Home ఎడిటోరియల్ సంపాదకీయం: కెసిఆర్ పథ నిర్దేశం

సంపాదకీయం: కెసిఆర్ పథ నిర్దేశం

Article about Modi china tour

సంపాదకీయం: పూర్వపు ప్లానింగ్ కమిషన్ స్థానంలో ప్రధాని మోడీ ప్రభుత్వం నెలకొలిన నీతి ఆయోగ్ దేశ ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతున్న దనేది ఇంకా అస్పష్ట దృశ్యమే. ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన దాని పాలక మండలి సమావేశం మాత్రం దేశాభివృద్ధి కృషిలో తమతమ పాత్రలు, ప్రాధాన్యాల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వైరుధ్యాలను ప్రస్ఫుటం చేయడంలో సఫలమయింది.  కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బయట పడని భిన్నత్వం వేర్వేరు రాజకీయ పక్షాల పాలనలు వేళ్లూనుకోవడం ప్రారంభమైన తర్వాత తల ఎత్తడం మొదలయింది. ఆ ధోరణి ఆదివారం నాటి నీతి ఆయోగ్ భేటీలో మరింత పరిణతిని సంతరించుకున్నది.

ఆరోగ్యకరమైన పోటీ తత్వంతో కూడిన ‘సహకార సమాఖ్య’ అనే సుమధుర పదబంధం మాటున రాష్ట్రాలకు కర్తవ్యబోధ చేసిన ప్రధాని మోడీకి ప్రస్తుత విధానంలో తమకు ఎదురవుతున్న అసౌకర్యాలను గట్టిగా ఎత్తిచూపించడంలో ముఖ్యమంత్రులు విజయం సాధించారు.  రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి వీసమెత్తయినా పడుతున్నాయా, వాటిని తెలుసుకోవడానికి అది ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నదా అని బెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీ వేసిన ప్రశ్న గమనించదగినది. తెలంగాణ సిఎం కెసిఆర్ మరింత ముందుకు వెళ్లి కేంద్రం పరిమితులేమిటో, రాష్ట్రాలకు అది చేయవలసినవేమిటో స్పష్టంగా గిరిగీసి చూపించారు. సమాఖ్య విధానానికి సరైన నిర్వచనం చెప్పి ఢిల్లీ పీఠం కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ సంబంధాలలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఆ రంగంలో దేశం ఎదుర్కొంటున్న సరికొత్త సవాళ్లను గుర్తు చేసి కేంద్రం ఆ వైపుగా దృష్టి పెట్టవలసిన బాధ్యతను దానికి గట్టిగా తెలియజేశారు.

ఇది ఎంతో హేతుబద్ధంగానూ సమయానుగుణంగానూ ఉన్నది. కేంద్రం ఆ వైపు శ్రద్ధ వహించి సంక్షేమ రంగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛను కల్పిస్తే దేశం అనుకున్న దానికంటే ముందే మరింత బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షేమాది రంగాల్లో రాష్ట్రాల కాళ్లు కట్టేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం వైఖరి సమర్థనీయం కాదని నీతి ఆయోగ్ వేదిక మీద నుంచి కెసిఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశ ఆర్థిక, ప్రజాభ్యుదయ క్షేత్రాలను నీరసపరుస్తున్న రుగ్మతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సరైన మందును సూచించారు.

సహకార సమాఖ్య విధానమంటూ గొప్పలు చెప్పుకోవడమేగాని వాస్తవంలో మనది కేంద్రీకృత వ్యవస్థే. దీనిని కాదనగల రుజువులు బహుతక్కువ. సౌలభ్యం పేరుతో ఏకీకృతం సాకుతో తీసుకు వచ్చిన వస్తు, సేవల పన్ను వల్ల ఆర్థికాధికారాలు కేంద్రం గుపెట్లో మరింతగా పోగుపడ్డాయి. అంతేకాదు కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రాలకు స్వాతంత్య్రం కరువవుతున్నది. ఇలా చేతులకు, కాళ్లకు సంకెళ్లు బిగించి రాష్ట్రాల చేత నాట్యమాడించాలనే కేంద్రం తీరు గర్హించదగినది. సర్వాధికారాలు తన వద్ద ఉంచుకొని దేశాభివృద్ధి కృషిలో కలిసి రమ్మనడం రాష్ట్రాలను అపహాస్యం చేయడమే.

నిధుల కేటాయింపులో రాష్ట్రాల మధ్య కేంద్రం చూపుతున్న తేడాలు కూడా తెగడదగినవి. ప్రగతి బాటలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలపట్ల వివక్ష చూపించి వెనుకబడిన ఉత్తరాదికి పెద్ద పీట వేస్తున్న కేంద్రానికి నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సరైన మార్గం చూపించారు. అభివృద్ధి పథంలో వేగంగా దూసుకు పోతున్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు కల్పించాలని, వ్యవసాయానుబంధ రంగాలకు రాబడి పన్ను నుంచి మినహాయింపు వంటి ప్రత్యేక సహాయాలు అందించాలని కెసిఆర్ చేసిన సూచన వెంటనే ఆచరించదగినది. కేంద్రం జిఎస్‌టి, పెట్రోల్ ధరలు వంటి అంశాలలో తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నదేగాని తన చేతకాని తనం వల్ల నిరాటంకంగా సాగిపోతున్న బ్యాంకుల నిధుల కాజేత వంటి అవినీతి రంధ్రాలను పూడ్చి రాష్ట్రాలకు మెరుగైన ఆర్థిక వెసులుబాటును కల్పించాలనే సదుద్దేశంతో అడుగులు వేయలేక పోతున్నది. అన్ని ప్రగతి సూచీలలోనూ అగ్రభాగాన ఉంటున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు మరింత ప్రోత్సాహాన్ని మరిన్ని రాయితీలను కల్పించినట్లయితే సత్వర ప్రగతి సాధ్యమై ప్రధాని మోడీ ఆశిస్తున్న రెండంకెల వృద్ధి రేటును దేశం వేగంగా అందుకోగలుగుతుంది.