Home లైఫ్ స్టైల్ పుస్తకాలు కాదు.. చదివే వారి సంఖ్య పెరగాలి!

పుస్తకాలు కాదు.. చదివే వారి సంఖ్య పెరగాలి!

Central Literary Youth Award winner Mercy Margaret

నేడు పుస్తకానికి విలువ పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే పుస్తకం విలువ ఎప్పటికీ తగ్గదంటోంది రచయిత, కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్. కానీ పుస్తకాలను చదివే వారి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయమంటోంది. నేడు పుస్తకాల కొనుగోలు, అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల ఉన్నా, ఆ పుస్తకాలను ఎంతమంది చదువుతున్నది ప్రామాణికంగా తీసుకోవాలంటోంది. నేటితరం పుస్తకాలకు చాలా దూరంగా జరిగిందని  అభిప్రాయపడుతోంది. నేటి కవితా, రచనలలో పెరుగుదల ఉన్నా పాఠకుల సంఖ్య పెంచేందుకు కవులు, రచయితలు సమాజానికి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలంటున్న మార్గరెట్ మెర్సీని సకుటుంబం పలకరించింది.  

మీకు ఎప్పటి నుంచి రచనపై అభిరుచి ఏర్పడింది?
మాది సూర్యాపేటలోని వల్లభాపురం గ్రామం. నేను చదువుకునే రోజుల్లోనే రాయడం అలవాటైంది. 7వ తరగతి నుంచి రాయడం ప్రారంభించాను. అంతుకు ముందు కూడా ఏదో ఒకటి రాస్తుండేది. నాకు కుటుంబం నుంచి పూర్తి సహకారం అందుతుంది. మా నాన్న బ్యాంకు ఉద్యోగి, నాకు రచనలో మా వారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు.

మీకు మంచి పేరు తెచ్చిన పుస్తకం..
‘మాటల మడుగు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2017 అందుకున్నాను.

మీ రచనల గురించి చెప్తారా?
స్కూల్ సమయం నుంచే నేను రాయడం ప్రారంభించినా, నా రచనలు అప్పట్లో ఎక్కడా అచ్చు కాలేదు. దిన పత్రికలకు కూడా పంపించడం తెలియదు. రచయితల సంఘాల గురించి కూడా అప్పట్లో తెలియదు. ఇంటర్మీడియట్ నుంచి నేను ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను. ఆ తర్వత సామాజిక మధ్యమాల ప్రభావం పెరగడంతో రచయితలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసి అందులో రచనలు పోస్టు చేస్తుండేదాన్ని. అలా చాలా మందితో పరిచయం ఏర్పడింది.

రచనలలో మీకు ఎలాంటివంటే ఇష్టం?
కవిత్వం రాయడమంటే ఇష్టం. అవి తొందరగా అర్థమవుతున్నట్లు ఉంటుంది. మంచి మంచి పదాలతో వినూత్నంగా చెప్పడం నచ్చుతుంది. నేను చదువుకునే రోజుల్లో ఈ రచనపై మక్కువ పెంచుకున్నాను. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన తర్వాత రచనా విభాగంలో రచయితలు ఎందరో స్నేహితులుగా లభించారు. అలా పరిచయమైన వారి సూచనలు, సలహాలతో నా రచనా విధానాన్ని మరింత మెరుగుపర్చుకోగలిగాను.

ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా?
మన క్రియేటివిటీ, మన మేధస్సు, రచనా అంతా దేవుడికే అంకితం కావాలని క్రిష్టియానిటిలో అంటుంటారు. అలాంటి అవధులను నేను అధిగమించాను. అభ్యుదయ పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల నేను సమాజంలో జరిగే, ఎదురయ్యే సమస్యలపై రచనలు చేయగలుగుతున్నాను.

మీరు చదివిన ఇతరుల పుస్తకాలలో మీకు ఇష్టమైనది?
శ్రీశ్రీ మహాప్రస్థానం నాకు మంచి ప్రేరణ ఇచ్చింది. నేను చదివిన మొదటి పుస్తకం కూడా అదే.

కవులు, రచయితలతో పరిచయాలు?
2012 లో కవి సంగమం పరిచయమైంది. ఫేస్‌బుక్ ద్వారా సాహితీ మిత్రులు ఎందరో దొరికారు. ముఖ్యంగా అప్సర్ గారు 2012లో పరిచయమయ్యారు. కవిగా ఎలాంటి విధానం అవలంబించాలో తెలిపారు. ఎడిటింగ్ వంటి వాటిల్లోను ఆయన చెప్పిన విధానం వల్ల నేర్పరితనం వచ్చింది.

మీరు రచించిన పుస్తకాలు?
నేను ఇప్పటి వరకు ‘మాటల మడుగు’ పుస్తకం తీసుకొచ్చాను. ఇంకా రెండు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో వాటిని కూడా ముద్రణకు పంపిస్తాను.

నేటి యువత పుస్తకాలను చదువుతున్నారంటారా..
యువతలో పుస్తకాలు చదవడం తగ్గిపోయింది. కనీసం వార్తా పత్రికలు కూడా చదవడం లేదు. సాహిత్యంలో ఎంత మంచి సంబంధం ఏర్పడితే పిల్లలు అంత మంచిగా ఉంటారు. కుటుంబసభ్యుల నుంచి కూడా అలాంటి ప్రోత్సాహం ఉండాలి.

పుస్తకాలు కొనే వారి సంఖ్య పెరుగుతుందని అంటుంటారు?
అవును.. పుస్తకాల అమ్మకం సంఖ్య పెరుగుతుంది. కానీ సమాజంలో పుస్తకాలు చదివే పాఠకుల సంఖ్య తగ్గుతుంది. చాలా మంది పుస్తకాలు కొంటున్నారు. పుస్తకాల అమ్మకాల్లో పెరుగుదల ఉందనడానికి బుక్ ఎగ్జిబిషన్లలో ఆ మేరకు అభివృద్ధి, పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఆ కొన్న పుస్తకాలను ఎంత మంది చదువుతున్నారు. కొని దాచి పెట్టుకోవడం, లేదా ఇంట్లో అందంగా అలంకరించుకోవడం వరకే పరిమితమవుతుంది. వచ్చిన వాళ్లు చూసి వీళ్లు ఇన్ని పుస్తకాలు చదివారా? అని వారిని మేధావులుగా భావించుకునేలా షో చేయడం వరకే పరిమితం అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగని అందరూ కాదు, కొందరు ఇంత వరకే పరిమితమవ్వడం బాధిస్తుంటుంది.

పిల్లల చేత పుస్తకాలను చదివించే బాధ్యత ఎవరిది..
బాధకరమైన విషయం ఏమంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా పుస్తకాలు చదవడం లేదు. అలాంటి వారు విద్యాలయాల్లో పిల్లలకేం బోధిస్తారు. వాళ్లకు ఎలాంటి కొత్త విషయాలు నేర్పగలుగుతారు? కుటుంబ సభ్యులు కూడా పుస్తకాలు చదవాలి. పిల్లలకు ఇలాంటి విషయాలు అలవాటు చేయకపోవడం వల్ల పిల్లల్లో జనరల్ నాలెడ్జ్ లోపిస్తుంది. చరిత్రను, సాహిత్యాన్ని మనం మరో తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా విద్యాలయాలలో గురువుల నుంచి విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహం కావాలి. తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకుండా వారి ఇష్టాఇష్టాలను గుర్తించాలి. వారిని రచనలపై ప్రోత్సహించాలి. వారు చేసే పనిలో మంచిని గుర్తిస్తూ, చెడును తెలియజేయాలి.

సామాజిక మాధ్యమాల వల్ల పిల్లలకు ఉపయోగమా?
నేటి పిల్లలు పుస్తకాలు విడిచిపెట్టి ఫోన్లలోనే ఆడుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వాటిలో ఇలా చూసి అలా వదిలేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉండదు. సామాజిక మాధ్యమాల్లో కంటే పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. రచయితలు కూడా రాయడం, ప్రచురించడంతో పాటు సమాజ చైతన్యానికి నడుం బిగించాలి. పుస్తకాలు చదివే వారి సంఖ్యను పెంచాలి. గ్రంథాలయాలను పునరుద్ధరించాలి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వ విధానాన్ని అనుసరించాలి. అక్కడ వసూలయ్యే మున్సిపల్ ట్యాక్స్‌లో 2 శాతం లైబ్రరీలకు కేటాయిస్తారు.

                                                                                                                                                           – కిరణ్‌కుమార్.వి

Central Literary Youth Award winner Mercy Margaret

Telangan Latest News