Thursday, April 25, 2024

చత్తీస్‌గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Ajit Jogi

 

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు.

అజిత్ జోగి మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జెసిసి(జె) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. కాగా 1946లో జన్మించిన అజిత్ జోగి భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. గోల్ మెడలిస్ట్ అయిన ఆయన కొన్నాళ్లపాటు రాయ్‌పూర్ నిట్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించారు.

ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్రలో నిలిచారు. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చక్రాల కుర్చీకి పరిమితమవుతూనే రాజకీయాలను నడిపారు. 1986-1998 మధ్యకాలంలో అజిత్ రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్ నియోజకవర్గం నుంచి, 2004లో మహసముండ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే 1998 నుంచి 2004 మధ్య కాలంలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగారు.

2008లో మర్వాహి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. 2016 జూన్ 23న కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) పార్టీని స్థాపించారు. జోగి మృతిపట్ల కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జోగి మృతికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సిఎంలు సంతాపం ప్రకటించారు. పేదలు, గిరిజనంలో సానుకూల మార్పుకోసం అజిత్ జోగి విశేష కృషి చేశారని మోడీ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Chattishghar former CM Ajit jogi passes away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News