Friday, March 29, 2024

రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

DGP MAHENDER REDDY

 

హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్ కొనసాగుతోందని, ఈక్రమంలో దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్‌లు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలోకరోనా వేగంగా విస్తరిస్తోందని, శుక్రవారం నాడు ఒక్కరోజే 14కరోనా పాజిటివ్‌కేసులు నమోదయ్యాయన్నారు.

అపార్ట్‌మెంట్ అసోసియేషన్లకు డిజిపి సూచన
రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చే ప్రయత్నంలో హైదరాబాద్ కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ల పాత్ర కీలకమని డిజిపి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా ప్రముఖ కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఇద్దరు సభ్యులతో కూడిన ఒక జట్టుని ఏర్పాటు చేయాలని, ఆయా ఫ్లాట్స్, ఇళ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వాకబు చేయాలన్నారు. ఎవరైనా కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్టు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియ చేయాలని, లేనిపక్షంలో 100 నంబర్ కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని డిజిపి సూచించారు. అదేవిధంగా అపార్ట్‌మెంట్‌లలోకి అనవసర రాకపోకలను కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా అసోసియేషన్ ప్రతినిధులు చేపట్టాలన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే యాప్  
దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిపై పోలీసు శాఖ నిరంతర నిఘా వేస్తోందని డిజిపి వివరించారు. విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏ దేశం నుంచి వచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏలా ఉంది. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాలపై పోలీసు అధికారులు కూపిలాగుతున్నారన్నారు. ప్రతిరోజు వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ప్రతిరోజు ఆరోగ్య వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారన్నారు. తేడా వస్తే హోం క్వారంటైన్ ఇళ్లలో వైద్య బృందాలు వాలిపోతున్నారని వివరించారు. విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారి కదలికల పై నిఘా కోసం తెలంగాణ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేయనుండటంతో కొందరు స్వచ్చందంగా క్వారంటైన్‌కు వచ్చే అవకాశముందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా సరికొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన పోలీసులు ఆధునిక టెక్నాలజీతో, సాంకేతిక నిపుణులైన అధికారుల బృందం తో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించనున్నారు. కేవలం ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్‌లో విదేశాల నుండి తెలంగాణ కు వచ్చిన 22 వేల మంది వివరాలను పొందుపరిచారు. అదేవిధంగా వారం రోజుల నుంచి హౌస్ క్వారంటైన్ లో ఉన్న వారి కదలికలను పరిలిస్తున్నారు. అప్లికేషన్ లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేసి ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ కు ఆటో మ్యాటిక్ గా సమాచారం వచ్చే విధంగా పరిజ్ఞానం వినియోగించనున్నారు. దీంతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాట్లు చేసినట్లు డిజిపి తెలిపారు.

నిత్యవసర సరుకుల సరఫరా
లాక్‌డౌన్ కారణంగా వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించడానికి నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని డిజిపి తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ లాక్‌డౌన్ కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారని, అందుకే రాష్ట్రంలోకి వచ్చేసరుకులు, కూరగాయల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు శాఖ సైతం చర్యలు తీసుకుంటుందని డిజిపి తెలిపారు.

ఈక్రమంలో వాహనాల రాకపోకలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోలీసుల సాయం కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ఆదేశాల మేరకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశారన్నారు. వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను 040-23434343 నంబర్‌కు తెలియజేస్తే అవసరమైన సాయాన్ని చేస్తారన్నారు. 24 గంటలూ ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుందని పోలీసు బాసులు తెలిపారు. ఇందులో ప్రధానంగా వాహనాల ఇబ్బందులు, వ్యాపారంలో నిర్వహణలో ఇబ్బందులు, ఏదైనా సాయం కోసం వ్యాపారులు ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుందని, జిల్లాల నుంచి వెళ్లే, ఇతర జిల్లాల నుంచి వాహనాలను సమన్వయం చేస్తారన్నారు.

 

Central forces are not coming to state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News