Home తాజా వార్తలు అల్లూరిగా చరణ్ … కొమురం భీంగా ఎన్‌టిఆర్…!

అల్లూరిగా చరణ్ … కొమురం భీంగా ఎన్‌టిఆర్…!

హైదరాబాద్‌: ఎన్ టిఆర్ – రామ్‌చరణ్‌ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా గురించి రాజమౌళి గురువారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కథకు తమకు సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలని, అయితే తమకు అంతే భారీ తారాగణం ఉందని రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగణ్‌ అంగీకరించారని తెలిపారు. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారని చెప్పారు. ఆలియా భట్‌ చరణ్‌కు జోడీగా నటిస్తారని, ఎన్ టిఆర్ కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్‌ నటిస్తున్నారని రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలో సముద్రఖని కూడా  నటిస్తున్నారని వెల్లడించారు.  సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌. అని, అయితే ఈ టైటిల్ బాగుందని  డిస్ట్రిబ్యూటర్స్‌ చెప్పారని, దాన్నే టైటిల్‌గా పెట్టమని కోరారని రాజమౌళి పేర్కొన్నారు. కానీ సినిమాకు అన్ని భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అనే కామన్‌ టైటిల్‌ ఉంటుందన్నారు. టైటిల్‌ మాత్రం ఒక్కో భాషలో ఒక్కో విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టైటిల్‌ను మాత్రం ఇప్పుడే చెప్పలేననని, ఈ సినిమాకు అభిమానులే టైటిల్‌  పెట్టాలని రాజమౌళి సూచించారు. ఇప్పటికైతే టైటిల్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అనుకుంటున్నామని ఆయన వెల్లడించారు.  సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను ఎన్ టిఆర్ చేస్తారని ఆయన చెప్పారు. రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు రావడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు.   ప్రేక్షకులు సినిమాకు వచ్చే ముందు సినిమా ఎలా ఉండబోతోంది అన్న అంచనాలకు వస్తారని, వారి అంచనాలు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని తాను నమ్ముతాననని, ఈ క్రమంలోనే ప్రేక్షకులకు ముందే సినిమా గురించి చెప్పడానికి ఇష్టపడతానని రాజమౌళి వెల్లడించారు. 1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు జన్మించారని, ఇంగ్లీషుతో పాటు ఆయన వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారని రాజమౌళి తెలిపారు. అల్లూరి యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారుని, మూడేళ్ల తరువాత  తిరిగొచ్చి, స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, అప్పటి నుంచి అల్లూరి ప్రయాణం ప్రజలందరికీ తెలిసిందేనని రాజమౌళి స్పష్టం చేశారు. 1901లో ఆదిలాబాద్‌లో కొమురం భీం జన్మించారని,  ఆయనకు కూడా యుక్త వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోయారని రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత కొమురం భీం జీవితంలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందేనని రాజమౌళి చెప్పారు. కొమురం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారని,  అల్లూరిలాగే కొమురం భీం ఉద్యమించారని ఆయన తెలిపారు. వాళ్ల చరిత్ర తనకు చాలా ప్రత్యేకంగా అనిపించిందని,  అదే తాను సినిమాలో చూపించబోతున్నామని చెప్పారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేసినట్టు రాజమౌళి వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రారంభించేందుకు చాలా సమయం పట్టిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమాను  2020 జులై 30వ తేదీన విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాంచరణ్, ఎన్ టిఆర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Charan act as Alluri…NTR act as Komaram Bheem