Tuesday, April 23, 2024

కేంద్రం మొండితనం

- Advertisement -
- Advertisement -

Central Govt failure in Oxygen supply

 

‘అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు’ అన్నట్టు కొవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో అందజేయడానికి సుప్రీంకోర్టు నెలకొల్పిన 12 మందితో కూడిన జాతీయ స్థాయి లక్ష సాధన సంఘాని(టాస్క్‌ఫోర్స్)కి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ ప్రకటించింది. సకాలంలో చాలినంతగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చూడడంలో కేంద్ర ఘోర వైఫల్యం వల్లనే ప్రాణ వాయువు కరువు వల్ల దేశ వ్యాప్తంగా కొవిడ్ మరణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే దేశ వ్యాప్తంగా ఇంత వరకు 200 మంది రోగులు ఆక్సిజన్ కొరత వల్ల మరణించారు. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రాణ వాయువు సరఫరాలో అంతరాయం వల్ల 11 మంది మృతి చెందారు. మెడికల్ ఆక్సిజన్ అందక రోగులిలా మరణిస్తుంటే ముంబై వంటి నగరాల్లో సంపన్నులు ఆక్సిజన్ సిలిండర్లను పెద్ద ఎత్తున దాచి ఉంచుకుంటున్నారని అక్కడి వైద్యులే చెబుతున్నారు. ముంబై లోని ప్రముఖ శ్వాస కోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సుజిత్ రాజన్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

దేశ రాజధాని వీధుల్లో ఆక్సిజన్ నింపుకోడానికి ఖాళీ సిలిండర్లతో రోగుల బంధువులు బారులు తీరి పడిగాపులు కాస్తున్న దృశ్యాలను చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ నగరానికి ఇస్తానని ఒప్పుకున్న మేరకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయలేక కేంద్రం చేతులు ఎత్తేసి చాలా కాలమైంది. ఇకనుంచైనా ఆ మేరకు ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని సుప్రీంకోర్టు ఒకటికి రెండు సార్లు హెచ్చరించింది. ఈ విషయంలో ఇప్పటికీ విఫలమైతే ధిక్కార కేసు కింద చర్యలు తీసుకుంటామని ఢిల్లీ హైకోర్టు కూడా కేంద్రానికి ఖబడ్దార్ చెప్పింది. ఆక్సిజన్ కొరత సృష్టిస్తున్న మృత్యు బీభత్స సంక్షోభాన్ని స్వార్థపర వర్గాలు ఉపయోగించుకొని జేబులు నింపుకుంటున్నాయి. సగం వాడేసిన ఆక్సిజన్ సిలిండర్లను, కొన్ని చోట్ల ఖాళీ వాటిని కూడా రోగుల బంధువులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థానికి ఎటువంటి కొరత లేదని, దూర ప్రాంతాలకు సకాలంలో సరఫరా చేయడమే సమస్యగా ఉందని కొన్ని రోజుల క్రితం కేంద్రం తరపున ఒక సంజాయిషీ ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఇప్పటికీ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోడమే కేంద్రాన్ని బోనులో నిలబెడుతున్నది. దాని క్రియాశూన్యతే దీనికి కారణమని చెప్పడానికి వెనుకాడవలసిన పని లేదు. సెకండ్ వేవ్ మృత్యు ప్రభంజనమై వ్యాప్తి చెందుతూ ఉంటే భారీ ఎన్నికల సభలు నిర్వహించి, లక్షలాది మంది ఒక్కచోట చేరి స్నానాలు చేసిన కుంభమేళాను అనుమతించి వైరస్ ఉద్ధృతికి దోహదపడిన కేంద్ర పెద్దలే వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరా పట్ల అవసరమైన శ్రద్ధ చూపించకపోడంతో పలు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు బాధ్యతను తనపై వేసుకొని టాస్క్‌ఫోర్స్‌ను నియమించినప్పుడు దానికి సంపూర్ణ సహకారం ఇవ్వడం ద్వారా తన లోపాన్ని సవరించుకుంటానని చెప్పి ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం ఎదురు దాడికి దిగడం ఇక్కడ గమనించవలసిన విషయం. సుప్రీంకోర్టు అడిగిన ఆక్సిజన్ వివరాలను ఇవ్వబోనని ఆ విషయమై నిర్ణయాన్ని టాస్క్‌ఫోర్స్‌కే వదిలివేస్తున్నానని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొనడంలోని అవిజ్ఞత ఎంతటిదో చెప్పనక్కర లేదు.

కరోనా రెండవ కెరటం సవాళ్లను ఎదుర్కోడానికి తగిన నైపుణ్యం న్యాయమూర్తులకు ఉండదని ఆ రంగానికి చెందిన నిపుణులతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే సాధ్యమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సోమవారం నాడు తెలియజేసింది. న్యాయ వ్యవస్థ అత్యుత్సాహంతో ఇందులో కలుగజేసుకుంటే ఊహించని అనర్థాలు సంభవించవచ్చునని కూడా హెచ్చరించింది. న్యాయమూర్తులకు పరిపాలనానుభవం సున్నా అని కూడా తెలియజేసింది. కేంద్రం ఇంత కాలం అటు వ్యాక్సిన్ విషయంలో, ఇటు ఆక్సిజన్ సరఫరాలో తగినంత శ్రద్ధ చూపకపోడమే వైరస్ విజృంభణకు, స్మశానాలు కిక్కిరిసిపోడానికి, గంగా నదీ తీరంలో కొన్ని పదుల శవాలు తేలడానికి కారణమనేది ప్రపంచానికి ఎరుక. ఇందుకు బాధ్యత తనదేనని చెప్పి లెంపలేసుకోకుండా మీరు రంగ ప్రవేశం చేయొద్దంటూ న్యాయమూర్తులను కేంద్రం అడ్డుకుంటున్నది. సుప్రీంకోర్టుకు అది తెలియజేసిన దానిని బట్టి దేశానికి అవసరమైన మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగి అందుబాటులోకి రాడానికి మరి రెండు మాసాలైనా పడుతుంది. దేశంలోని రెండు కంపెనీలు ఉత్పత్తిని ఇప్పుడిప్పుడే పెంచాయిని తెలుస్తున్నది.

విదేశీ టీకాలు రావడానికి కూడా మరి కొంత కాలం పడుతుంది. కంపెనీలు టీకాలను కేంద్రానికి ఒక రేటుకు, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వేర్వేరు ధరలకు విక్రయించడానికి అనుమతించడాన్ని కూడా కేంద్రం సమర్థించుకున్నది. లోపాలు, పొరపాట్లు అన్నీ తమ వద్దనే ఉంచుకొని తమదే సరైన మార్గమని బుకాయిస్తున్న పాలకుల మొండితనానికి విరుగుడు కనిపించకపోడమే ఘోర విషాదం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News