Home తాజా వార్తలు అడ్వాన్స్ తెలివి

అడ్వాన్స్ తెలివి

Centre releases tax due to states in advance

 

రాష్ట్రాల పన్నుల వాటా విడుదలపై కేంద్రం అనూహ్య పంథా
బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండడంతో వ్యూహాత్మక నిర్ణయం
రొటీన్‌గా విడుదల చేయాల్సిన వాటా ఇవ్వకుండానే అడ్వాన్స్ నిధుల పేరిట శాంతింపజేసే యత్నం
పన్నుల వాటాలో తెలంగాణకు రూ.1998 కోట్లు విడుదల

మన తెలంగాణ/ హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బడ్జెట్ సమావేశా ల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని కత్తులు నూరుతున్న ప్రతిపక్ష పార్టీలకు బిస్కెట్‌లు వేసే పనిలో కేంద్ర వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకొంటున్న లక్షల కో ట్ల రూపాయల నిధుల్లో రాష్ట్రాలకు రొటీన్‌గా ఇవ్వాల్సిన పన్నుల వాటా నిధులను కూడా ఇవ్వకుండా, ఒకవేళ నిధులు ఇచ్చినా సకాలంలో ఇవ్వకుండా రా ష్ట్రాలను సతాయిస్తూ వచ్చిన కేంద్రం అడగకుండానే నెలనెలా ఇవ్వాల్సిన పన్నుల వాటా నిధులనే కాకుండా ఏకంగా ఒకనెల నిధులను అడ్వాన్సుగా ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం రాష్ట్రాల వంతైం ది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జనవరి నెలకు చెల్లించాల్సిన 999 కోట్ల 31 లక్షల రూపాయల నిధులను విడుదల చేయడమే కాకుండా అదనంగా మరో నెలకు సంబంధించిన నిధులను కూ డా విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే తెలంగాణకు ఏకంగా 1998 కోట్ల 62 లక్షల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది.

పన్నుల వాటాలో రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కూడా కైంకర్యం చేయడానికి అనేకరకాల దొడ్డిదారు లు తొక్కిని కేంద్రం ఉన్నపళంగా రాష్ట్రాలపైన ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్ధం కావడంలేదని కొందరు సీనియర్ అధికారులు సైతం వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 47,541 కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది. వాస్తవానికి కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లో 41 శాతం వాటాలను రాష్ట్రాలకు విడుదల చేయాల్సి ఉంది. పెట్రోల్ ఉత్పత్తులు, ఇతర రంగాలపైన సెస్, సర్‌చార్జీల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందని రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు బీజేపీయేతర రాష్ట్రాలు సమాయత్తమయ్యాయి. పన్నుల రూపంలో నిధులను వసూలు చేస్తే రాష్ట్రాలకు 41 శాతం వాటా నిధులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో, ట్యాక్స్ అనే పదాలను తొలగించి సెస్, సర్‌చార్జీల పేరుతో రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దేశంలోనే మొట్టమొదటగా గళమెత్తారు.

కే.సీ.ఆర్. కేంద్రాన్ని నిలదీసిన తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లు కూడా రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం ఏ విధంగా గండికొండుతుందో వివరిస్తూ పార్లమెంట్‌లో అధికార బీజేపీపైన ధ్వజమెత్తేందుకు ఇప్పటికే నిర్ణయాలు తీసుకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయంలో నష్టాలు వస్తున్నాయని ఐ.టీ.మున్సిపల్ శాఖా మంత్రి కే.టి.రామారావు అనేకసార్లు తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. పెట్రో ఉత్పత్తులు, ఇతర రంగాలపైన సెస్, సర్‌చార్జీల పేరుతో కాకుండా వాస్తవిక కోణంలో పన్నుల రూపంలోనే నిధులను సమీకరిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పన్నుల వాటాలో కనీసం 4,230 కోట్ల రూపాయల వరకూ అదనపు ఆదాయం వచ్చి ఉండేదని, కేంద్రం ఆ నిధులను అక్రమంగా స్వాహా చేసిందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు అంటున్నారు. అందుకే సెస్, సర్‌చార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి ఎంత ఆదాయాన్ని సంపాదించిందో చెప్పాలని, వీలైతే ఈ అక్రమ ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా బీజేపీయేతర రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయనున్నాయని రాష్ట్రానికి చెందిన కొందరు టి.ఆర్.ఎస్. ఎంపీలు తెలిపారు.

ఇలా ఎన్ని తాయిలాలు వేసినా కేంద్ర ప్రభుత్వ అక్రమ సంపాదనను తప్పకుండా పార్లమెంటులో నిలదీస్తామని అంటున్నారు. జనవరి నెలకు సంబంధించిన పన్నుల వాటాలో సాధారణంగా 47,541 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఇవ్వాల్సి ఉండగా వాటికి అదనంగా అడ్వాన్స్‌గా మరో 47,541 కోట్ల రూపాయల నిధులను అన్ని రాష్ట్రాలకూ విడుదల చేసిన కేంద్రం షాక్ ఇచ్చింది. రొటీన్ నిధులు, అడ్వాన్స్ నిదులు కలిపి మొత్తం రాష్ట్రాలకు 95,082 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ లెక్కన తెలంగాణకు 1998 కోట్ల 62 లక్షల రూపాయలు రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,847 కోట్ల96 లక్షల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది. బీహార్ రాష్ట్రానికి అత్యధికంగా 9,563 కోట్ల 30 లక్షల రూపాయలు, గుజరాత్ రాష్ట్రానికి 3,306 కోట్ల 94 లక్షల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 7,463 కోట్ల 92 లక్షలు, మహారాష్ట్రానికి 6,006 కోట్ల30 లక్షల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి 17,056 కోట్ల 56 లక్షల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. తమిళనాడు రాష్ట్రానికి 3,878 కోట్ల 38 లక్షల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది.

Centre releases tax due to states in advance