Home Default వచ్చే ఏడాది చంద్రయాన్- 3

వచ్చే ఏడాది చంద్రయాన్- 3

ISRO Chief Sivan

గగన్‌యాన్‌కు వ్యోమగాములు
ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడి

బెంగళూరు: చంద్రయాన్ 3 యాత్రను వచ్చే ఏడాది చేపడుతారు. ఇక ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురిని ఎంపిక చేశారు. ఈ విషయాలను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె శివన్ బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కొత్త సంవత్సరం ఆరంభం నేపథ్యంలో సంస్థ తలపెట్టిన పలు కార్యక్రమాలను ఆయన వెల్లడించారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిందని శివన్ తెలిపారు. చంద్రుని వద్దకు మూడో దఫా యాత్ర వచ్చే ఏడాది జరుగుతుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాదే (2020)లోనే చంద్రయాన్ 3 ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక్కరోజు క్రితమే చెప్పారు. అయితే ఈ ఏడాది ఈ ప్రయోగం ఉండదని శివన్ స్పష్టం చేశారు.

గగనయాన్ కోసం రష్యాలో శిక్షణ
ఇక అంతరిక్ష శాస్త్రీయ పరిశోధనలలో భారతదేశం కీలకంగా భావిస్తోన్న గగన్‌యాన్ కోసం వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇస్తారని వెల్లడించారు. భారతీయ వాయుదళానికి చెందిన నలుగురిని గగన్‌యాన్ కోసం ఎంపిక చేయడం జరిగింది. వీరిని ధీటైన వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు రష్యాలోని అంతరిక్ష కేంద్రాలకు తగు శిక్షణకు పంపిస్తారని శివన్ చెప్పారు. గగన్‌యాన్‌కు ఎంపికైన వారంతా మగవారేనని తెలిపారు. వీరికి రష్యాలో ఈ నెల మూడో వారం నుంచే శిక్షణ అందుతుందని , గత ఏడాది గగన్‌యాన్‌కు సంబంధించి సంస్థ పురోగతి సాధించిందని, నమూనాల రూపకల్పన, వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందని వివరించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం భారతదేశం రష్యా, ఫ్రాన్స్‌లతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమం గురించి ప్రధాని మోడీ 2018 నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు.

చంద్రయాన్ 3కి రూ 600కోట్లకు పైగా
చంద్రయాన్ 3 ఇంతకు ముందటి చంద్రయాన్ 2ను పోలి ఉంటుంది. ఇందులో కూడా ల్యాండర్, రోవర్, ఇంధన శక్తి ఏర్పాట్లు ఉంటాయి. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగాలకు సంస్థ ప్రాధాన్యతను ఇస్తుందని శివన్ చెప్పారు. ఇటు చంద్రయాన్ 3, అటు గగన్‌యాన్‌ల కోసం ఏకకాలంలో అన్ని స్థాయిల పనులు జరుగుతున్నాయి. చంద్రయాన్ 3లో ఆర్బిటార్ ఉండదని, చంద్రయాన్ 2లో పంపించిన ఆర్బిటార్ సక్రమంగా ఉన్నందున, మరో ఏడేళ్లు ఇది పనిచేసే వీలున్నందున కొత్త ఆర్బిటార్ అవసరం లేదన్నారు. ముందుగా ఈ ఏడాదే చంద్రయాన్ 3 ఉంటుందని అనుకున్నామని, అయితే ఈ ప్రాజెక్టుకు కనీసం 14 నుంచి 16 నెలల సమయం పడుతుందని, ఈ మేరకు వచ్చే ఏడాదే దీనిని కక్షలోకి పంపించడం సాధ్యమవుతుందని వివరించారు. చంద్రయాన్ 3 ఇంతకు ముందటి చంద్రయాన్ 2ను పోలి ఉంటుంది.

ఇందులో కూడా ల్యాండర్, రోవర్, ఇంధన శక్తి ఏర్పాట్లు ఉంటాయి. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగాలకు సంస్థ ప్రాధాన్యతను ఇస్తుందని శివన్ చెప్పారు. ఇటు చంద్రయాన్ 3, అటు గగన్‌యాన్‌ల కోసం ఏకకాలంలో అన్ని స్థాయిల పనులు జరుగుతున్నాయి. చంద్రయాన్ 3 ప్రయోగానికి అవసరమయ్యే మొత్తం ఖర్చును ఇప్పటికి రూ 615 కోట్లుగా అంచనా వేశారు. చంద్రయాన్ 2కు అయిన వ్యయం రూ 960 కోట్లు. ల్యాండర్, రోవర్, ప్రొపుల్సన్ మాడ్యూల్‌కు కలిపి రూ 250 కోట్లు, ఇక ప్రయోగానికి అయ్యే ఖర్చు రూ 365 కోట్లుగా అంచనావేశారని, మొత్తం మీద వ్యయం రూ 600 కోట్లు దాటుతుందని ఇస్రో ఛైర్మన్ వివరించారు.

ఈ ఏడాది పాతిక ప్రయోగాల లక్షం
భవిష్యత్తు కార్యక్రమాల గురించి శివన్ వివరించారు. ఈ ఏడాది మొత్తం పాతిక పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది పూర్తికాకుండా ఉన్న వాటిని ఈ మార్చిలోగా పూర్తి చేయాలని సంకల్పించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో ఇస్రో ప్రయోగ వేదికకు స్థల సేకరణ జరిగిందని తెలిపారు. శ్రీహరికోటలో ఇప్పటికే ఇస్రోకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఒక స్పేస్ పోర్టు ఉంది. గడిచిన ఏడాది ఇస్రో ప్రధానంగా విస్తరణ కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇచ్చింది. ఇదే సమయంలో తలపెట్టిన కార్యక్రమాల అమలుకు సామర్థతను పెంచే దిశగా యత్నించామని శివన్ తెలిపారు.

రూ 14,000 కోట్ల కేటాయింపుల డిమాండ్
పలు రకాల అంతరిక్ష ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యయ అంచనాలను తెలిపింది. 2020 21 కేంద్ర బడ్జెట్‌లో రూ 14000 కోట్లు కావాలని సంస్థ అభ్యర్థించింది.

వేగం తగ్గింపుతోనే వైఫల్యం
చంద్రయాన్ 2లో వైఫల్యానికి ల్యాండర్ విక్రమ్ వేగం తగ్గింపే కారణమని శివన్ తెలిపారు. ఈ ప్రయోగంలో వైఫల్యాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు శివన్ స్పందించారు. వేగం తగ్గింపు కేవలం అంతర్గత కారణాల వల్లనే జరిగిందని అంగీకరించారు. చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగాలలో చంద్రయాన్ 2 తొలి ప్రయోగం . చంద్రుడి ఉపరితలపు దక్షణ ధృవంపై ల్యాండర్‌ను దింపేందుకు యత్నించారు. అయితే ఇది విఫలం అయింది. విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించడంలో విజయం సాధించిన చెన్నైకు చెందిన యువ ఇంజనీర్‌ను శివన్ అభినందించారు. కూలిన పరికరం ఫోటోను విడుదల చేసే పద్ధతి అంతరిక్ష సంస్థకు లేనందున దీని తదుపరి ఫోటోను వెలువరించలేదని వివరించారు.

Chandrayaan-3 launch may happen next year