Thursday, April 25, 2024

నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

- Advertisement -
- Advertisement -

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడు కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8 న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో సత్యనారాయణ భవన్ నుంచి సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ, బషీర్‌బాగ్, గన్ ఫౌండ్రీ, అబిడ్స్, ట్రూప్ బజార్, కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణ గూడ వరకు సాగింది. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ నిరంకుశ పాలనా కొనసాగిస్తూ రైతు, ప్రజా వ్యతరేక నల్ల చట్టాలను తీసుకురావడం బడా కార్పొరేట్లకు వ్యవసాయం కట్టబెట్టడం కోసమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై, సాధారణ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం తీసుకురావడం దుర్మార్గమన్నారు.

పది రోజులుగా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు అమానుషమని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8 న జరిగే భారత్ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాల న్నారు. ప్రజా వ్యతరేక చట్టాలను రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలోకి ప్రైవేటు రంగం అడుగుపెట్టేందుకు ఈ చట్టాలు వీలు కల్పిస్తున్నాయని, దీంతో రైతులకు రక్షణ లేకుండా పోతుందని అయన ఆరోపించారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బి. ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. మన్నన్, టి. రాకేష్ సింగ్, సిపిఐ నగర నేతలు ఎండి సలీం ఖాన్, ఆర్.మల్లేష్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర నాయకులూ బి. స్టాలిన్, ఆర్.ఎన్. శంకర్, కె.శ్రీనివాస్, ఏ.ఐ.వై.ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్. బాలకృష్ణ, ఏ.ఐ.ఎస్.ఎఫ్ నగర నేతలు హరికృష్ణ, హరీష్ ఆజాద్, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News