Home జాతీయ వార్తలు 13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన

13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన

13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన

తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష

Central Health Ministry high level meeting on Coronavirus

న్యూఢిల్లీ: కరోనా మరణాల జాతీయ సరాసరి రేటు కన్నా అత్యధికంగా మరణాలు సంభవిస్తున్న ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 13 జిల్లాల పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జిల్లాల్లో తక్కువగా పరీక్షలు చేస్తుండడం, పరీక్షల ఫలితాలు జాప్యం కావడం, సకాలంలో ఆస్పతికి రోగులను తీసుకెళ్లక పోవడం తదితర లోపాల వల్లనే మరణాలు ఎక్కువౌతున్నాయని, ఈ లోపాలను వెంటనే సరిచేయాలని కేంద్రం శనివారం ఆయా రాష్ట్రాలకు సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో చేరిన 48 గంటల్లోనే రోగులు చనిపోతున్నారన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని అలాంటి కేసులను వెంటనే సకాలంలో ఆస్పత్రులకు చూపించాలని, తక్షణం వైద్యచికిత్స అందేలా చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యకార్యదర్శి రాజేష్‌భూషణ్ అధ్యక్షతన శనివారం ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశం జరిగింది. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని, రోగులు ఆస్పత్రులకు చేరడానికి తిరస్కరించినా ఓరిమి చూపుతూ విధులను నిర్వర్తించాలని కేసులు జీరో స్థాయిలో ఉండేలా ప్రయత్నించాలని సూచించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడూ సమీక్షలు నిర్వహిస్తూ ఆయా వైద్యబృందాలతో సమన్వయం చేస్తున్నా దానితో నిమిత్తం లేకుండా ఉన్నత స్థాయిలో భూషణ్ అధ్యక్షతన శుక్ర, శనివారాల్లో రెండు సమావేశాలు జరిగాయి.

శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 16 జిల్లాల పరిస్థితిపై సమీక్షించారు. ఈ జిల్లాల్లో కరోనా మరణాలు జాతీయ సరాసరి రేటు కన్నా అత్యధికంగా ఉన్నాయని చర్చకు వచ్చింది. శనివారం నాడు అసోం లోని కామరూప్ మెట్రో, బీహార్ లోని పాట్నా, ఝార్ఖండ్ లోని రాంచి, కేరళ లోని అలప్పూజా, తిరువనంతపురం, ఒడిశా లోని గంజాం, ఉత్తరప్రదేశ్ లోని లక్నో, పశ్చిమబెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలు, హూగ్లీ, హౌరా, కోల్‌కతా, మల్డా, ఢిల్లీ తదితర మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిస్థితిపై చర్చించారు. దేశం మొత్తం మీద యాక్టివ్ కేసులు (క్రియాశీల కేసులు)లో తొమ్మిదిశాతం ఈ జిల్లాల్లోనే ఉన్నట్టు, అలాగే మొత్తం మరణాల్లో 14 శాతం ఈ జిల్లాల్లోనే సంభవించినట్టు గుర్తించారు. పది లక్షల కేసులకు సరాసరిన జరగవలసిన పరీక్షలు కాకుండా చాలా తక్కువగా జరిగాయని, అలాగే అత్యధిక నిర్ధారణ శాతం కూడా చాలా తక్కువగా నమోదైందని సమీక్షలో బయటపడింది. అస్సోం లోని కామరూప్ మెట్రో, ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, కేరళ లోని తిరువనంతపురం, అలప్పుజా ల్లో రోజువారీ కొత్తకేసులు చాలా పెరుగుతున్నాయని గ్రహించినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వర్చువల్ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య ప్రధాన కార్యదర్శులు, మేనేజింగ్ డైరెక్టర్లు(ఎన్‌హెచ్‌ఎం), జిల్లా పర్యవేక్షణాధికారులు, జిల్లా కలెక్టర్లు, పాల్గొన్నారు. మరణాలను తగ్గించడానికి అనేక కీలక అంశాలు సమావేశంలో చర్చించారు.

రాష్ట్రాల్లోని లోపాలపై చర్చ
ఈ ఎనిమిది రాష్ట్రాల్లోని లోపాలపై సమావేశంలో తీవ్రంగా చర్చించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయోగశాలను తక్కువగా వినియోగిస్తున్నారు. ఉదాహరణకు ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు రోజుకు వంద కన్నా తక్కువగా జరుగుతున్నాయి. మిగతా పరీక్షలు పది కన్నా తక్కువగా ఉంటున్నాయి. పది లక్షల జనాభా వంతున తగినన్ని పరీక్షలు జరగడం లేదు. గత వారం నుంచి నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా ఉంటున్నాయి. పరీక్షల ఫలితాలు రావడంలో విపరీత జాప్యం జరుగుతోంది. ఆరోగ్యభద్రతా సిబ్బందికి సంబంధించి అధిక ధృవీకరణ శాతం కూడా సరిగ్గా లేదని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది.

సూచనలతో అప్రమత్తం
ఇంటివద్దనే ఐసొలేషన్‌లో ఉంటున్న లక్షణాలు పైకి కనిపించని (ఎసింప్టొమేటిక్ ) కేసులను ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా పర్యవేక్షిస్తుండాలి. రోజూ వారితో ఫోన్‌లో సంప్రదిస్తుండాలి. ఇవేవీ ఈ రాష్ట్రాల్లో సరిగ్గా జరగడం లేదు. సమయానికి సమీక్షలు నిర్వహిస్తుండాలి. అలాగే వైద్యకేంద్రాల్లో, ఆస్పత్రుల్లో రోగులకు కావలసిన కనీస సౌకర్యాలు ముందుగానే సమకూర్చాలి.ఐసియు పడకలు, ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉండాలి. కేసుల భారం, కేసుల్లో పురోగతి, ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్ తీసుకున్న చర్యలను ప్రస్తావించింది. ప్రతి మంగళవారం, శుక్రవారం వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తూ డాక్టర్ల ప్రత్యేక బృందాలకు కరోనా రోగులకు సమర్ధంగా వైద్యం అందేలా సూచనలు ఇస్తుంటారని పేర్కొంది. రాష్ట్ర ఆస్పత్రుల్లో ఐసియు ల్లోని కరోనా రోగుల కోసం టెలీ, వీడియో ద్వారా సలహాలు అందిస్తూ మరణాల రేటు తగ్గించడానికి యత్నిస్తున్నారని ఉదహరించింది. ఇదే విధంగా రెగ్యులర్‌గా వీడియో ద్వారా చర్చిస్తూ క్లినికల్‌ప్రాక్టీస్ పెంపొందించాలని సూచించారు. ఇతర వ్యాధులతో బాధపడే రోగులు, గర్భిణులు, వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రధ్ధ చూపాలని సమావేశంలో సూచించారు.

Central Health Ministry high level meeting on Coronavirus