Home తాజా వార్తలు ఐపిఎల్‌కు ప్రభుత్వం అనుమతి

ఐపిఎల్‌కు ప్రభుత్వం అనుమతి

Central Govt permission to BCCI to hold IPL 2020

ముంబై: కరోనా వల్ల వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను యుఎఇ వేదికగా నిర్వహించుకునేందుకు భారత క్రికెట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యుఎఇలో ఐపిఎల్ నిర్వహించేందుకు బిసిసిఐకి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగి పోయింది. కరోనా మహమ్మరి తీవ్రత నేపథ్యంలో భారత్‌లో ఐపిఎల్‌లో నిర్వహించ లేక పోతున్నామని, ఈ టోర్నీని యుఎఇలో జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే బిసిసిఐ భారత ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, ఈ లేఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. దుబాయిలో ఐపిఎల్ నిర్వహించేందుకు బిసిసిఐకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయాన్ని బిసిసిఐకి చెందిన ఓ ఉన్నత అధికారి మంగళవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. ఇక టోర్నీ నిర్వహణ ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని బిసిసిఐ భావిస్తోంది. టోర్నీ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై బోర్డు పెద్దలు దృష్టి సారించారు. ఎలాంటి ఆటంకం లేకుండా టోర్నీని సాఫీగా నిర్వహించాలని బిసిసిఐ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు చర్యలను ప్రారంభించింది. ఇక, ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించడంతో బిసిసిఐలో కొత్త ఉత్సాహం నెలకొంది.

Central Govt permission to BCCI to hold IPL 2020