేలకు భూసార పరీక్షలు నిర్వహించాలి. సకాలంలో నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి. ప్రతి పంటకు తగ్గట్టు ఎరువులను, చీడపీడలు తట్టుకోవడానికి క్రిమిసంహారక మందులను సప్లై చేయాలి.

సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి నేటికీ కరువులతో బాధపడుతున్న రైతాంగానికి నీరు అందేలాగా చూడాలి. అలాగే నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు అందేలా సరఫరా చేయాలి. అంతేగాక ఆధునిక వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, యంత్రాలు రైతాంగానికి అందుబాటులో ఉండేలా సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేయాలి. రైతులకు శిక్షణ నివ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇంతకంటే ముఖ్యంగా రైతుకు సకాలంలో ముందస్తు పెట్టుబడిగా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను ఇవ్వాలి. రైతుల ఉత్పాదకత పెంచడానికి వీటన్నింటితో పాటు వ్యవసాయ విస్తరణాధికార యంత్రాంగాన్ని పెంచడంతో పాటు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలి. వ్యవసాయ విద్య, పరిశోధనలపై ప్రభుత్వం ఖర్చులు పెంచాలి. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే నేడున్న అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో మధ్య దళారీల రాజకీయ నాయకుల పాత్రలను తగ్గించి రైతుల ప్రాధాన్యతను పెంచాలి. మార్కెట్ల నిర్వహణ రైతులకు అనుకూలమైన రీతిలో మారాలి. ఉదాహరణకు మార్కెట్ యార్డుకు వచ్చిన సరుకు నాణ్యత కొలిచే యంత్రాలను, తూకం చూసే యంత్రాలను ఆధునీకరించి మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చూడాలి. రేటు నిర్ణయించడంతో పాటు రైతు అమ్ముకున్న సరుకుకి సకాలంలో డబ్బు అందేలా చూడాలి. ప్రభుత్వ మార్కెట్ యార్డులపై రైతుల నమ్మకాన్ని పెంచాలి.

ప్రజల ఆహార భద్రత, పౌష్టికాహార లోపం తొలగించడం కోసం ప్రభుత్వ సేకరణను, ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తృతం చేయాలి. ధాన్యంతో పాటు పప్పులు, నూనెలు, కాయగూరల సేకరణ పెద్ద ఎత్తున చేపట్టాలి. వాతావరణ మార్పుల కనుగుణంగా తృణ ధాన్యాలు ప్రోత్సహించడం వలన నీటి వినియోగం తగ్గించడమే కాక ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి తోడ్పడుతుంది. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలను అవలంబించేటట్లు ప్రోత్సహించాలి. పై చర్యలను తీసుకోవాలంటే ప్రభుత్వం వ్యవసాయంపై పెట్టుబడులు పెంచడంతో పాటు, ప్రైవేట్ రంగాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మార్గంలో పయనించడానికి రైతు సంఘాలు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలి. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుని రైతు అనుకూల చట్టాలను చేసే దాకా పోరాటం చేయవలసి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News