Friday, April 26, 2024

9,422 కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

వరద నష్టాలపై కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదన

పంటలకు రూ.8633 కోట్లు, రోడ్లకు రూ.222 కోట్లు, జిహెచ్‌ఎంసికి రూ.567 కోట్ల మేరకు దెబ్బ
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారుల వివరణ
ముంపు ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయి పర్యటన
గండ్లు పడిన చెరువులు, రోడ్లు, నాలాలు వరదల్లో చిక్కుకున్న ఇళ్లను పరిశీలించిన సెంట్రల్ టీం
నేడూ కొనసాగనున్న పర్యటన

మన తెలంగాణ/హైదరాబాద్: వరదలు, భారీ వర్షాలతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐదుగురు సభ్యులు గల కేంద్ర ఇంటర్ మినిస్టిరియల్ బృందం గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం భేటి అయింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నాయకత్వంలో వచ్చిన ఈ బృందానికి రాష్ట్రంలో వరదల పరిస్థితి, తలెత్తిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వరదలు, నష్టాలపై ఏర్పాటు చేసిన ఛాయ చిత్ర ప్రదర్ళన ఏర్పాటు చేశారు. ఇరిగేషన్, మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బి, జిహెచ్‌ఎంసి, వాటర్ బోర్డు, వ్యవసాయం, ఇంధన, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర బృందం సభ్యులతో సమావేశమై రాష్ట్రంలో జరిగిన నష్టాలపై సవివరింగా తెలియజేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో అత్యధిక వర్షాల వలన హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలియజేశారు. మూసీనదికి వరదముంపు ఏర్పడడంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడిందన్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మౌళిక వసతులకు భారీగా నష్టం జరిగిందని, దీనిపై రాష్ట్ర ప్రాధమిక అంచనాను రూపొందించిందని తెలియజేశారు. పంట నష్టం రూ.8633 కోట్లు కాగా, రహదారులకు రూ.222 కోట్లు, జిహెచ్‌ఎంసికి సుమారు రూ.567 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయం కింద తక్షణం రూ.550 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. కాగా రెండు లక్షల మందికి ఆహార పొట్లాలను అందజేశామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 లక్షల క్లోరిన్ మాత్రలతో పాటు బ్లీచింగ్ పౌడర్‌ను సరఫరా చేశామని వివరించారు. కాగా వరద ముంపుకు గురైన 15 సబ్ స్టేషన్ల్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి సరఫరాను పునరుద్దరించామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, వాటర్ బోర్డు ఎండి దానకిషోర్, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా సమావేశం అనంతరం వారు రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని అధ్యయనం చేశారు. ముగ్గురు సభ్యులు గల కేంద్ర బృందం ముందుగా పాతబస్తీ చాంద్రాయణ గుట్ట పల్లె చెరువు, ఇతర వరద ముంపు ప్రాంతాలను సందర్శించగా, మరో ఇద్దరు సభ్యుల బృందం సిద్దిపేట్ జిల్లాలోని ములుగు మండలానికి వెళ్ళి అక్కడ వరద నష్టాన్ని పరిశీలిస్తోంది. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తోంది. కాగా శుక్రవారం కూడా కేంద్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంది. రెండు రోజుల పర్యటన తరవాత రాష్ట్రంలోని వరద పరిస్థితిపై కేంద్రానికి ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది.

నగరంలో విస్తృత పర్యటన
హైదరాబాద్ నగరంలోన వివిధ ప్రాంతాల్లో కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ విశిష్టతో పాటు జలవనరుల శాఖ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం. రఘురాం, రోడ్ ట్రాన్స్‌పోర్టు, హైవేస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె. కుష్వారాలు ఉన్నారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా వద్ద వరద ముంపుకు గురై దెబ్బతిన్న ఆర్‌ఓబిని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో వారు నేరుగా మాట్లాడారు. వరదలతో ఎదురైన సమస్యలను, ఎదుర్కొన్న కష్ట, నష్టాలను కేంద్ర బృందం సభ్యులకు బాధితులు వివరించారు. అలాగే కందికల్ గేట్ వద్ద జరుగుతున్న నాలా పునరుద్ధరణ పనులను వారు పరిశీలించారు. అనంతరం చాంద్రాయణగుట్ట, పూల్‌బాగ్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్ధీన్ ఓవైసీ కేంద్ర బృందం సభ్యులను కలిసి జరిగిన నష్టాన్ని వివరించారు. భారీ వర్షాల కారణంగా దాదాపు 10 అడుగులకుపైగా రోడ్లు, ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అసద్ విజ్ఞప్తి చేశారు. తదనంతరం బాలాపూర్, హఫీజ్ బాబానగర్‌లో పర్యటించింది. పల్లెచెరువు, గుర్రం చెరువులు తెగిపోవడంతో బాలాపూర్ చెరువు ఓవర్ ఫ్లో అయి హఫీజ్‌బాబానగర్‌లోని కాలనీలు, ఇళ్లను ముంచెత్తాయని స్థానిక ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గండిపడిన గుర్రం చెరువును కేంద్ర బృందం పరిశీలించింది. గండి పూడ్చివేతకు, కట్ట పటిష్టతకు జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. సాయంత్రం అప్పా చెరువు, గగన్ పహన్ చెరువు నాలాను పరిశీలించింది. కాగా కేంద్ర బృందం వెంట జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరి రాహుల్‌బొజ్జ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహింతి, చార్మినార్ జోనల్ కమినర్ అశోక్ సామ్రాట్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరో బృందం ములుగు మండలంలో పర్యటన
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో వర్షాల వల్ల జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు ఆర్ బి కౌల్, మనోహర్‌లతో కూడిన కేంద్ర బృదం ములుగు మండలంలో పర్యటించి క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేశారు. ములుగులో పత్తి పంటను, చిన్నాతిమ్మాపూర్ లో వరి పంటను, అన్నాసాగర్ లో తెగిపోయిన కల్వర్ట్‌ను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టాలను జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి బృందానికి వివరించారు. రైతులతో మాట్లాడిన బృందం సభ్యులు పంటల సాగుకు సంబందించి ఎంత నష్టం జరిగింది, ఎకరాకు పెట్టుబడి ఎన్ని డబ్బులు వెచ్చించారని ప్రశ్నించారు. అలాగే సంవత్సరంలో ఎన్నిసార్లు పత్తి పంటను తీసేవారని రైతులను వివరాలు అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ములుగు పిఎసిఎస్ చైర్మెన్ బట్టు అంజి రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నర్సింహ్మా రెడ్డి ఆయా గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.

Central Team to visit Hyderabad Flood Affected Areas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News