Home తాజా వార్తలు మాడు పగిలేది మరి 4 రోజులు

మాడు పగిలేది మరి 4 రోజులు

మరో నాలుగు రోజుల పాటు వడగాలులు
నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో తీవ్రత ఎక్కువ
నేడు వర్షాలు కురిసే అవకాశం
45 డిగ్రీలను దాటుతున్న ఉష్ణోగ్రతలు
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక దానిని ఆనుకొని ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా 0.9 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో సోమవారం రాత్రి, బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30- నుంచి 40 కి.మీల) తో వేగంతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, సోమవారం రాత్రి, మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నల్లగొండలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమురంభీం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల అధికంగా నమోదయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం 41.9 డిగ్రీలు, ఆదిలాబాద్ 44.5, భద్రాద్రి కొత్తగూడెం 42, భద్రాచలం 41.6, హన్మకొండ 41.5, హైదరాబాద్ 43, జగిత్యాల 45.4, జయశంకర్ భూపాలపల్లి 42.4, జోగలాంభ గద్వాల్ 41.4, కామారెడ్డి 42.3, కరీంనగర్ 44.4, మహబూబ్‌నగర్ 40.2, మెదక్ 43.2, నల్లగొండ 45.1, నిజామాబాద్ 45.2, రామగుండం 43.6, కొమురం భీం ఆసిఫాబాద్ 42.2, మహబూబాబాద్ 43.3, మంచిర్యాల 42, మేడ్చల్ 41, ములుగు 42.4, నాగర్‌కర్నూల్ 42, రంగారెడ్డి 43.1, సంగారెడ్డి 45.1, సిద్ధిపేట 42, సూర్యాపేట 44.2, పెద్దపల్లి 44.2, నారాయణపేట 41, నిర్మల్ 43, రాజన్న సిరిసిల్ల 41.5, వికారాబాద్ 39.2, వనపర్తి 39.6, వరంగల్ 42.3 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.
కోస్తా ఆంధ్రలో సోమవారం రాత్రి…
కోస్తా ఆంధ్రలో సోమవారం రాత్రి, బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30 నుంచి -40 కి.మీల) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో సోమవారం రాత్రి, బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 40 నుంచి -50 కి.మీల) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి, మంగళవారం చిత్తూరు, కర్నూలు జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Chance of rain today in Telangana