Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం

- Advertisement -
- Advertisement -

Central government

 

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ ,యర్రగుంట్ల-, నంద్యాల సెక్షన్ విద్యుదీకరణ , గుంతకల్లు-, కల్లూరు మధ్య డబ్లిలింగ్, విద్యుదీకరణ, రెండు రాష్ట్రాల పరిధిలో 427 రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సౌకర్యాల ప్రాజెక్టులను రిమోట్ లింక్ ద్వారా ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ ఆరేండ్ల క్రితం పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రవేశపెట్టిన పున:వ్యస్థీకరణ బిల్లును అమోదించిన శుభదినంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి పార్టీ పొరాటం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా జూన్ 2 న (2014) నాడు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన శుభాకాంక్షల లేఖలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారని గుర్తు చేశారు.

టీ ఇండియా స్పూర్తిగా రెండు రాష్ట్రాల పరిధిలో అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యూపిఎ కాలంలో దక్షణాది రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై పియూష్ గోయల్ స్పందిస్తూ 2014-, 2015 కాలంలో రైల్వే బడ్జెట్ రూ.258 కోట్ల ఉండగా, 2020-, 2021 బడ్జెట్‌లో రూ.2,602 కోట్లకు పెంచామన్నారు. ఆరేండ్ల వ్యవధిలో నూతనంగా గుంటూరు-, బీబీనగర్‌ల మధ్య, అకోలా-, థానేల మధ్య నూతన రైల్వే మార్గాలను అమోదించామన్నారు. యూపిఎ కాలంలో 2009, -2014 మధ్య దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఒక్క కిలో మీటర్ కుడా డబ్లింగ్ ప్రాజెక్టలను పూర్తి చేయలేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో గుంతకల్లు-, కల్లూర్‌ల మధ్య 42 కిలోమీటర్‌ల డబ్లింగ్ పనులు విద్యుదీకణ ప్రక్రియతో పాటు 303 కిలోమీటర్లు విద్యదీకరణ పనులు పూర్తి చేశామన్నారు.

ఎన్‌డిఎ హయంలో 158 కిలోమీటర్‌ల నూతన రైల్వే మార్గం అందుబాటులోకి తెచ్చామని వివరించారు 1993, 19-94 నాడు అమోదించిన కరీంనగర్-నిజామాబాద్ రైల్వే మార్గంలోని 178 కిలోమీటర్‌లకు గాను 95 కిలోమీటర్‌ల రైల్వే మార్గం పనులు పూర్తి చేశామన్నారు. రూ.30కోట్ల నిధుల వ్యయంతో హైదరాబాద్ శివారులో లింగంపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఎంఎంటిఎస్ రెండవ దశ పనులను ఘట్‌కేసర్, యాదాద్రి వరకు విస్తరించేందుకు కేంద్ర రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రం వాటా నిధులను విడుదల చేయాలని ఆయన వివరించారు. రాష్ట్ర మంత్రి తలసాని వాస్తవాలను గ్రహించాలని సూచించారు. రాష్ట్రాలు సహకరిస్తే, రైల్వే లైన్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులు రాష్ట్రాల పరిధిలోఉండవని, జోనల్ పరిధిలో మాత్రమే ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వేల ద్వారా ప్రయాణికులకు అహర్నిశలు సేవలు అందిస్తున్న రైల్వే అధికారులు,ఉద్యోగుల, సిబ్బంది, ఆర్‌పిఎఫ్ ఉద్యోగులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సిఎం.రమేష్, రఘురామకృష్ణంరాజు, శాసన సభ్యులు బి.సుభాష్ రెడ్డి, మండలి సభ్యులు కె.జనార్థన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్‌లు పాల్గొనగా సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే జిఎం. గజానన్ మాల్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌గోయల్‌ను ఘనంగా సన్మానించారు.

రూ.221కోట్ల నిధులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి-కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి:
చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌కు కేంద్ర రైల్వే బోర్డు రూ.221 కోట్లు కేటాయించిందని కేంద్ర హోంశాఖ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రిమోట్ లింకింగ్ ద్వారా ఏర్పాటు చేసిన లాంఛన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ జంట నగరాల పరిధిలో ట్రాఫిక్ రద్దీ నివారణతోపాటు సబర్బన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా చర్లపల్లిలో శాటిలైట్ రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఎంఎంటిఎస్ రెండవ దశ పనులను మౌలాలి, -ఘట్‌కేసర్, ఘట్‌కేసర్-యాదాద్రి వరకు విస్తరణ ప్రారభించే విధంగా చర్యలను గైకొనాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా 427 రైల్వే స్టేషన్‌ల పరిధిలో ఉచిత వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రావడం హర్షనీయంగా పేర్కొన్నారు. కొత్తపల్లి-, మనోరాబాద్ మార్గంకు రూ.230కోట్ల నిధులు కేటాయించామని వివరించారు.

ఎంఎంటిఎస్ రెండవ దశ విస్తరణ యాదాద్రి వరకు చేపట్టాలి:రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటిఎస్ రెండవ దశ విస్తరణకు సహాకరిస్తుందని, ఈ ప్రాజెక్టును యాదాద్రి వరకు చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దక్షిణాది రాష్టాలకు వివక్ష చూపుతుందని ఆరోపించారు. అత్యధికంగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చర్లపల్లి పరిధిలో నూతనంగా శాటిలైట్ రైల్వే టెర్మినల్ శంకుస్థాపన శుభపరిమాణంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రతి రోజు 5లక్షల మంది ప్రయాణికులు సౌకర్యమైన ప్రయాణం చేస్తున్నారని ఆయన వివరించారు.

దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులతో ప్రత్యేక సమావేశం:
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌గోయల్ రైల్ నియలంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం.గజానన్ మాల్య జోన్ పరిధిలోని ప్రాజెక్టుల అభివృద్ధి తీరు తెన్నుల అంశాలను మంత్రికి వివరించారు. ఇలాగే భవిష్యత్తు కాలంలో ప్రగతి సాధించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆయా విభాగాల జోన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Central government focus on development of Telugu states
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News