Home తాజా వార్తలు క్రిప్టోకరెన్సీలపై నిషేధమే..

క్రిప్టోకరెన్సీలపై నిషేధమే..

Centre all set to ban private cryptocurrencies in india

 

కొందరికే ట్రేడింగ్‌కు అనుమతి
ప్రతిపాదనను పరిశీలిస్తోన్న కేంద్రం
29న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్ అసెట్‌గా భావించి, చిన్న ఇన్వెస్టర్లకు భద్రత కల్పించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రిప్టో బిల్లును ప్రవేశపెట్టనుందని, దీనిపై చర్చించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని నిర్దేశించే చట్టాన్ని తీసుకురావడంతో పాటు దీనిని చట్టబద్ధంగా వినియోగించడంపై నిషేధం విధించే అవకాశముందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంటు వెబ్‌సైట్ పేర్కొన్న ప్రకారం, కొన్ని మినహాయింపులతో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే ప్రతిపాదనను ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చే అవకాశముంది. ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) ఈ అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఈ క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాలని, ఇది దేశం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ఈ అంశంపై దేశంలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ గత వారం తెలిపారు. మరోవైపు క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చే ఆదాయాలపై పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 2న ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) క్రిప్టోకరెన్సీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులతో సమావేశమైంది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో పాటు ఇతర ఏజెన్సీలతో ఈ అంశంపై చర్చించింది. ఇక ప్రధాని మోడీ కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ, హోం మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించారు. ఇందులో క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మోడీ అడిగి తెలుసుకున్నారని సమాచారం. క్రిప్టోకరెన్సీపై అనిశ్చితి కారణంగా అన్ని కరెన్సీల ధరలు బుధవారం బాగా క్షీణించాయి. షిబా ఇను నుండి డోజికాయిన్ వరకు అన్నిరకాల క్రిప్టో ధరలు తగ్గాయి.

రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రేవేటీకరణ
ఈనెల 29 నుంచి ప్రారంభించే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాలు(సవరలణ) బిల్లు 2021ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) పెట్టుబడుల సమీకరణ లక్షంలో భాగంగా ఈ బ్యాంకులను కేంద్రం ప్రైవేటీకరిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టనుండగా, వీటిలో ఈ బ్యాంకింగ్ బిల్లు కూడా ఉండనుంది.

ఒకటి, రెండు క్రిప్టోకరెన్సీలే మిగులుతాయ్ : రాజన్
క్రిప్టోకరెన్సీలను రెగ్యులేట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. ఒక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మొత్తం 6 వేల క్రిప్టోకరెన్సీలు ఉన్నాయని, కానీ వీటిలో ఒకటి లేదా రెండు కరెన్సీలు మాత్రమే మనుగడ సాగించగలవని అన్నారు. మిగతా అన్నీ అదృశ్యమవుతాయని అన్నారు. చాలా కరెన్సీల్లో శాశ్వత విలువ లేదని, వాటిలో బుడగ ఉంటోందని అన్నారు.

Centre all set to ban private cryptocurrencies in india