Home జాతీయ వార్తలు విక్రమ్‌కు ఊపిరి కోసం… ఇస్రో అవిశ్రాంత పోరు

విక్రమ్‌కు ఊపిరి కోసం… ఇస్రో అవిశ్రాంత పోరు

 

బెంగళూరు: కాలంతో పోటీపడుతూ విక్రమ్ ల్యాండర్‌ను రక్షించేందుకు ఇస్రో శతవిధాలా యత్నిస్తోంది. గతితప్పిన ల్యాండింగ్‌తో కూలిన ల్యాండర్ జాడను ఆర్టిటర్ కెమెరాతో గుర్తించారు. అయితే విక్రమ్‌ను తిరిగి పనిచేయించేందుకు ఇప్పుడు మిగిలిన గడువుతో పోటీపడుతూ ఇస్రో శ్రమించాల్సి వస్తోంది. విక్రమ్ ఒక్కటే కాదు లోపల రోవర్ ప్రజ్ఞాన్ కూడా దాగి ఉంది. విక్రమ్ పునురుద్ధరణ జరిగితే సహజంగానే రోవర్ విడివడటానికి చంద్రయాన్ యాత్రకు సంపూర్ణత్వం ఏర్పడటానికి వీలేర్పడుతుంది. జాబిల్లి చెంతకు చేరడానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రమ్ గతి తప్పింది. ఇది హార్డ్ ల్యాండింగ్ అని ఇస్రో ఆదివారం తెలిపింది. భూమి కాలమానం ప్రకారం ల్యాండర్ 14రోజుల పాటు పనిచేస్తుంది. చంద్రుడి కాలం ప్రకారం ఇది ఒక్క రోజే. ఈ నేపథ్యంలో తరిగిపోతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ల్యాండర్‌ను చక్కదిద్దడం కీలక ప్రక్రియగా మారిం ది. సవ్యంగా కక్షలో తిరుగుతున్న ఆర్బిటర్ తమకు ఇప్పుడు ల్యాండర్‌ను చక్కదిద్దే ఆధారం అని ఇస్రో వర్గా లు మంగళవారం తెలిపాయి. ‘ల్యాండర్‌తో సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అని అధికారిక ట్వీటులో ఇస్రో తెలిపింది.
వైఫల్య కారణాలపై ఆరాకు కమిటీ
విక్రమ్ ల్యాండింగ్‌లో తలెత్తిన లోపాలను పసికట్టేందకు ఇస్రో అంతర్గత కమిటీ ఏర్పాటైంది. అన్ని అంశాలను డాటా ప్రాతిపదికన పరిశీలించి త్వరలోనే తగు సమాధానాలతో కారణాలను కనుక్కొంటామని ఒక అధికారి తెలిపారు. కమిటీ పరిశీలనలో తప్పు ఎక్కడ జరిగిందనేది వెల్లడి అవుతుందని, శేష ప్రశ్నలకు జవాబులు రాబట్టుకుంటామని ఇస్రో వర్గాలు తెలిపాయి.
విక్రమ్ పగలలేదు బాగానే ఉంది
ఆర్బిటార్ నుంచి అందిన ఛాయాచిత్రాలు ఇప్పుడు విక్రమ్ స్వరూపాన్ని తెలియచేస్తున్నాయి. విక్రమ్ ఒకే భాగంగా ఉందని, ముక్కలు కాలేదని , చంద్రుడిపై పడి ఉందని చంద్రయాన్ యాత్రతో సంబంధం ఉన్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే విక్రమ్ తిరగబడి ఉంది. సాధారణంగా నాలుగు కాళ్లపై ఉండాల్సింది. కానీ ఆ విధంగా లేదని ఇస్రో వర్గాలు అనధికారికంగా నిర్థారించాయి. అది పక్కకు తిరిగి పడి ఉన్న విషయాన్ని గుర్తించామని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి తెలిపారు. ఇంతవరకూ ల్యాండర్ ఏ పరిస్థితులలో ఉందనే అంశాన్ని ఇస్రో వారు అధికారికంగా అయితే ప్రకటించలేదు. దీనితో విక్రమ్ పరిస్థితి గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. నిర్ణీత 14 రోజుల గడువులోపలే విక్రమ్‌ను తిరిగి పనిచేయించడమే తమ ముందున్న అవకాశం అని ఇటీవలే ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. దిగాల్సిన చోటుకు 500 మీటర్ల దూరంలో విక్రమ్ చంద్రుడిని బలంగా తాకింది.
యాంటెనాను చక్కదిద్దే చర్యలు
ఒరిగిపోయి ఉన్న విక్రమ్ యాంటెనాను చక్కదిద్దితే సంబంధాల పునరుద్ధరణకు వీలేర్పడుతుంది. ఈ దిశలో ప్రయత్నాలు సాగుతున్నాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. అన్ని ప్రయత్నాలను పట్టువీడకుండా జరుపుతున్నామని వివరించారు. ల్యాండర్‌లోని కంప్యూటర్ లేదా సాఫ్ట్‌వేర్ లేదా సెన్సార్‌లలో తలెత్తిన అసాధారణ స్థితితోనే ల్యాండింగ్ గతి తప్పి ఉంటుందని, తుది దశలో వేగం తగ్గింపు ప్రక్రియలో జరిగిన పరిణామం ఇప్పటి పరిస్థితికి దారితీసి ఉంటుందని అంచనా వేశారు.
పరువు నిలిపిన ఆర్బిటర్‌కు దండిగా ఇంధనం
చంద్రయాన్ 2లో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడం కీలకమైన ఎదురుదెబ్బ అయితే, దీనికి ఉపశమనంగా ఆర్బిటర్ సవ్యంగా పనిచేయడం ఆశలను రేకెత్తించింది. 2379 కిలోల బరువు ఉండే ఆర్బిటర్ జీవన కాల పరిమితి ముందుగా ఏడాదే అనుకున్నారు. అయితే దాదాపు ఏడేళ్ల వరకూ ఇది మనగల్గుతుందని నిర్థారణ అయింది.
అంతేకాకుండా ఇది నిక్షేపంగా పనిచేసేందుకు అవసరం అయిన ఇంధనం దండిగా ఉంది. దీనితో కక్షలో దీనికి ఎటువంటి ప్రతికూలత ఏర్పడదని ఇస్రో శాస్త్రజ్ఞులు ఒకరు తెలిపారు. అవసరం అనుకున్న అదనపు ఇంధనం ఇప్పటికీ రిజర్వ్‌గానే ఉంది. దీనిని అవసరం అయితే ఆర్బిటర్ చలనానికి వాడుకోవడం జరుగుతుందని వివరించారు. వాహక నౌక జిఎస్‌ఎల్‌వి ఎంకె 3 పనితీరు, సమర్థవంతంగా ప్రయోగం జరగడంతో ఆర్బిటర్‌కు అదనపు ఇంధన సామర్థం ఏర్పడింది. ఈ విధంగా దీని జీవితకాలం ఒక ఏడాది నుంచి ఏడేళ్లకు పెరిగిందని అధికారులు వివరించారు. చంద్రయాన్ 2 బహుళార్థ సాధక లక్షపు ప్రాజెక్టు అని, పలు కోణాల నుంచి చంద్రుడిపై పరిశోధనలకు ఉద్ధేశించిన ఈ ప్రయోగం ఆద్యంతం అత్యంత సంక్లిష్టమైనదని, ఇటువంటి ప్రయోగాలలో సంపూర్ణ విజయానికి దాదాపుగా దరిదాపుల వరకూ చేరుకున్నామని ఇస్రో వర్గాలు అనధికారికంగా సంతోషం వ్యక్తం చేశాయి.

Chandrayaan-2’S Vikram lander is not broken: ISRO