Home జాతీయ వార్తలు ఈ పున్నమి.. ఈ వెన్నెల

ఈ పున్నమి.. ఈ వెన్నెల

Chandrayaan-2

ఒకే రోజు రెండు ఇంపైన చంద్రయానాలు,చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం

 దూసుకుపోయిన జిఎస్‌ఎల్‌వి ఎంకె 3 ఎం 1
బయలుదేరిన 16నిమిషాల 13సెకండ్లలకే నిర్ణీత
భూ కక్షలో ప్రవేశించిన చంద్రయాన్ – 2
3850కిలోల పేలోడ్, సెప్టెంబరు
6-7 తేదీలలో చంద్రునిపై దిగనున్న ల్యాండర్ చంద్రయాన్-2లో 13 పరికరాలు
3.84లక్షల కిలోమీటర్ల దూరంలోని చందమామను చేరుకోనున్న మిషన్
చంద్రుడిపై దిగే అపురూప అద్భుత క్షణమే ఉత్కంఠ పూరితం, అది విజయవంతమైతే రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్

శ్రీహరికోట: భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృత మైంది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. జాబిల్లిపై పరిశోధనల కోసం శ్రీహరికోటలోని ఇస్రో నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20 గంటల కౌంట్‌డౌన్ అనంత రం 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్2 ఉపగ్రహాన్ని మోసుకొని సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు ఇస్రో ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి ఎంకె3-ఎం1 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జాబిల్లి వైపు బయల్దేరిన వాహకనౌక 16 నిమిషాల 13 సెకండ్లకు కక్షలోకి ప్రవేశించాక వాహక నౌక నుంచి చంద్రయాన్-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్షలోకి 3,850కిలోల బరువైన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.
ఈ నెల 15వ తేదీన చేపట్టిన తొలి ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో విఫలం కావడంతో నిరాశ చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు మలి ప్రయోగం నేడు విజయవంతం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. రూ.978 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రయోగంతో భారత్ చంద్రునిపై రోవర్‌ను దించిన నాలుగవ దేశంగా ప్రపంచ అంతరిక్ష చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకోనున్నది. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలలో హర్షం వ్యక్తమైంది. ఇతర శాస్త్రవేత్తలతో పాటు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని తిలకించిన ఇస్రో అధిపతి కె శివన్ నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహం ప్రవేశించిన మరుక్షణం కరతాళధ్వనులతో తన ఆనందాన్ని ప్రకటించి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రుని వైపు భారతదేశం చేపట్టిన చారిత్రక యాత్రలో ఇది ఆరంభమని ఆయన ప్రకటించారు.
నిజానికి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించాల్సి ఉండగా ప్రయోగానికి సరిగా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని ఇస్రో నిలిపివేయవలసి వచ్చింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుడి దక్షిణ ధ్రువానికి ఈ ఏడాది సెప్టెంబర్ 6-7 తేదీల నాటికి చేరుకుని భూమికి దాదాపు 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న జాబిల్లిపైన సురక్షితంగా దిగుతుంది(సాఫ్ట్ ల్యాండింగ్). ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. గతంలో రష్యా, అమెరికా, చైనా దేశాలు చంద్రునిపై ల్యాండ్‌రోవర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేశాయి.
చంద్రయాన్-2లో మూడు ముఖ్యమైన పరికరాలైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను ఇస్రో ఏర్పాటు చేసింది. మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడికి 200 కిలోమీటర్ల పైన కక్షలో చంద్రుడి పరిభ్రమిస్తుంది. దీని బరువు సుమారు 1400 కిలోలు ఉంటుంది. మరొకటి ల్యాం డర్. ఇది చంద్రుడి ఉపరితలం మీది దిగుతుంది. ఇది చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనేలా కాకుండా సురక్షితంగా(సాఫ్ట్ ల్యాండ్) దిగేలా రూపొందించడం జరిగింది. దిగిన తర్వాత ఇది రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. చక్రాలతో కూడిన ఈ రోవర్ నౌరశక్తితో చంద్రుని ఉపరితలం మీద తిరుగుతూ మట్టి, రాళ్ల నమూనాలను సేకరిస్తుంది. వాటిని రసాయనిక విశ్లేషణ చేసి వాటి సమాచారాన్ని ల్యాండర్‌కు చేరవేస్తుంది. ల్యాండర్ ఆ సమాచారాన్ని అర్బిటర్‌కు పంపుతుంది. ఆర్బిటర్ ద్వారా ఆ సమాచారం భూమిలోని నిర్దేశిత కేంద్రానికి చేరుతుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయాక చంద్రుడిపై దిగే 15 నిమిషాలు తమకు అత్యంత కీలకమైనవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఈ అంతరిక్ష నౌకలో ఇస్రో 13 పరికారాలను అమర్చింది. ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంగా వెళ్లి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడంతోపాటు రాయి, మట్టి నమూనాలను సేకరిస్తాయి. రోవర్ సెకండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే(చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద 14 రోజులకు సమానం. ఈ 14 రోజుల్లో రోవర్ 500 మీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై వాతావరణాన్ని పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారం చేరవేస్తుంది.
గతంలో ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో దిగనందు వల్ల చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా చంద్రుడిపై కొత్త సమాచారం లభించగలదని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. కాగా, గతంలో ఇస్రో చంద్రుడిపైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతమైంది. భారత్ తొలిసారి రూపొందించిన చంద్రయాన్-1 ఉపగ్రహం 2008లో ప్రయోగించారు. రెండేళ్లు పనిచేస్తుందని తొలుత అంచనావేయగా చంద్రుడిపై దిగిన 312 రోజులే అంటే 2009 ఆగస్టు 29 వరకు పనిచేసింది. అయితే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 విజయం సాధించడంతో ఆ ప్రయోగం కొత్త చరిత్రను సృష్టించింది.

chandrayaan 2 mission successful Launched