Home ఎడిటోరియల్ నిరాశకు తావివ్వరాదు

నిరాశకు తావివ్వరాదు

Sampadakiyam        చంద్రుడి ఉపరితలమ్మీద దిగడానికి ల్యాండర్ విక్రమ్ చేసిన యత్నం విజయవంతం కాలేకపోయినప్పటికీ చంద్రయాన్ 2 తన లక్ష సాధనలో 95 శాతం సఫలమైందని భారత అంతరిక్ష విభాగం మాజీ కార్యదర్శి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ జి. మాధవన్ నాయర్ చేసిన వ్యాఖ్య మన శాస్త్రజ్ఞుల కృషి బూడిదలో పోసిన పన్నీరు కాలేదని రుజువు చేస్తున్నది. చంద్ర కక్షలో విడిచిపెట్టిన ఆర్బిటర్ దాని పరిభ్రమణం చక్కగా కొనసాగిస్తున్నదని అది అక్కడి దృశ్యాలను నిర్విఘ్నంగా చిత్రీకరించి పంపుతుందని చంద్రోపరితలం మ్యాపులను విడుదల చేస్తూ ఉంటుందని అక్కడి బాహ్య వాతావరణంపై అధ్యయనం కూడా సాగిస్తుందని మాధవన్ నాయర్ వివరించారు.

ల్యాండర్ అతి నెమ్మదిగా చంద్రుడిపై దిగడమనే అతి సున్నితమైన స్వల్ప వ్యవధి అంతిమ ఘట్టం చంద్రయాన్ 2కి నిర్దేశించిన అనేక లక్షాలలో ఒకటి మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం యాత్రలో ఈ ఘట్టమే అతి కీలకమైనదని ముందు నుంచి అనుకొంటున్నదే. చివరి దశలో చంద్రోపరితలానికి 2.5 కిలోమీటర్ల అతి సమీపంలో ఉండగా ల్యాండర్ గమనం ఆగిపోడం, సంకేతాలు తెగిపోడం వాస్తవానికి దేశాన్ని అత్యంత నిరాశకు గురి చేసింది. అయితే అంత వరకు సాగిందంతా ఘనాతి ఘన విజయమేనని మాధవన్ నాయర్ మాటలను బట్టి అర్థమవుతున్నది. ఏ పాటి తేడా అయినా వైఫల్యమే, దీనిని ఎవరూ కాదనలేరు. అప్పటి వరకు ఆనందాతిరేకంలో మునిగిన ఇస్రో శాస్త్రజ్ఞుల బృందం ల్యాండింగ్ వైఫల్యాన్ని జీర్ణించుకోలేక విషాదంలో మునిగిపోడం సహజమే, అర్థం చేసుకోదగినదే.

ఇస్రో చైర్మన్ శివన్ ప్రధాని నరేంద్ర మోడీ ముందు కన్నీటి పర్యంతమైన దృశ్యం అంతిమ విజయాన్ని చూడ్డం కోసం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మేలుకొని ఎదురు చూసిన జాతి హృదయాన్ని కలచివేసింది. ప్రధాని మోడీ చాలా హుందాగా వ్యవహరించి శాస్త్రజ్ఞుల కృషిని మెచ్చుకున్నారు. వైఫల్యాల సోపానాలపై నుంచే విజయ లక్షాన్ని అందుకోగలగడం చరిత్ర చెప్పిన సత్యం. గత 60 ఏళ్లల్లో పలు దేశాలు చేపట్టిన చంద్ర యాత్రల్లో 40 శాతం విఫలమయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెలిబుచ్చిన సమాచారమే ఇందుకు నిదర్శనం. ఈ కాలంలో మొత్తం 109 చంద్రయాన ప్రయోగాలు జరగగా అందులో 61 మాత్రమే విజయవంతమయ్యాయని, 48 విఫలమయ్యాయని నాసా వివరించింది. 2018 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రయోగించిన బేర్ షీట్ చంద్రయాన ప్రయోగం ఆ ఏడాది ఏప్రిల్‌లో భగ్నమైంది.

1958 నుంచి 2019 వరకు అమెరికా, రష్యా, జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, ఇజ్రాయెల్ వివిధ రకాల చంద్రయాన ప్రయోగాలను చేపట్టాయి. అందులో కొన్ని ఆర్బిటర్‌ను చంద్ర కక్షలో ప్రవేశపెట్టడం, మరి కొన్ని చంద్రోపరితలం మీద ల్యాండర్లను దింపడం, ఇంకొన్ని చంద్రునికి చేరువగా వెళ్లడం వరకు ఉన్నాయి. 1958లో అమెరికా మొట్టమొదటి సారిగా చేపట్టిన చంద్రయాత్రకు సంబంధించిన పయనీర్ ఒ ప్రయోగం కూడా విఫలమైంది. 1959లో చంద్రుడి చెంతకు సోవియట్ యూనియన్ జరిపిన చంద్ర యాత్ర ప్రయోగం మాత్రమే మొదటి విజయం. 1958 ఆగస్టు నుంచి 1959 నవంబర్ వరకు సుమారు ఏడాదికి మించిన కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్లు 14 చంద్ర ప్రయోగాలు చేయగా అందులో సోవియట్ ప్రయోగాలు మూడు (లూనా 1, లూనా 2, లూనా 3) మాత్రమే విజయవంతమయ్యాయి.

ఆదిలో 1958 నుంచి 1979 వరకు గల 21 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో అమెరికా, సోవియట్‌లు మాత్రమే చంద్రయాత్ర ప్రయోగాలు చేపట్టాయి. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ సారథ్యంలో ముగ్గురితో కూడిన అపోలో 11 చంద్ర యాత్ర తొలిసారిగా మనిషిని చంద్రుడిపై నిలబెట్టి చరిత్ర సృష్టించింది. జపాన్, యూరోపియన్ యూనియన్, చైనాలు చాలా ఆలస్యంగా ఈ పోటీలో ప్రవేశించాయి. ఇప్పుడు చంద్రయాన్ 2 ఆఖరు దశలో సంకేతాలు తెగిపోయి చతికిలబడిన ల్యాండర్‌తో తిరిగి సంబంధాలు ఏర్పరచుకోడం గాని, దానిని మళ్లీ దారికి తెచ్చుకోడం గాని బొత్తిగా సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తే ఈ వైఫల్యానికి అసలు కారణమేమిటో ఇస్రో శాస్త్రజ్ఞులు తెలుసుకోగలుగుతారు. దాని ఆధారంగా ఈసారి ఎటువంటి అపజయానికి ఆస్కారం బొత్తిగా ఉండని సర్వ సమగ్ర చంద్రయానాన్ని చేపట్టి విజయవంతం చేయగలుగుతాం. అంతరిక్ష పరిశోధనల్లో మరెన్నో మైలు రాళ్లను దాటి మానవాళి పురోగమనానికి విశేషంగా తోడ్పడగలుగుతాం. అటువంటి మంచి రోజుల కోసం ప్రగాఢమైన ఆత్మ విశ్వాసంతో ఎదురు చూద్దాం. ముందుకు సాగుదాం.

Chandrayaan 2 Mission 95 per cent objective achieved