Home దునియా విలక్షణ పాత్రలకు చిరునామా ఛాయాదేవి

విలక్షణ పాత్రలకు చిరునామా ఛాయాదేవి

chaya-devi

ఆడంబ రాన్ని, అతిశయాన్ని, గయ్యాళిదనాన్ని, దురహంకారాన్ని, అతి ప్రేమని, గడుసుదనాన్ని తన కళ్లద్వారా, మాటల ద్వారా, చేతులు ఆడించడంలో, నడకలో అద్భుతంగా చూపుతూ, సహజ నటనతో ప్రేక్షకుల అభిమానం చూరగొన్న కేరక్టర్ నటి ఛాయాదేవి. పెద్ద పెద్ద కళ్లతో, గుండ్రటి ముఖంతో, బొద్దుగా వుండే పెర్సనాల్టీ కలిగి, పెదవుల కదలికతోనూ చక్కని అభినయం ప్రదర్శించడంలో తన ప్రత్యేకతను చూపేది. ఈ కారణాల వల్లనే సూర్యకాంతం, ఛాయాదేవి కాంబినేషన్లో రూపొందించిన పలు సన్నివేశాలు, రమణారెడ్డి, అల్లురామలింగయ్య ప్రభృతులతో చిత్రీకరించిన సన్నివేశాలు ఆహ్లాదాన్ని , ఉత్సుకతని కలిగిస్తూ, కొన్ని సందర్భాలలో కడుపుబ్బ నవ్వుకునేలా చేసేవి ఆ సినిమాలు. ఇప్పటికీ ఇక ముందు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తునే వుంటాయి.
మాయా బజార్ చిత్రంలో రేవతీదేవిగా అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. ఆడబడుచు ఇతరుల మీద అసూయ, దుర్యోధనాదులపై మమకారం, కుమార్తె సావిత్రి పై ప్రేమ తదితర అంశాలను చూపడంలోనూ, లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా…. పాటలో బలరాముడుగా నటించిన గుమ్మడితో కలసి నౌకలో విహారం చేసే సన్నివేశాల్లో ప్రణయాన్ని, సిగ్గుని ఒలికించింది. పిచ్చి పుల్లయ్య చిత్రంలో జమిందారిణిగా, వితంతువు పాత్రలో గుమ్మడి పెత్తనాన్ని కాదన లేక, అన్నిటినీ అంగీకరించ లేని మహిళగా, కన్యాశుల్కం చిత్రంలో పూటకూళ్లమ్మగా చక్కని నటనతో ఆకట్టుకుంది.
ఛాయదేవి స్వస్థలం గుంటూరు. చిన్నతనంలోనే కొంతకాలం నాట్యంలో శిక్షణ పొందింది. సినీ నటికావాలన్న ఆలోచన ఆమెకు మద్రాసు చేరుకునేలా చేసింది. 1953ల విడుదలైన పిచ్చిపుల్లయ్య చిత్రంలో నుంచి ఆమె నటనకు ప్రశంసలు తో పాటు వివిధ పాత్రల్లో నటించే అవకాశాలు క్రమక్రమంగా లభించాయి.
భర్తను వెర్రి వెంగళప్పలా భావించి తన చెప్పు చేతల్లో మాటకు ఎదురు చెప్పకుండా ఉండేలా వ్యవహరించే గాయ్యాళి పాత్రల్లో, మారుటి కూతురుని ఇక్కట్లు పాలు చేసే సవితి తల్లి పాత్రల్లో, కూతురుని ఏడు మల్లేల ఎత్తుగా భావించే తల్లి పాత్రల్లోనే కాకుండా కరుణదస ప్రధానమైన పాత్రల్లో, సాత్విక భూమికల్లో చక్కని అభినయం ప్రదర్శిస్తూ మురిపించేది.
పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలలో నటించి ఏ తరహా చిత్రమైనా మెప్పించ గలననిపించుకుంది. శ్రీకృష్ణార్జున యుద్ధంలో రేవతి దేవి పాత్రలో మరోసారి నటించింది. ఈ చిత్రంలో మిక్కిలినేని బలరాముడుగా నటించారు. ప్రమాలార్జునీయంలో సేనాని రణచండిలా ప్రమాల రాజ్యంలో మోహినీ భస్మాసురలో శజీదేవిగా , కృష్ణావతారంలో శిశుపాలుడుగా నటించిన రాజనాల తల్లిగా , శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథలో నిరంభరాజుగా నటించిన ఎస్.వి.రంగారావు రాణిగా జమునకు తల్లిగా కూతురుపై ప్రేమాభిమానాలు చూపుతూ, ఉమాచండీ గౌరీశంకరుల కథలో మనోరంజని అనే వేశ్యగా, దక్షయజ్ఞంలో ఒక ప్రత్యేక పాత్రలో, సంపూర్ణ రామాయణంలో మంధరగా మంచి నటన ఛాయదేవి ప్రదర్శించింది.
ఇవి పిడకలు కొట్టిన చేతులే నాతో పెట్టుకోకు అని పెడసరంగా సావిత్రితో గుండమ్మకథలో హెచ్చరించడం గుర్తుండి వుండే వుంటుంది. అలాగే ఆ చిత్రంలోనే సూర్యకాంతాన్ని చూస్తూ నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావే మొగుడు చచ్చినా బర్మా ముడివేసుకుని మహిళా మండలిలో తైతక్కలాడుతున్నావే అనడం సూర్యకాంతంతో కలిసి ఫైట్ చేస్తూ అవకాశం దొరకగానే తన్నుతూ గదిలో పెట్టిగొళ్లెం పెట్టడం, ఆ తరువాత ఎన్.టి.రామారావు వచ్చి గుండక్క ఏదీ అని అడిగితే దానికి తగిన శాస్తి జరిగింది. నా మీద కూడా ఎగరబోతే నాలుగు చితకబాది ఆ దొడ్లో పడేసా అని తన టెంపరితనం చూపడంలో హాస్యంతో బాటు చూసే వారికి ఆమె మీద కోపమూ వస్తుంది. అలా దుర్గమ్మగా వివిధ సందర్భాలలో రెచ్చిపోయిన సన్నివేశాలు ఎప్పటికీ తాజాగానే వుంటాయి.
నవరాత్రి చిత్రంలో సూర్యకాంతంతో కలిసి రాక్‌ఎన్‌రోల్ డ్యాన్స్ చేసిన విధానంలో వినోదం కలుగుతుంది. నిండు దంపతులు చిత్రంలో ధనిక గృహిణి దుర్గమ్మ అయినా డబ్బు కక్కుర్తితో కౌలుదారు సత్యనారాయణతో కుమ్మక్కై మోసం చేయడం, అది గుర్తించిన బాలయ్య ముందు వరదల్ని వానల్ని మనమాపగలమా బాబు అని సన్నాయి నొక్కులు నొక్కడంతోను ప్రత్యేకత కనబడుతుంది.
మరో చిత్రంలో అల్లురామలింగయ్య భార్యగా అతడిని పక్కకు పిలిచి మీ కేమైనా బుద్ధుందా?….ఛీ నోర్ముయ్! ఏమిటా లేకి తిండి ఆయన ముందు. నీవాలకం చూస్తుంటే మనకు కోట్లు కాదు కదా తుండుగుడ్డ కూడా లేదని అర్థమైపోతుంది. అందంగా తిని హుందాగా మాట్లాడు అని హెచ్చరిస్తూనే సలహాయివ్వడంతో మెప్పించింది.
ఆడ పెత్తనంతో మాచమ్మగా మారని రూపాయి అని అందరూ అంటుంటే ఉడుక్కునే పాత్రలో, జ్యోతి చిత్రంలో గుమ్మడి, జయసుధ మాటలు వినడానికి దొంగచాటుగా కిటికీ పక్కకు చేరి, వేడి కాఫీ మీద పడగానే కిటికీ అందంగా వుందని చూస్తూ నిలబడ్డాను అని వివరణ ఇవ్వడంలో, నా ఉసురు పోసుకుంటావువా అని జయసుధని హెచ్చరించి చకచక వెళ్లి పోవడంలో తన తీరే వేరు అని నిరూపించుకుంది.
మీనా చిత్రంలో గుమ్మడితో తనకు తప్పిపోయిన పెళ్లి తలుచుకుంటూ రాత బాగుంటే ముత్తయిదువులా ఇలా వుండేదాన్ని అని ఎగేస్తూ చేతిలోని బిందె ఢమాల్‌మని పడేసి మూతి విచిత్రంగా తిప్పుతూ కనిపిస్తుంది. అదృష్ట వంతులు చిత్రంలో సూర్యకాంతం వీధి హోటల్‌కి పోటీగా పెసరెట్ల పేరమ్మ అవతారంలో కనువిందు చేస్తుంది. యమగోలలో జయప్రద ఇంట్లోని వంట మనిషి సుబ్బమ్మగా వుంటూ సత్యనారాయణ మీద ఆసక్తి, అనురక్తి పెంచుకుంటూ, అల్లు రామలింగయ్యతో పెడసరంగా మాట్లాడి రక్తికట్టిస్తుంది.
పూజా ఫలంలో ఎ. విజయలక్ష్మి తల్లిగా వేశ్యమాత పాత్రలో, భలే అమ్మాయిలులో జమిందారిణిగా, పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో సలహాలిస్తూ రమణా రెడ్డితో గడుసుదనం చూసే భార్య పాత్రలో, పాడిపంటలులో శేషమ్మగా అలరించింది. సంబరాల రాంబాబు, అత్తలు కోడల్లు, చిట్టితమ్ముడు, గంగ మంగ, దసరాబుల్లోడు, అంతా మన మంచికే మోసం చేసే నరసమ్మగా అందరూ నాశనమై పోతారు అని శపించడంతోనూ వెరైటీనే.
పరమానందయ్య శిష్యులు కథలో పరమానందయ్యగానటించిన నాగయ్య భార్యగా, రాజకోట రహస్యంలో టెంకాయల వెంకమ్మగా, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో రమణా రెడ్డి భార్యగా హాస్య పాత్రలో , అగ్గి దొరలో రత్నగిరి రాణిగా ధూళిపాళి సరసన మారుటి కూతురు భారతిని ఇక్కట్ల పాలు చేస్తూ, స్వంత కూతురు విజయలలితపై అతిప్రేమతో అగ్గి దొరపై ప్రేరేపిస్తూ, వివిధ భావాల వ్యక్తీకరణలో తనకు తానే అని నిరూపించుకుంది.
సంభాషణని చక్కని విరుపుతో టైమింగ్‌లో పలుకుతూ, పాత్రానుగుణంగా పెడసరాన్ని, గయ్యాళిదనాన్ని, శాంతాన్ని, కరుణని, హాస్యాన్ని సహజంగా వ్యక్తీకరించి చక్కని కేరక్టర్ నటిగా నిరూపించుకుంది ఛాయాదేవి సుమారు 200 చిత్రాలలో. సూర్యకాంతం, ఛాయాదేవిలా నటనతో మురిపించే నటీమణులు కనిపించక గుండమ్మకథని మళ్లీ తీద్దామని ప్లాన్ చేసిన పలు నిర్మాతలు వెనక్కి తగ్గడం విశేషమే!!

వి.ఎస్. కేశవరావు

99892 35320