Tuesday, April 23, 2024

కార్మిక చట్టాల్లో మార్పులు!

- Advertisement -
- Advertisement -

Changes in Labor laws following Lockdown

 

12 గంటల పాటు విధులు
వారంలో రెండు రోజుల పాటు సెలవు
ప్రతి 50 మంది కార్మికులకు ఒక ఆరోగ్య కార్యకర్త
ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ప్రభుత్వానికి అప్‌డేట్

మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన అనంతరం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు పరిశ్రమల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పరిశ్రమల్లో 33 శాతం కార్మికులు పనిచేస్తుండగా చాలా పరిశ్రమల్లో ఉదయం షిప్టులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొన్ని పరిశ్రమలు డిమాండ్‌కు అనుగుణంగా రాత్రి షిప్ట్‌లను సైతం నిర్వహిస్తున్నాయి. దీనికోసం కార్మికులకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చు తున్నాయి.

అయితే లాక్‌డౌన్ అనంతరం 100 శాతం కార్మికుల అనుమతి లభిస్తే పలు సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనలో పారిశ్రామిక వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు తిరిగి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య అధిగమించడానికి కార్మికులకు 12 గంటల పాటు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పారిశ్రామిక వర్గాలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రోజుకు 12 గంటల పాటు ఒకవేళ కార్మికులు విధులు నిర్వహిస్తే అదనంగా డబ్బులు చెల్లించకుండా వారంలో రెండురోజుల పాటు వారికి సెలవుగా ప్రకటించాలని పారిశ్రామిక వర్గాలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో అమలు..

దీనివల్ల కార్మికులకు రెండురోజుల సెలవుతో పాటు పరిశ్రమల్లో కార్మికుల కొరత కూడా తీరే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కార్మికులు 12 గంటల పాటు పనిచేస్తున్నా వారికి ఎలాంటి వేతనాలు అదనంగా అక్కడి ప్రభుత్వాలు చెల్లించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యం లో ఉన్న కార్మికులతో పనిచేయిస్తూనే వారికి ఇబ్బందు లు కలగకుండా చూడాలన్న లక్షంతో రాష్ట్రానికి చెంది న పారిశ్రామిక వర్గాలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు గా తెలిసింది. కార్మికులు 8 గంటల నుంచి 12 గంటల పాటు పనిచేస్తే పరిశ్రమలకు ఇది కలిసివస్తుందని పారిశ్రామికవర్గాలు పేర్కొంటున్నాయి. కార్మికులకు వారం లో రెండు రోజుల పాటు సెలవుగా ప్రకటిస్తే కార్మిక చట్టాలకు లోబడి పనిచేసినట్టుగా ఉంటుందని వారు భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 12 గంటల పాటు విధు లు నిర్వహిస్తున్నా తమకు ఎలాంటి అదనంగా డబ్బులు చెల్లించడం లేదని ఇప్పటికే అక్కడి కార్మికులు కేంద్రానికి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు.

కార్మికులు, పరిశ్రమలు పరస్పరం చర్చించుకొని..

దీంతో మన దగ్గర 12 గంటల పాటు విధులు నిర్వహించాలని చట్టాలను అమలు చేస్తే దానికి తగ్గట్టుగా వారానికి రెండురోజుల పాటు సెలవు ఇస్తే దానికి సర్ధుబాటు అవుతుందన్న ఆలోచనలో దీనిని అమలు చేయాలన్న ఆలోచనలో పారిశ్రామిక వర్గాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే మన దగ్గర 12 గంటల పనివిధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా కార్మికులు, పరిశ్రమలు కలిసి పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్టుగా తెలిసింది. సహజంగానే కొత్తగా మార్పులను తీసుకురావాలనుకున్నప్పుడు పరిశ్రమలకు లాభం చేకూర్చడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు సూచించినట్టుగా తెలిసింది.

కార్మికులు అనారోగ్యానికి గురైతే వెంటనే హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు రెఫర్..

కొన్ని పరిశ్రమలు మరో ముందడుగు వేసి కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. 50 మంది పనిచేసే పరిశ్రమలో ఒక ఆరోగ్య కార్యకర్త (హెల్త్ వర్కర్)ను నియమించి ఎప్పటికప్పుడు కార్మికుల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని పారిశ్రామిక వర్గాలు నిర్ణయించినట్టుగా తెలిసింది. గేట్ దగ్గర ఆరోగ్య కార్యకర్తలు ఉండి పరిశ్రమ లోపలికి వచ్చే కార్మికులను థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తలు దోహదపడనున్నారు. కార్మికులకు సంబంధించి రోజు వారీ డేటా ఆరోగ్య కార్యకర్తలు నమోదు చేసుకుంటారు. కార్మికుల ఒకవేళ అనారోగ్యానికి గురైతే వారిని హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు రెఫర్ చేసేలా ఆరోగ్య కార్యకర్తలను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కార్మికుల రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వారికి కావాల్సిన పోషకాహారాన్ని తీసుకునేలా ఆరోగ్య కార్యకర్తలు ముఖ్య పాత్ర వహించనున్నారు. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన 100 మంది పనితీరు ఆధారంగా రానున్న రోజుల్లో మిగతా పరిశ్రమల్లో వీరిని నియమించే అవకాశం ఉన్నట్టు పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.

మొదటగా 100 మందికి శిక్షణ ఇస్తున్నాం..
రమాదేవి, ఎలీఫ్ ప్రెసిడెంట్ (అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్‌ప్రైనర్ ఆఫ్ ఇండియా)

అపోలో ఆస్పత్రి, జిఐజెడ్ (జర్మనీ ఆర్గనైజేషన్)ల సహకారంతో ఎలీఫ్ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటగా 100 మందికి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి జర్మనీ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం మేరకు వారి సహకారం తీసుకుంటున్నాం. ఆరోగ్య కార్యకర్తల వలన పారిశ్రామిక యాజమాన్యాలకు చాలా మేలు జరుగుతుంది. పరిశ్రమల్లో కార్మికుల, యాజమాన్యాల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి శ్రద్ధను ఆరోగ్య కార్యకర్తలు వహించేలా వారికి శిక్షణ ఇస్తున్నాం.

ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు..

టిఫ్ సీనియర్ జాయింట్ సెక్రటరీ మిరుపాల గోపాల్‌రావు

కార్మికులు 12 గంటల పాటు విధులు నిర్వహిస్తారన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం 33 శాతం మంది కార్మికులతో పరిశ్రమలు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో 100 శాతం కార్మికులు హాజరైతే అప్పటి పరిస్థితులను బట్టి పారిశ్రామిక వర్గాలు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వారి రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వస్తే పూర్తిస్థాయిలో పరిశ్రమలు నడుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News