Home నిర్మల్ గ్రామ రూపు రేఖల్లో మార్పు

గ్రామ రూపు రేఖల్లో మార్పు

Change in village form lines

పంచాయతీరాజ్ నూతన చట్టంతో  గ్రామ రూపు రేఖల్లో మార్పు  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాలు అభివృద్ధి చెంది గ్రామాల రూపరేఖల్లో మార్పు వస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక్కలైన పల్లెలు బలపడితేనే దేశం, జాతి బలపడుతుందనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు పంచాయతీలు బలోపేతం చేసే లక్షంతో నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చారని దీని ద్వారా బడ్జెట్‌లో నేరుగా నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. జనాభా ప్రతిపాదికన ప్రతీ గ్రామపంచాయతీకి కనీసం రూ.5లక్షలు ప్రతీ సంవత్సరం అందిస్తుందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు రూ.10లక్షలు అందిస్తున్నారు. గ్రామస్వరాజ్యమే లక్షంగా రూపొందించిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలు అభివృద్ది చెందుతాయన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి పట్టాదార్ పాస్‌బుక్‌లు, రూ. 6వేల కోట్లను 58లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద అందించనుందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సరఫరా చేయడమే కాకుండా సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు, 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. జిల్లాలో పంటపెట్టుబడి సాయం క్రింద రూ. 175 కోట్లు అందించడం జరిగిందని రైతుల నుంచి రూ. 450 కోట్ల విలువైన మక్కలు,కందులు, వరి మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అలాగే న్యూ పోచంపాడ్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ, సిసి రోడ్లు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టుటకు చర్యలు గైకొననున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఆత్మచైర్మన్ నర్సారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జీవన్‌రెడ్డి,టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, సర్పంచ్ జక్ గంగవ్వ, ఎంపిటిసి ప్రవీణ్, కో ఆప్షన్ మెంబర్ బషీర్ అలీ, నాయకులు మురళిధర్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, ముత్యంరెడ్డి, గంగన్న, శ్రీనివాస్, ఎంపిడిఓ గజ్జారాం,డిఈ తూకారాం, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.