Friday, April 26, 2024

‘విలక్షణ లక్షణాల కలబోత’ చార్లెస్ రాఫర్టీ

- Advertisement -
- Advertisement -

Charles Rafferty, mix of distinctive features

 

ఈ మధ్య చార్లెస్ రాఫర్టీ అనే అమెరికన్ కవి విపరీతంగా నచ్చుతున్నాడు. దానికి ప్రధాన కారణాలు అతని కవిత్వంలోని సంక్షిప్తత (conciseness), అసాధారణత. అసాధారణత అంటే గొప్పతనం (extraordina riness, uniqueness) అనే భావమే మొదట మెదడుకు తట్టే అవకాశముంది. కానీ, మామూలు విధానానికి భిన్నమైనది (offbeat, unconventional) అని నా అసలైన ఉద్దేశం. అయితే, రాఫర్టీ లక్షణం గొప్పతనంతో కూడుకున్నదనేది కూడా నిజమే.

కేవలం భావం బాగున్నందుకే కవితలు ఉత్తమమైనవిగా పరిగణింపబడుతున్నాయి – ముఖ్యంగా తెలుగు కవిత్వంలో. పెద్ద పరిమాణంలో కాకపోయినా, తెలుగులో మంచి కవిత్వం కొంత వస్తున్నమాట వాస్తవమే. కానీ, వస్తుశిల్పాలు రెండింటినీ కలిపి చూసినప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్న కవిత్వం తక్కువే. కవిత్వంలో భావం బాగుండాలి నిజమే. కానీ, అది అంతటితోనే ఆగిపోకూడదు. ఆగిపోతే సంపూర్ణత సిద్ధించదు. గొప్ప భావాన్ని మామూలుగా వ్యక్తీకరించడం వలన కవిత్వానికి మేలు, మేలిమి చేకూరవు. చాలా మంది కవులు భావం బాగుండటం దగ్గరే ఆగిపోతారు. కానీ ఆ భావాన్ని తెలిపేందుకు విశిష్ట వ్యక్తీకరణ విధానాన్ని అనుసరించామా లేదా అన్నది ముఖ్యం.

గొప్పభావాలు కేవలం కవులకే వస్తాయనుకోవడం భ్రమ. అవి కవులు కానివారికి కూడా రావచ్చు. అయితే వాటిని మంచి పొయెటిక్ డిక్షన్ ద్వారా వ్యక్తీకరించినవాడే నిజమైన కవి అవుతాడు. అంటే భావమే పూర్తిగా కవిత్వం కాదని అర్థం – ఆ భావం గొప్పగా ఉన్నా కూడా! ఇది వస్తువే కవిత్వం కాదు అనే ఉగ్గడింపు నుండి మరికొంత ముందుకు పోయి, భావమే కవిత్వం కాదు అన్న వాదాన్ని ప్రతిపాదించడం కిందికి వస్తుంది. ఇక్కడ, భావమే పూర్తిగా కవిత్వం కాదు అనే వాక్యంలో భావం అంటే, మనసులో మెదిలిన ఏ ఊహనైతే plain గా, as it is గా కాయితమ్మీద పెడ్తామో, దేని డిక్షన్ కోసమైతే సరిపోయినంత సమయాన్ని వెచ్చించమో అది అని ఉద్దేశం. మనకు వచ్చిన కవితాత్మకమైన ఊహను కవి కాని వ్యక్తికి చెప్తే అతడు లేక ఆమె రాసే కవితకన్న మనం రాసింది ఎన్నోరెట్లు బాగుండాలి. అప్పుడే మనం మంచి కవి కింద లెక్క. కవి కానివాడు మామూలు భాషలో రాస్తే కవేమో కవిత్వభాషలో వ్యక్తీకరిస్తాడు. మళ్లీ ఒకరి కవిత్వభాషకన్న మరొకరిది ఎక్కువ నాణ్యమైనదిగా వుండే అవకాశముంది. అందుకే ఒక్కో కవి ఒక్కో స్థాయికి చెందినవాడవుతాడు.

ఏమిటి ఈ కవిత్వభాష? అది పెద్దపెద్ద పదాలను కలిగివుండాలా? అని ప్రశ్నిస్తే, అవసరం లేదు అన్నది జవాబు. మామూలు పదాల ద్వారా కూడా రసోత్పత్తి సాధ్యమే. అయితే పెద్ద పదాలు పూర్తిగా అనవసరం అని చెప్పలేం. అరుదైన సందర్భాల్లో అవి సరళమైన పదాలకంటె ఎక్కువగా కవిత్వస్పర్శను అనుభవానికి తెచ్చే అవకాశముంది. లేదా, పెద్దపదాలంత సమర్థమైన సరళపదాలు కొన్ని సందర్భాలకు సరిపడేవి ఉండకపోవచ్చు.

రాఫర్టీతో మొదలు పెట్టి తెలుగు కవిత్వాన్ని ప్రస్తావించడం పక్కతోవ పట్టడం (digression) కిందికే వస్తుంది. కానీ అట్లా రాయడానికి ఒక కారణం వుంది. గొప్పభావాన్ని వెలిబుచ్చడం మాత్రమే సరిపోదు అని నేను చెప్పింది మన తెలుగు కవిత్వంలో కనిపించే ఓ మోస్తరు గొప్పభావాల గురించి. కరుణ, సహానుభూతి, మానవతా దృక్పథం, అభ్యుదయ భావన, బడుగుజీవుల పట్ల ప్రేమ, బాల్యం తాలూకు నెమరువేత, సొంతఊరిమీదా దాని మట్టిమీదా మమకారం – ఇట్లాంటి స్పందనలను encompass చేసిన (కలుపుకున్న, లేదా చుట్టుముట్టిన) భావాల గురించి. ఇవి గొప్పవే కానీ రొటీన్ అయిపోయాయి. ఇటువంటి భావాలన్నీ ఒక రేంజ్ లోకి వస్తాయి. కానీ వీటికన్న పైస్థాయిలోని ఊహలు వాటంతట అవే కవిత్వానికి కంట్రిబ్యూట్ చేసే అవకాశముంది. అయితే అవి మేధాపరంగా ఉన్నతమైనవి (intellect తో కూడుకున్నవి) కావచ్చు. ఈ వాక్యాన్ని చదవగానే, కవిత్వం మేధాపరంగా గొప్పదిగా ఉండనే ఉండకూడదు అని అభ్యంతర పెట్టేవాళ్లుంటారు. కానీ పూర్తిగా అర్థం కాకపోవడం చేత మాత్రమే ఒక కవిత మంచిది కాకుండా పోదు.

అది మనకు అవసరం లేదు అంటే అది వేరే సంగతి. కానీ, ఈ అభిప్రాయం కూడా చర్చలో గెలవదు. నిజానికి కవిత్వం అన్నది అరటిపండును వొలిచి చేయిలో పెట్టినంత explicit గా (మరీ స్పష్టంగా) ఉండకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గొప్పభావం మాత్రమే సరిపోదు అని నేను పైన చెప్పినదానికి రాఫర్టీ లాంటివాళ్లు మినహాయింపు అని వ్యాఖ్యానించడం కోసం. తెలుగులో కూడా మో, అజంతా, త్రిపురనేని శ్రీనివాస్, దెంచనాల శ్రీనివాస్, ఇక్బాల్ చంద్ లాంటి ఆ రకం కవులున్నారు. రాఫర్టీ చేసే కవిత్వ ఊహే కవిత్వం. దానికి ఎట్లాంటి భాషను తొడిగినా నాణ్యత చెడదు, అది కవిత్వం కాకుండా పోదు. కానీ, అట్లాంటి ఊహలు zమామూలు కవులకు రావు. ఈ ఊహాశకలాల్ని చూడండి:

1. అంతలో, నేను తుప్పుపట్టిపోతున్నానని చెప్తుంది నా రక్తపు రుచి. నేను మోస్తున్న కొలనులో ఒక విరిగిన యంత్రం సగం మునిగివుందని సూచిస్తుంది. 2. ఏర్పడని సమశ్రుతి కోసం/ వేళ్లు పియానోమెట్ల మీద ఆగుతాయి/ వాటిని గట్టిగా నొక్కి నీకు చేతనైన/ సంగీతాన్ని పుట్టించు అంటున్నాను. 3. చివరి నియాండర్ తల్ వంశంలోని మనుషులు క్రీస్తుకన్న 20 రెట్లు ప్రాచీనులు. సూర్యునికీ భూమికీ మధ్య వున్న దూరంకన్న, సూర్యునికీ యురేనస్ కూ మధ్య వున్న దూరం 20 రెట్లు ఎక్కువ. అది నిండు సిగరెట్ పెట్టెకూ ఆఖరి సిగరెట్ కూ మధ్యన ఉన్నంత భేదం. పెద్ద భేదం కాదని నేనంటున్నది. రెండో వాక్యానికీ మూడో వాక్యానికీ నడుమ మరికొన్ని వాక్యాలున్నాయి. ఇట్లాంటి ఊహలు మామూలు కవులకు వస్తాయా?

కానీ, ఇట్లా అతని కవితలలోని ముక్కలను చూపించి ఆ ఊహల గొప్పతనాన్ని సంపూర్ణంగా, సంతృప్తికరంగా అనుభూతం చేయించలేం. ప్రతి ఊహ కవితలోని ముఖ్యమైన భాగం (integral part) గా ఉంటుంది. అన్నిటినీ కలిపి చూస్తేనే ఆ ఊహల గొప్పతనం పూర్తిగా అవగతమౌతుంది. రాఫర్టీ కవితలు దాదాపు అన్నీ ఒక పేజీకన్న తక్కువే ఉంటాయి. తొంభై శాతం కవితలు సగం పేజీకన్న తక్కువ నిడివి కలిగినవే! అయినా గొప్పగా ఉంటాయి. అవి ఊహాగరిమను దట్టించుకున్న సాంద్రమైన రచనలు మరి! వాటిలో ఆర్ద్రత, ఆర్తి కన్న ఆలోచనాపటిమ ఎక్కువ. కొన్నిసార్లు నేరుగా సంబంధం లేని సమాంతర ఊహల సహాయంతో, ముందు చెప్పిన భావనలకు బలాన్నీ ఊతాన్నీ కలిగిస్తాడు రాఫర్టీ. అవి కవితాత్మకంగా ఉంటాయి కూడా. శాఫోతో సమస్య అనే కవితలో, ‘ఒక్క సంపూర్ణపద్యం మాత్రమే మిగిలింది. తక్కినవన్నీ పగటిపూట కాకులు వాలి వెళ్లిపోయాక జిట్రేగుపొదలో మిగిలిన రేగిపండ్లు’ అంటాడు. ఇక్కడ మొదటివాక్యం లోని సంపూర్ణపద్యం ఎంత గొప్పదో వివరించేందుకు రెండవ వాక్యం పనికి వచ్చింది.

మరో కవితలో, పర్వతాన్ని చాలాసేపు చూస్తే దాన్ని ఎక్కలేమనిపిస్తుంది అని మొదలు పెట్టి చివర్న, అబ్బా! తుఫాను ఆగుతుందని నమ్మి ఎంతసేపు చూరుకింద నిలబడ్డాను? కానీ అది ఆగలేదు, అంటాడు. జీవితంలో ఒకపని చెయ్యాలనే ఊహ వచ్చినా సందేహం వలన వెనకాముందాడుతూ తాత్సారం చేస్తే అనవసరంగా సమయం వృథా అవుతుందని చెప్పడమన్న మాట. తుఫాను ఆగేదాకా వేచివుండటం వల్ల సమయం వృథా అయింది కదా?! కానీ, చెయ్యాలనుకున్న పనిని సందేహంతో వాయిదా వేయకు అని కవితలో ఎక్కడా డైరెక్టుగా, వాచ్యంగా చెప్పడు. అంతా అన్యాపదేశంగా చెప్పడమే. ఈ పద్ధతి పూర్తిగా కొత్తది అని చెప్పడం లేదు. సర్రియలిస్ట్ కవులు కొందరు ఈ విధంగా చెప్పారు. రాఫర్టీ కవిత్వంలో కూడా కొన్నిచోట్ల అధివాస్తవికత ఛాయలు కనిపిస్తాయి.

మచ్చుకు, నేను అనువదించిన ఈ రెండు కవితలను చదవండి.

నిర్నిద్ర (Insomnolence) చీకటింట్లో స్మోక్ డిటెక్టర్ కూ ఎలెక్ట్రిక్ టూత్ బ్రష్ కూ మధ్య తిరుగుతుంటాను. మొదటిది ఆకుపచ్చని తారక, రెండోది నీలికాంతుల నక్షత్రం. నేను మగెలన్ కూ మార్కోపోలోకూ భిన్నం కాను. ఏది మండుతుందో అది నన్ను నడిపిస్తుంది. కొన్నిసార్లు రాత్రివేళ పెరట్లోని వసారాలోకి వెళ్తాను. దాని ముఖభాగం చీకటిని చిక్కబరుస్తుంటుంది. పైన ఆకాశంలోనేమో చుక్కలు తేజరిల్లుతూ, మసకబారుతూ, మళ్లీ తేజరిల్లుతూ ఉంటాయి. ఏదైతే సాధ్యం కాకుండా మిగిలిపోయిందో దానితాలూకు క్షోభను మనసులో నిలుపుకుని మథనపడుతుంటాను.

అమరత్వం కోసం అతి విషాదకర ప్రయత్నం
(The Saddest Bid for Immortality Ever Devised)

ప్రసిద్ధకవుల పుస్తకాల్లోని ఖాళీపేజీల మీదికి నా కవితలను ఎక్కించేవాణ్ని. అవి ఒక పెద్ద బలమైన సొరచేప కడుపుమీద పరాన్నజీవులైన చిన్నచేపల్లా అతుక్కుపోయి భవితవ్యంలోకి దూసుకుపోతాయని ఊహించుకుని, ఆశ పడేవాణ్ని. కానీ లైబ్రేరియన్ ప్రతిసారీ గుర్తు పట్టి, వాటిని పెన్నుతోనో పెన్సిల్ తోనో నలుపు చేసేది. తర్వాత, చెడిపోయిన ఆ పేజీలను ఆమె ఒక స్కేలు, బ్లేడు సహాయంతో కోసి తొలగించడం మొదలు పెట్టింది. మౌంట్ లారెల్ పబ్లిక్ లైబ్రరీలోని ప్యారడైజ్ లాస్ట్ పుస్తకం చివర్న ఉన్న ఆ కాయితమ్ముక్కలు ఏమిటని ఆలోచిస్తున్నారా? అవి నేనే!
ఊహల శ్రేష్ఠత పట్ల, శిల్పం పట్ల అభిరుచి, మమకారం ఉన్న ప్రతి తెలుగుకవి చదవవలసినవాడు చారల్స్ రాఫర్టీ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News