Home జాతీయ వార్తలు ఇ-సిగరెట్ల నిషేధం

ఇ-సిగరెట్ల నిషేధం

e-Cigarettes

 

నిషేధానికి కేంద్రం నిర్ణయం
ఆరోగ్య పరిరక్షణకు చర్య
త్వరలోనే ఆర్డినెన్స్ జారీ
ఉత్పత్తి, పంపిణీ, విక్రయాల బంద్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇ సిగరెట్ల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించాలనే అంశంపై కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశానంతరం ఆర్థిక మంత్రి వివరాలను వెల్లడించారు. దేశంలో ఇ సిగరెట్లపై పూర్తి స్థాయి నిషేధం అమలులోకి వస్తుందని, దీని మేరకు వీటి ఉత్పత్తి, తయారీ, ఎగుమతి లేదా దిగుమతి, రవాణా, పంపిణీ, అమ్మకాలు, స్టోరేజ్, ప్రచార ప్రకటనలపై వేటు పడుతుందని మంత్రి తెలిపారు.

ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ (ఎండ్స్) ప్రక్రియలో భాగమైన ఇ సిగరెట్లు, హీట్ నాట్ బర్న్ పరికరాలు, వెపే, ఇ సీషా,ఇ నికోటిన్ సుగంధ భరిత హుక్కాలు ఇతర సంబంధిత వస్తువులను నిషేధించాలని చాలా కాలంగా పలు సంస్థలు , వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల ఆర్యోగ్యాన్ని ప్రత్యేకించి యువతను మాదకద్రవ్యాల వైపు ఇవి ఆకర్షితులను చేస్తున్నాయని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇ సిగరెట్ల నిషేధానికి కేంద్రం త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. దేశవ్యాప్త నిషేధానికి వీలుగా రాష్ట్రపతి ఆమోదం పొందుతుందని ఆర్థిక మంత్రి విలేకరులకు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో సంబంధిత బిల్లును ప్రవేశపెడుతారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఏ భారతీయ కంపెనీ ఇ సిగరెట్లను ఉత్పత్తి చేయడం లేదు. అయితే 150 రకాల సువాసనలతో కూడిన దాదాపు 400 ఇ సిగరెట్ల బ్రాండ్లు చలామణిలో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఆరోగ్యాలను హరిస్తున్న పొగాకు వాడకాన్ని తగ్గించాలని కేంద్రం సంకల్పించిందని, వివిధ విశ్లేషణల తరువాత, ప్రజా వేదికల నుంచి అందిన విజ్ఞప్తులతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ సిగరెట్లను నిషేధించాల్సి ఉందని సిఫార్సు చేసింది. దీనిని అన్ని విధాలుగా పరిశీలించి వీటిపై నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇ సిగరెట్ల నిషేధం ద్వారా సాధారణ సిగరెట్ల వినియోగాన్ని ప్రోత్సహించం జరుగుతుందనే వాదనను తోసిపుచ్చారు. పొగాకు ఉత్పత్తుల వాడకంపై ప్రభుత్వం కట్టడి విధిస్తోందన్నారు.

అమెరికాలో పరిణామాల నేపథ్యంలో
అమెరికాలో 2011 నుంచి 2016 వరకూ ఐదేళ్లలో విపరీతంగా ఇ సిగరెట్ల వాడకం జరిగిందని, దీని దుష్పరిణామాలను విశ్లేషించుకుంటూ ఒక నివేదిక వచ్చిందని మంత్రి తెలిపారు.యువతను దెబ్బతీసే ఇ సిగరెట్లను దేశంలోకి రానివ్వకుండా చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతారని మంత్రి వివరించారు. ఉల్లంఘనలకు భారీ జరిమానాలతో ఆర్డినెన్స్ వస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా మాట్లాడారు. ఈ నిషేధం సరైన చర్య అని, ముందు జాగ్రత్త చర్యలు ఎప్పుడూ మంచివే అని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఇ సిగరెట్ల నిషేధానికి కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు.

Central Government has decided to ban e-Cigarettes