Home జాతీయ వార్తలు కరోనా టీకాలు నిండుకున్నాయి.. ఏం చేయాలి?

కరోనా టీకాలు నిండుకున్నాయి.. ఏం చేయాలి?

Centre on shortage of vaccine, response awaited

 

కేంద్రానికి మహారాష్ట్ర సర్కారు తాఖీదు

ముంబై /న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లపై మహారాష్ట్ర సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయి జగడం నెలకొంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోస్‌ల కొరత ఉందని, ఇంకా కేవలం మూడురోజుల కోటాలోనే టీకాలు ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం తెలిపారు. బుధవారం రాష్ట్రంలో పంపిణీ కోసం 14 లక్షల డోస్‌ల టీకా ఉందని తెలిపారు.ఇవి మూడు రోజుల వ్యాక్సినేషన్‌కు సరిపోతాయని, అయితే రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందని విలేకరుల సమావేశంలో తెలిపారు. టీకాల కొరత ఏర్పడటంతో ఇప్పటివరకూ టీకాల కోసం వస్తున్న వారిని తిరిగి పంపించాల్సి వస్తోందన్నారు. వ్యాక్సిన్ సరఫరా సరిగ్గాలేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రతి వారం తమకు 40 లక్షల టీకాలు అవసరం అని, అప్పుడే వారంలో రోజువారిగా టీకాలు వేసే పని పూర్తి అవుతుందని వివరించారు.

ఇప్పటికే పరిస్థితి అధ్వాన్నంగానే ఉందన్నారు. ఈ క్రమంలో పరోక్షంగా టోపే కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తూ వసున్నామని, మరి ఈ డిమాండ్ మేరకు టీకాల సరఫరా చేయాలా? వద్దా అని ప్రశ్నించారు. రోజువారిగా కనీసం ఆరు లక్షల మందికి టీకాలు వేయాలని కేంద్రం లక్ష నిర్ధేశనం చేసిందని, దీనిని తాము స్వీకరించామని, అయితే సరైన సంఖ్యలో టీకా డోసులు అందకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభు త్వం మహారాష్ట్రకు వ్యాక్సిన్ల సరఫరాపై ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి గురించి కేంద్రానికి తెలుసుకదా అని నిలదీశారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు అవసరం అయిన టీకాలు అత్యవసరం అని ఈ దిశలో జాతీయ స్థాయి వ్యాధుల నియంత్రణ కేంద్రాలు స్పందించాల్సి ఉందన్నారు.

కొత్త రకం కరోనాతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అంటున్నారని, ఈ క్రమంలో కేంద్రం నుంచి దీనిపై సరైన సమాచారం అందాల్సి ఉంటుంది. ఎటువంటి ఔషధాలు పొందాలనేది వివరించాలని ఆరోగ్య మంత్రి చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ వ్యాస్ వార్తాసంస్థలతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరతతో ఏ క్షణంలో అయినా వ్యాకిన్లు లేకపోవడంతో టీకా కేంద్రాలు మూతపడే పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని కేంద్రానికి తెలియచేశామని తెలిపారు. ముంబైలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉందని నగర మేయర్ కిశోరి పెడ్నెకర్ తెలిపారు. ఇక్కడ కేవలం 1.76 లక్షల డోస్‌ల టీకాలు ఉన్నాయని, ఇవి అయిపోయే పరిస్థితి ఉందన్నారు.

వాడకంలో అసమర్థత పైగా నిందలా: కేంద్ర ఆరోగ్య మంత్రి కౌంటర్
మహారాష్ట్రలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత ఉందనే వాదనను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ కొట్టిపారేశారు. కొందరు పనిగట్టుకుని ఇటువంటి నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని, వ్యాక్సిన్ కొరత ఉందని చెప్పడం తప్పని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ, ఇప్పటి వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి నిందలకు దిగుతోందని కేంద్ర మంత్రి బుధవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. అక్కడ అర్హులైన వారికి క్రమపద్థతిలో వ్యాక్సిన్‌లు వేయడం లేదని, పైగా వ్యాక్సిన్ల కొరత ఉందని అనవసరంగా ప్రజలలో భయాందోళనలు కల్గిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి చేష్టలకు దిగడం మానుకోవాలని ఆయన కఠిన పదజాలంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు వెలువరించారు.

వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వాస్తవిక పరిస్థితిని సమీక్షించుకుని వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల గురించి తెలియచేయడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రాల డిమాండ్ల మేరకు టీకాలను పంపించడం జరుగుతోందని, ఈ దశలో కొరత గురించి మాట్లాడటం నిరాధారం, దురుద్ధేశపూరితం అవుతుందన్నారు. నిజానికి ఇప్పటికిప్పుడు దేశంలో అన్ని వయస్కుల వారికి వ్యాక్సిన్ అందించే అవకాశం లేదని, ఈ మేరకు ఉత్పత్తి లేదని, ఈ దశలో 14 ఏండ్లు పైబడ్డ వారందరికి కూడా టీకాలు వేయాలనే థాకరే, కేజ్రీవాల్ చేసిన డిమాండ్లు అనుచితం అన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు ప్రాధాన్యతక్రమాలను పరిగణనలోకి తీసుకుని, మరణాల సంఖ్యను తగ్గించే దిశలో వ్యాక్సిన్ల పంపిణీ క్రమాన్ని ఖరారు చేసుకుంటోందని, వ్యాక్సిన్ల విషయంలో రాజకీయాలు అనుచితం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Centre on shortage of vaccine, response awaited