Home ఎడిటోరియల్ బ్యాడ్ బ్యాంకు!

బ్యాడ్ బ్యాంకు!

Centre approves govt guarantee up to Rs 30600 cr for bad bankఅడ్డదారిలో ఐశ్వర్యవంతులయ్యేలా తగిన హామీ లేమీ లేకుండానే భారీ రుణాలివ్వడానికి ఒక బ్యాంకు, ఆ అప్పును తిరిగి వసూలు చేయడానికి మరో బ్యాంకు ఇదే బ్యాడ్ బ్యాంకు. దేశంలోని వివిధ వాణిజ్య బ్యాంకులు పలు దశల్లో ఇచ్చిన రుణాల వసూలు కోసం నేషనల్ అసెట్ రీకన్స్‌ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎఆర్‌సిఎల్) పేరిట ఒక బ్యాడ్ బ్యాంకును తెరవనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా మొన్న బుధవారం నాటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కంపెనీల చట్టం కింద ఒక బ్యాంకును నెలకొల్పడానికి చర్యలు తీసుకో దలచారు. పబ్లిక్ రంగంలోని వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉన్న రూ. 2 లక్షల కోట్ల మేరకు గల మొండి బకాయిల వసూలు బాధ్యతను ఈ బ్యాడ్ బ్యాంకుకు అప్పగించడానికి నిర్ణయించారు. ఈ బ్యాంకును పోషించడానికి రూ. 30,600 కోట్ల మేరకు గ్యారంటీ సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ గ్యారంటీ సొమ్మును ఉపయోగించుకొని బ్యాంకుల వద్ద నుంచి మొండి బకాయిల బాధ్యతను స్వీకరించి వాటి వసూలుకు ఉపక్రమించడం బ్యాడ్ బ్యాంకు బాధ్యత.

ఈ బ్యాడ్ బ్యాంకు తాను బాధ్యత తీసుకునే నిరర్ధక ఆస్తి విలువలో 15% మొత్తాన్ని ముందుగా రుణ దాత బ్యాంకుకు చెల్లిస్తుంది. మిగతా సొమ్ముకు ప్రభుత్వమిచ్చిన గ్యారంటీలను సమర్పిస్తుంది. అయితే అది బకాయిల వసూళ్లలో ఎంత వరకు సఫలమవుతుందనేదే కీలక ప్రశ్న. దేశంలోని బ్యాంకులు వాణిజ్య స్థాయి ఉత్పత్తి కార్యక్రమాల్లో బొత్తిగా ఆసక్తి, అనుభవం లేనివారి ప్రతిపాదనలకే ఎక్కువగా రుణాలిచ్చి అవి తిరిగి రాని పరిస్థితిని తామే సృష్టించుకుంటాయని అనుభవంలో నిస్సందేహంగా రుజువైంది. అటువంటి రుణాలు తీసుకున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ పలుకుబడి కలిగిన ఘరానా పెద్ద మనుషులే ఉంటారు. ఇంకొక వైపు బ్యాంకుల్లోని రుణాలు తీసుకొని వాటితో సొంత ఆస్తులు పెంచుకొని వ్యాపారాలను దివాలా స్థితికి తీసుకుపోయి చేతులెత్తేసి దేశం నుంచి పారిపోయే విజయ మాల్యాలు, నీరవ్ మోడీల బాపతు కూడా ఉన్నారు. మరోవైపు దేశ విదేశాల్లోని బ్యాంకుల నుంచి భారీగా అప్పు తెచ్చి ఎగ్గొట్టి అరెస్టుల నుంచి తప్పించుకోడానికి వీలుగా పాలక రాజకీయ పక్షాల్లో చేరి బాధ్యత గల మంత్రి పదవులు అనుభవించే వారు కూడా కనిపిస్తుంటారు.

ఒక సమాచారం ప్రకారం మన పబ్లిక్ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల (తిరిగి వసూలు కాని రుణాల మొండి బకాయిలు) విలువ రూ. 4 లక్షల కోట్లు. ఇందులో సగం విత్తాన్ని వసూలు చేయడానికి మాత్రమే బ్యాడ్ బ్యాంకును నెలకొల్పుతున్నారు. ఇలా తీసుకొని ఎగ్గొట్టిన రుణాల్లో అధిక భాగం పారిశ్రామిక రంగానికి చెందినవే. ఈ రంగం నుంచి బకాయి పడిన రుణాలు రూ. 3,33,143 కోట్లు. ‘ఇతర రకాల’ మొండి బకాయిలు రూ. 1,77,275 కోట్లు. కాగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల నుంచి వసూలు కావలసిన రుణాలు రూ. 1,11,328 కోట్లు, గృహ రుణాలు రూ. 17,045 కోట్లు. విద్యా రుణాలు రూ. 5,626 కోట్లు. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం విరుచుకుపడడానికి ముందు దేశంలోని పబ్లిక్ రంగ బ్యాంకులు విచ్చలవిడిగా ఇచ్చిన రుణాలే ఎక్కువగా ఈ నిరర్ధక ఆస్తులలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ దేశంలో స్వయం వికాసం కలిగిన పారిశ్రామిక రంగం గట్టిగా వేళ్లూనుకోకపోడమే ఈ మొండి బకాయిల సమస్యకు ప్రధాన కారణమనిపిస్తున్నది. సొంతంగా నూతన ఆవిష్కరణలు చేయగలిగి ప్రపంచ మార్కెట్‌ను విశేషంగా ఆకట్టుకోగల ఉత్పత్తులతో లాభాలు గడించే నైపుణ్యం కొరవడి కాపీ ఉత్పత్తుల మీద ఆధారపడే పరిశ్రమలే దేశంలో ఎక్కువగా ఉన్నాయి.

ఇందుకు ఒకటి రెండు భారీ పరిశ్రమలు మినహాయింపు కావచ్చు. ఈ స్వయం ప్రకాశం లేని పరిశ్రమలు ప్రభుత్వం అండతో కథ నడిపించడానికి అలవాటు పడ్డాయి. ఆ క్రమంలో పబ్లిక్ రంగ బ్యాంకులు లూటీకి గురవుతున్నాయి. ఇలా ఈ బ్యాంకులు నష్టపోతున్న భారీ విత్తానికి బదులుగా కేంద్ర బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించడం పరిపాటయిపోయింది. అది కేంద్ర ఖజానాకు భారంగా మారింది. తరణోపాయంగా బ్యాండ్ బ్యాంకును నెలకొల్పాలనే ఆలోచన ముందుకు వచ్చింది. కరోనా లాక్‌డౌన్ల వల్ల ఉత్పత్తులు, అమ్మకాలు పడిపోయి పారిశ్రామిక రంగం కుదేలయిపోయిన వర్తమాన నేపథ్యంలో బ్యాడ్ బ్యాంకు విజయవంతం కావడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాడ్ బ్యాంకు రుణ గ్రహీతల మీద పలు రకాల ఒత్తిడి తెచ్చి మొండి అప్పును వసూలు చేయడానికి ప్రయత్నిస్తుందే గాని వారి ఆస్తులను వేలం వేయడం అమ్మడం ద్వారా అప్పును వసూలు చేసుకునే అవకాశం దానికి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. అందుచేత అది కర్తవ్య నిర్వహణలో సమర్థవంతంగా నిరూపించుకునే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంకు కూడా ప్రభుత్వానికి మరో ఆర్థిక భారంగా రుజువైతే ఆశ్చర్యపోనక్కర లేదు.

Centre approves govt guarantee up to Rs 30600 cr for bad bank