Home జాతీయ వార్తలు ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత

ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత

corona

 

కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల చికిత్సకు ప్రత్యేక బెడ్స్

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతుండడం, అది మూడో దశకు అంటే సమూహాలకు సోకే దశకు చేరుకోవచ్చన్న భయాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సర్వవిధాలా సన్నద్ధమవుతోంది. కరోనా బాధిత రాష్ట్రాల్లో కరోనా సోకిన వారి కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర చికిత్సలకు అవసరమైన వెంటిలేటర్లను సమకూర్చుకోవడంతో పాటుగా, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా
ఎదుర్కోవడానికి రైల్వే, సైన్యాన్ని కూడా సమాయత్తం చేస్తోంది. అయితే ప్రస్తుతానికి కరోనా వైరస్ రెండో దశలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మహమ్మారి సమూహాలకు వ్యాప్తి చెందే దశకు చేరుకుందని చెప్పడానికి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్(ఐసిఎంఆర్) స్పష్టంచేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల ఎదురైనా ఎదుర్కోవడానికకి వీలుగా వైద్య చికిత్స పదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగా కోవిడ్ 19 సోకిన రోగులనే చికిత్స అందించేందుకు వీలుగా ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని, పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వైద్య సదుపాయాలను కూడా పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన అత్యవసర ఆదేశాల్లో సూచించింది. మరో వైపు సైన్యం కరోనా రోగులకు చికిత అందించడం కోసం 28 సైనిక ఆస్పత్రులను సిద్ధం చేయడంతో పాటుగా కరోనా పరీక్షలు నిర్వహించడానికి లేబరేటరీ సదుపాయాలు కలిగిన మరో అయిదు ఆస్పత్రులను కూడా సిద్ధంగా ఉంచింది. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్)కు వెంటిలేటర్ల తయారీ బాధ్యతను అప్పగించగా, రక్షణ రంగ పరిశోధనా సంస్థ డిఆర్‌డిఓ వైద్య సిబ్బందికి అవసరమైన ముఖ రక్షణ కవచాలు (ప్రొటెక్టివ్ గేర్స్)ను తయారు చేయడంతో పాటుగా, రోగులకు చికిత్స అందించడంలో పాలు పంచుకొంటున్న వివిధ ఏజన్సీలకు శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లను కూడా సరఫరా చేస్తోంది.

ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
తన వంతుగా రైల్వే కూడా కరోనా బాధితలును నిర్బంధంలో ఉంచడానికి వీలుగా రైలు బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్పులు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం త్రీటైర్ బోగీలను బాధితలుకు చికిత్స అందించడానికి వీలుగా మార్పులు చేస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన భారతీయ రైల్వే కొన్ని త్రీటైర్ స్లీపర్ బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్పులు చేసింది. ఇలా మార్పులు చేసిన బోగీల ఫొటోలను కూడా విడుదల చేసింది. ఇలా రైలు బోగీలను ఐసొలేషన్ వార్డులుగా చేయడం వల్ల సరయిన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర సేవలు అందించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐసోలేషన్ వార్డులుగా మార్పులు చేయడం కోసం స్లీపర్ బోగీల్లో ఉండే సైడ్, మిడిల్ బెర్త్‌లను తొలగించి ఒక్కో కూపేలో ఇద్దరినుంచి నలుగురిని ఉంచడానికి వీలుగా తయారు చేశారు. ప్రతి కోచ్‌లోను పది ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. వైద్య పరికరాలను పడపడానికి అవసరమైన విద్యుత్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. చికిత్సకు వచ్చే రోగుల లగేజిని ఉంచడానికి ప్రత్యేక అల్మారాలను, ప్రతి కూపేకు కర్టెన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేసిన బోగీలను ప్రత్యేకంగా ప్రతి రోజూ శానిటైజ్ చేస్తున్నారు కూడా. రాబోయే కొద్ది రోజుల్లో అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి రైల్వే జోన్ వారానికి పది బోగీలతో కూడిన ఒక రేక్‌ను తయారు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది.

ఆస్పత్రుల్లో సదుపాయాల పెంపు
లాక్‌డౌన్, క్వారంటైన్ నిబంధనలకు కచ్చితంగా అమలు చేయని పక్షంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరుకునే ప్రమాదం ఉందని దేశంలోని ప్రధాన ఆస్పత్రుల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా కరోనా బాధితులకు చికిత్స అందించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని పడకలను ప్రత్యేకించడంతో పాటుగా వీలయితే కరోనా బాధితల చికిత్స కోసం పూర్తిస్థాయి ఆస్పత్రులను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే ఆదేశించింది. దాదాపు 17 రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు మొదలు పెట్టాయి. అంతేకాకుండా అత్యవసరం కాని ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేసుకోవాలని కేంద్రం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆదేశించింది. అంతేకాకుండా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించుకోవాలని సూచించింది.

మరో వైపు ప్రముఖ ప్రైవేటు ఆసత్రులు కూడా కరోనాపై పోరులో ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాయి. ‘ఇది ప్రపంచ యుద్ధానికన్నా దారుణమైన పరిస్థితి. ఈ పోరులో మేమంతా కలిసికట్టుగా భాగస్వాములమవుతాం’ అని మాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా చెప్పారు. భవిష్యత్తులో ఎదురు కాబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ సంస్థ త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. కాగా నేటి తరాల కోసమే కాకుండా భావి తరాల కోసం కూడా మనం ఈ యుద్ధం చేస్తున్నామని అపోలో హాస్పిటల్ గ్రూపు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు.

ఆస్పత్రికి వచ్చే మిగతా వారికి, కరోనా రోగులకు మధ్య ఒక అడ్డుగోడను కల్పించడం కోసం కరోనా బాధితులను ఐసొలేషన్‌లో ఉంచడం కోసం పలు హోటళ్లలో గదులను కేటాయించేందుకు వీలుగా ‘ప్రాజెక్టు కవచ్’ పేరుతో ఒక పథకాన్ని ఈ నెల 26న ఈ సంస్థ ప్రారంభించింది.ఈ హోటల్ గదుల్లో ఐసొలేషన్‌లో ఉంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా చేయనుంది. హైదరాబాద్ సహా అయిదు నగరాల్లో అపోలో ఆస్పత్రులు ఉన్న ఐదు నగరాల్లో ఈ హోటల్‌రూమ్‌లు అందుబాటులో ఉంటాయి.

 

Central government Preparing to face any stage