Home కలం సాహిత్యాకాశంలో చందమామ కృష్ణసోబ్ది

సాహిత్యాకాశంలో చందమామ కృష్ణసోబ్ది

sobti

సాహిత్యకారులను సన్మానించుకోవడం అన్ని దేశాలలోనూ, అన్ని సమాజాలలోనూ ఉన్నదే. అందుకు కారణం సాహిత్యకారులు సమాజహితం కోసం ఆలోచిస్తారని, వర్తమానాన్ని అధిగమించి భవిష్యత్ స్వప్నాలను వర్తమానంలోకి సాక్షాత్కరింపచేయగలిగినవారు సాహిత్యకారులని మానవులందరూనమ్మడమే. సాహిత్యమంటేనే హితముతో కూడినదని అర్థము. ఎవరిహితము? సమాజహితము. ఈ విషయము నిర్వివాదాంశము కనుకనే మన దేశమునందునూ సాహిత్యకారులు గౌరవింపబడుతున్నారు. జ్ఞానపీఠపురస్కారమన్నది మన దేశమందలి అత్యున్నత సాహిత్య పురస్కారం. రచన విద్యా సంబంధిత విషయము. విద్య, జ్ఞాన సాధనకు మూలము. కనుక రచనా వ్యాసంగములో అత్యున్నత స్థాయినందుకొన్నవారు అధిష్ఠించవలసినది జ్ఞాన పీఠమే కదా!
ఈ కారణముగనే మనము సంవత్సరమున కొక సాహిత్యకారుణ్ని జ్ఞానపీఠాన్నధిరోహింపచేస్తున్నాము. 2017వ సంవత్సరానికి గాను జ్ఞానపీఠమనే అందలాన్నెక్కే గౌరవం తొంబైరెండేళ్ళ వయో వృద్ధురాలికి దక్కింది. ఆవిడ పేరే కృష్ణా సోబతి. వయోవృద్ధురాలైనందునగాక జ్ఞానవృద్ధురాలైనందున, సాహిత్యాకాశంలో చందమామ వలె ప్రకాశిస్తున్నందున ఆవిడ ఈ పురస్కారానికి అర్హురాలైంది.
ఇంగ్లీష్ అక్షరాలను బట్టి ఆవిడను ‘సోబ్తి’ అనాలి కాని ఆవిడ తన పేరును హిందీలో రాసుకొనే విధానాన్ని బట్టి ‘సోబతి’ అనాలి. తెలంగాణలోని ‘సోపతి’ సంబంధపదమన్న మాట ‘కృష్ణా సోబతి’ అంటే కృష్ణమన స్నేహితురాలు అని మనం, అంటే తెలుగు వాళ్ళం అర్థం చేసుకోవాలన్న మాట.
అఖండ భారతదేశంలోని పంజాబు రాష్ట్రానికి చెందిన గుజరాత్ గ్రామంలో జన్మించారు కృష్ణా. కాశ్మీరు రాష్ట్రానికి సరిహద్దుల్లో వున్న గుజరాత్ చీనాబ్ నది ఒడ్డున వున్నది. రమణీమమైన ప్రకృతి ఒడిలో బహుసుందరంగా సాగింది, కృష్ణాసోబతి బాల్యం. ఆరోజుల్లో ఆవిడ గుఱ్టపు స్వారీని కూడా నేర్చుకొంది.
కృష్ణా తల్లి సాధారణ గృహణి.తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి (సివిల్ సర్వెంటు). ఈ కారణంగా ఆవిడ బాల్యమంతా సిమ్లా, ఢిల్లీల మధ్య గడిచింది. లాహోర్ లోనూ గడిచింది. ఆ రోజుల్లో ఆవిడకు లాహోర్ ముందర ఢిల్లీ పల్లెటూరులా కనిపించేదట. 1930లో అంటే అప్పుడు కృష్ణాకు ఐదేళ్ళవయస్సు సిమ్లాలో హిందీ కవుల సభ జరిగిందట. కిందిరోడ్డు గుండా కవులు ఊరేగింపుగా వెళుతుంటే పై రోడ్డు నుండి పిల్లలు ఆ కవుల మీద పూల వర్షాన్ని కురిపించారట. ఆ పూల వర్షాన్ని కురిపించిన బాలల్లో కృష్ణా కూడా వుంది. ఆనాటి ప్రఖ్యాత కవి సూర్య కాంత్ త్రిపాఠి నిరాలా ప్రస్ఫుటంగా ఊరేగింపులో కనిపించిన దృశ్యం ఈ నాటికీ ఆవిడమనోఫలకంపై నుండి చెరిగిపోలేదు. సిమ్లా లోని లేడీ ఇర్విన్ స్కూల్లో చదువుకున్నారు కృష్ణా.
లాహోర్‌లోనిఫతేచంద్ కాలేజీలో ఆవిడ పట్టభద్రురాలైంది., అదే కాలేజీలో ఆవిడకన్నా ఒక తరగతి ఎక్కువ చదువుతున్న ‘శివనాథ్’ తదుపరి కాలంలో ‘కృష్ణా’ ను వివాహమాడాడు. ఇద్దరి జన్మతిథి 18.2.1925 ఒక్కటే. అంతేకాదు శివనాథ్ సాహిత్యకారుడుకూడా. అతనిని కూడా సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. జ్ఞాన పీఠపురస్కారం సంస్థ అధ్యక్షుడు నామవరసింహ కృష్ణా సోబతి అని నవలారచనలో నూతన మార్గన్వేషిణిగానూ, హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి విదుషీ మణి గానూ అభివర్ణించారు.
1980లో ‘జిందగీనామా’ అన్న నవలను రచించినందుకు గాను కృష్ణాసోబతికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. 1996లో సాహిత్య అకాడెమి ఫెలోషిప్ లభించింది. ఇది అత్యంత ఆదరణీయమైన పురస్కారమని సాహిత్య కారులు భావిస్తారు. 1981లో శిరోమణి అవార్డును, 1982లో హిందీ అకాడెమీ అవార్డును , 2008లో న్యూఢిల్లీ హిందీ అకాడెమీ వారి శీలాకా అవార్డును పొందారు. ఇవికాక హిందీలో అత్యంత గౌరవ ప్రదమైన మైథిలీ శరణ్ గుప్త పురస్కారాన్ని సైతం పొందారు. 1999 లోనే కథా చూడామణి పురస్కారాన్ని పొందారు.
2010 లో పద్మ భూషణ్ ఇస్తామంటే వద్దని తిరస్కరించారు. 2015లో అవార్డు వాపసీ ఉద్యమంలో ముందు వరుసలో నుంచుని తన సాహిత్య అకాడెమీ అవార్డును వాపసిచ్చారు. 2017లో తన తొంభై రెండవ ఏట జ్ఞాన పీఠాన్ని అధిష్ఠించారు. ఆవిడ ‘సమయ్‌సర్గమ్ ’ నవలకు కె.కె. బిర్లా పౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మక వ్యాస సమ్మాన్’ పురస్కారాన్ని కూడా పొందివున్నారు.
పూర్వం రచయిత యొక్క ఉత్క్రుష్ట రచనను ఏదో ఒక దానిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించేవారు. ఇప్పుడు పీఠము వారి ధోరణి మారింది. ఒక రచయిత జీవితకాల సాహిత్య తపస్సును కొలమానంగా చేసికొని పురస్కారాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తొంభై రెండేళ్ళావిడ గతంలో ఎన్నడో చేసిన సేవలకు గాను పురస్కారాన్ని ప్రకటించి వుంటారు అని మనమనుకుంటే పప్పులో కాలేసినట్లే.
ఆవిడ ఈ సంవత్సరం రెండు నవలలను విడుదల చేసింది. అందులో ఒకటి ఆత్మ కథాత్మక నవల ‘గుజరాత్ పాకిస్థాన్ సే గుజరాత్ హిందుస్థాన్’ మరి ఆవిడ ఈ వయసులో చిన్న పిల్లలాగంతులేస్తూ తిరుగుతోందా అంటే అదీ లేదు. ఒక కాలు ఇంట్లో వుంటే మరో కాలు ఆసుపత్రిలో వుంటోంది. ఆవిడ మనస్సు, దేహమూ ఎంతగా సాహిత్యానికి అంకితమై పోయామో తలచుకొంటే ఒళ్లు పులకించదూ.
కృష్ణా సోబతి పుట్టిన గుజరాత్ గ్రామం ఇప్పుడు పాకిస్థాన్‌లో వుంది. దేశ విభజన తరువాత ఆవిడ ఢిల్లీకి వచ్చేసింది. ఆవిడ మొదటికథ ‘దాదీ అమ్మా’ హిందూస్థాన్ టైమ్స్‌లో ప్రచురితమైంది. కాని ‘ఔర్ సిక్కా బదల్ గయా’ నే ఆవిడ మొదటి కథగా చెప్పుకోవడం ఆమెకిష్టం ‘వాత్సాయన’ గారి సంపాదకత్వంలో అచ్చైన కథ అది ఆ కథలోని అంశాలు కొన్నింటి పట్ల ఆయనకు అభ్యంతరాలున్నా కథను వారు యథాతథంగా ముద్రించారట. అదీ ఆవిడ ఆనందం.
ఆవిడ తొలి కథానిక ఔర్‌సిక్కా బదల్‌గయా’ జ్ఞానపీఠం ప్రకటింపబడేనాటికి వెలువడిన చివరినవల ‘గుజరాత్ పాకిస్థాన్‌సే గుజరాత్ హిందుస్థాన్’ రెండింటి ప్రధానాంశమూ దేశ విభజనమే అది మనషులు మానవత్వాన్ని మరిచిపోయిన వేళ అంటారు కృష్ణా సోబతి మానవత్వం మరిచిన మనిషి కృత్రిమ వీరత్వ ప్రదర్శనకు పనికి వచ్చే పనిముట్లైనారు స్త్రీలు అంటుందావిడ.ఈమతమూ ఆ మతమూ అని లేదు. ఎదుటిమతానికి చెందిన స్త్రీ అయితే చాలు ఆమెను చెరచి తన వీరత్వన్ని ప్రదర్శిం చుకొనవచ్చును. తొలికథనూ, చివరి నవలనూ కలిపి చదువు కుంటేగాని దేశ విభజన సందర్భంగా స్త్రీలు పొందిన వర్ణనా తీతమైన వ్యథ మనకర్థం కాదు అంటారు విమర్శకులు. 2005 లో ఆవిడ నవల ‘దిలో దానిష్’ను ‘ది హార్ట్ హాజ్‌ది రీజన్’ అన్న పేరిట వీమా ఆనంద్ , మీనాక్షిస్వామి ఆంగ్లంలోకి అనువదించగా భారతీయ భాషల అనువాద సాహిత్య ప్రక్రియల పురస్కారం ‘క్రాస్‌వర్డ్ అవార్డు లభించింది.
నఫీజా, జిందగీనామా, మిత్రో మర్జాని, సూరజ్ ముఖి అంధేరేకీ, సమయ్ సర్గమ్ మొదలగునవి ఆవిడ రాసిన ఇతర నవలలు. ఔర్‌సిక్కాబదల్‌గయా,’ ‘డార్ సెబిఛురె’ ‘బాదలోంకేఘే’ మొదలగున్నవి కృష్ణా సోబతి కథా సంపుటులు. ‘తిన్ పహాడ్’ యారోంకేయార్’ వంటివి యాత్ర చరిత్రలు. ‘సోబతి ఎకా సోహాబాత్’ వంటి జ్ఞాపకాలను కూడా రచించారు.
‘హమ్ హష్మత్ ’ అంటూ తనకు పరిచయంలో వున్న కవి మిత్రుల జీవితాలను రెండు భాగాలుగా పరిచయం చేశారు, కృష్ణా సోబతి. అయితే వాటిని ‘హష్మత్’ అన్న పురుష నామంతో రాశారు. పురుష నామంతో రచించినపుడు నారచనాశైలి మాత్రమే కాదు నేను అక్షరాలు రాసే తీరుకూడా మారిపోయింది. ఇందుకు కారణం నారచనల్లోకి నా అంతరాత్మ దిగిపోవడమే ’ అన్నారు కృష్ణా.
“నేను తునీషిమా వెళ్ళినప్పుడు నాకు పరిచయం లేని మహ్మదీయ యువతి నాకోసం అక్కడ ‘హల్వా’ను తెప్పించింది. భారతీయత విశ్వజనీనమైనది. మన ప్రభుత్వాలు కోరుకొనేంత సంకుచితమైనది కాదు.” అన్నారు కృష్ణాసోబతి.
కృష్ణా రచనలు అశ్లీలపుటంచులలో నర్తిస్తాయని రచనల్లో సున్నితత్వంకు మగవారి కరకుతనం ఎక్కువగా కనిపిస్తుందని విమర్శకులంటారు.
దానికి సమాధానంగా ఆవిడ ఇలా అంటారు. ‘ప్రతి స్త్రీలోనూ పురుషులుంటారు. ప్రతి పురుషునిలో ఒక స్త్రీ ఉంటుంది. మిత్రో మర్జాని నవలలో మిత్రో తన అనాచ్ఛాదిత వక్షాన్ని కాంక్షా భరితంగా చూచుకోవడంలో మిత్రోలోని పురుషుడు ప్రధాన పాత్ర వహిస్తున్నాడన్నమాట.
తాను సృజించిన కఠినాత్మురాండ్రైన స్త్రీలలో సున్నితత్వ ప్రతిపాదనలెందుకు అన్నదానిని సమాధానంగా ‘మా అమ్మ పేరు దుర్గ. పెళ్ళి కాకముందు ఆవిడ గుఱ్ఱపు స్వారి చేయడమే కాక, లొంగి రాని గుఱ్ఱలను లొంగదీసేదానిగా పేరు పొందింది. కాని కాపురానికి వచ్చేప్పుడు ఆవిడ వెంటతెచ్చుకొన్నవి ‘సుహాగ్ రాత్ ’ ‘రమణి రహస్య’ అన్న పుస్తకాలు. స్త్రీలలోని ఈ రెండు పార్శాలనూ భారత దేశం ప్రేమిస్తుంది. అర్ధనారీశ్వర తత్తమంటే ఇదే. నేను సృజించిన పాత్రలన్నీ ఈ తత్తాన్ని నిరూపించేవే అంటారు కృష్ణా మీ తరం రచయితలు ఆంగ్లంవైపుగావెళ్ళారు. మీరు మిమ్మల్ని హిందీ భాషకు కట్టేసుకున్నారెందుకు అన్నా ప్రశ్నకు సమాధానంగా మాలిక్ ముహ్మద్ జాయ్‌సీ, తులసీదాస్, సూరదాస్, కబీర్ దాస్ వీళ్ళంతా హిందీలోనే కదా రాసింది. హిందీ భాషకు ఒక ప్రత్యేక మైన ధ్వని ప్రపంచంవున్నది. ఆ ప్రపంచాన్నుండి నాకు ఉన్నట్టుండి అద్భుతమైన నాదాలు వినిపిస్తాయి. అన్నారు కృష్ణా.
కృష్ణా రచించే హిందీలో హిందీ ఉర్దూ పంజాబీ సంస్కృతము మిళితమై వుంటాయి. తొలినాళ్ళలో ఇది సరియైన విధానం కాదని అమృత్‌లాల్ సాగర్ అనే సాహిత్య విమర్శకుడన్నాడట. దాని కావిడ ఓ పదేళ్ళాగి చూడమందట. పదేళ్ళ తర్వాత కృష్ణా సోబతి భాషే నిలచింది. కారణం పలువురు రచయితలు కృష్ణా మార్గాన్ని ఎన్నుకోవడమే.
మీరు స్త్రీ సాహిత్యాన్ని బాగా రాస్తారు అని ఎవరో మెచ్చుకున్నారట. సమాధానంగా కృష్ణా ఇలా చెప్పారు. స్త్రీ సాహిత్యం పురుషసాహిత్యం అనివిడిగా వుండవు. సిద్ధాంతకర్తలు అలాంటి సంకుచిత నామాలను ఇస్తే ఇస్తూండవచ్చు. నాకుమాత్రం స్త్రీపురుష సంలీనతను పొందిన పాత్రలున్నరచనలే గొప్ప రచనలని పిస్తాయి. రచయితలూ అలానే వుండాలి.
నేను నాలుగు తరాలను చూచాను. దేశానికి స్వాతంత్య్రం లభించిన తరంలోని కవులు విశ్వవ్యాప్తంగా చదువబడ్డారు. కవులు ఈ దేశపు ఆత్మగా నిలబడాలని మేము భావించాము. అది ఈ నాడు కనపడడం లేదు. అన్నారు. కృష్ణా సోబతి నాలుగు నెలల క్రితం ఒక ఆంగ్లపత్రిక కిచ్చిన ఇంటర్వూలో స్పష్టమైన ఆలోచనలు, బలమైన రచనలు కలకాలం నిలచి పోయే రచనలు, వెరసి కృష్ణా సోబతి తొంభైరెండవ యేట జ్ఞాన పీఠాన్న ధిరోహించిన విదుషీమణి, కృష్ణాసోబతి నూట ఇరువదేళ్ళు జీవించిపూర్ణాయుష్కురాలిగా సాహిత్య సామ్రాజ్యాన్నేలాలని ఆశిద్దాం.