Home ఎడిటోరియల్ కుల గణనకు స్వస్తి!

కుల గణనకు స్వస్తి!

Centre stance on caste census of backward classes in scకులాల ప్రాతిపదికగా జనాభా లెక్కల సేకరణ చేపట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేయడంతో చిరకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోయిన ఈ సమస్య మరి 10 సంవత్సరాల పాటు వాయిదా పడిపోయింది. దేశంలో జనాభా సేకరణ పదేళ్లకొకసారి జరుగుతుంది. కులాల వారీ జన గణన మాత్రం బ్రిటిష్ వారి హయాంలో 1933లోనే చివరి సారిగా జరిగింది. అప్పటి నుంచి ఆగిపోయిన ఈ ప్రక్రియను తిరిగి చేపట్టాలనే డిమాండ్ వెనుకబడిన తరగతుల నుంచి చిరకాలంగా విన వస్తున్నది. అప్పటి కుల గణనలో వెల్లడైన గణాంకాల ఆధారంగానే ఒబిసిలు దేశ జనాభాలో 52 శాతంగా ఉంటారని మండల్ కమిషన్ ఒక అంచనాకు వచ్చింది. జనాభాలో ఒబిసిలు 36 శాతమేనని కొందరు, 6070 శాతం వరకు ఉంటారని మరి కొందరు ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. మొత్తానికి వెనుకబడిన తరగతులు దేశ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉంటారనే అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినవస్తున్నది. అటువంటప్పుడు తమకు 27 శాతం రిజర్వేషన్లతో సరిపుచ్చడం అన్యాయమనే వాదనను ఆ వర్గాలు తరచూ వినిపిస్తున్నాయి. అందుచేతనే కుల ప్రాతిపదిక జన గణన డిమాండ్ ఊపందుకున్నది.

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (విపి సింగ్) ప్రధానిగా ఉన్నప్పుడు 1990లో ఒబిసిలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం కోటా కల్పించారు. అప్పటి నుంచి తమ జన సంఖ్య ఎంతో తేల్చి ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ ఆ వర్గాల నుంచి బయలుదేరింది. 2001 లో గాని, 2011లో గాని జనాభా లెక్కలతో పాటు కుల ప్రాతిపదిక న వివరాలు సేకరించడాన్ని అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఒత్తిడికి కొంత వరకు తల ఒగ్గిన యుపిఎ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల్లో భాగంగా కాకుండా విడిగా సామాజిక, ఆర్థిక కుల గణన అనే పేరుతో కొంత సమాచారాన్ని సేకరింపజేసింది. జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితుల చట్టం కింద ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రాతిపదికగా తీసుకోదలచి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పుడు ఈ సమాచారాన్ని కోరుతున్నది. ఆ మేరకు మహారాష్ట్ర సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ఇటీవల దాఖలు చేసిన అభిప్రాయ (అఫిడవిట్) పత్రంలో కేంద్ర ప్రభుత్వం ఆ సమాచారం ఎందుకూ పనికి రాదని తప్పుల తడకగా ఉందని దానిని విడుదల చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగబోదని తెలియజేసింది.

పనిలో పనిగా 2021 జనాభా లెక్కల సేకరణలో భాగంగా కుల ప్రాతిపదిక జన గణనను చేపట్టడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతను కూడా వెంటపెట్టుకొని ఈ మధ్య ప్రధానిని ఈ విషయంలోనే కలుసుకున్నారు. కుల ప్రాతిపదిక జన గణనను చేపట్టాలని వారు ఆయనకు ప్రత్యేకించి విజ్ఞప్తి చేశారు. అది సాధ్యమయ్యే పని కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేయడం పట్ల నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రం ఈ నిర్ణయానికి రావడానికి ముందు ఎన్‌డిఎలో భాగస్వాములమైన తమతో సంప్రదించలేదని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల పట్ల ఎంత కఠినంగా ఉందో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చాటుతున్నదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ప్రతి పదేళ్లకొకసారి చేపట్టే జనాభా లెక్కలలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టిల జన గణన సాధ్యమవుతున్నప్పుడు ఇతర వెనుకబడిన తరగతుల వివరాలు సేకరించడం ఎందుకు సాధ్యం కాదని వీరప్ప మొయిలీ ప్రశ్నించారు. విపి సింగ్ మండల్ కమిషన్ నివేదిక దుమ్ము దులిపి ఒబిసిలకు కోటాను అమలు పరిచినప్పుడు సంఘ్ పరివార్ శక్తుల సారథ్యంలోనే అందుకు వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా చెలరేగిన సంగతి తెలిసిందే.

అగ్రవర్ణాల ఓటు బ్యాంకు మీద ఆధారపడే భారతీయ జనతా పార్టీ మతతత్వాన్ని ప్రయోగించి ఒబిసిల ఓటును ఆకట్టుకుంటున్నది. తద్వారా ఎన్నికల విజయాలను చూరగొంటున్నది. జనాభాలో తాము అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వృత్తులను కోల్పోయి దయనీయమైన జీవితాలు గడుపుతున్నామనే విషయం కుల గణన ద్వారా ఒబిసిలు మరింత స్పష్టంగా గమనిస్తే వారు తమకు దూరమవుతారనే భయం బిజెపిలో గూడుకట్టుకొని ఉన్నదనే అభిప్రాయం వెల్లడవుతున్నది. జనాభాలో 80 శాతంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు, మైనారిటీలు అమిత పేదరికంలో మగ్గుతుండగా మిగిలిన 20 శాతంగా ఉన్న అగ్ర వర్ణాలు దేశ సంపదను అనుభవిస్తున్నారనే విషయం గణాంకాలతో బయటపడడం బిజెపికి ఇష్టం లేదనే వాదన కూడా వినబడుతున్నది. మత ప్రాతిపదిక మీద హిందువులందరినీ సంఘటిత పరచి రాజకీయంగా ఎల్లకాలం ప్రయోజనం పొందాలనే తమ లక్షాన్ని కుల గణన దెబ్బ తీస్తుందని పాలక బిజెపి వర్గాలు అనుకోడం సహజం. అయితే దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు ఆశిస్తున్న దాన్ని ఎల్లకాలం వాయిదా వేయడం సాధ్యం కాదు.

Centre stance on caste census of backward classes in sc