Home ఎడిటోరియల్ సోషల్ మీడియాకు కళ్లెం!

సోషల్ మీడియాకు కళ్లెం!

edit

దేశంలో సోషల్ మీడియాను కట్టడి చేయడానికి సమాచార ప్రసారశాఖ మంత్రిణి స్మృతి ఇరానీ ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ పని ప్రారంభించింది. ఆన్ లైన్ మీడియాకు కొత్త నియమనిబంధనలు తయారు చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ తొమ్మిదిమందిలో ఐదుగురు వివిధ ప్రభుత్వ విభాగాల్లో సెక్రటరీలుగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు. కేంద్రప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వశాఖల అధికారులు. సమాచార ప్రసారశాఖ, హోంశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ అండ్ లీగల్ ఎఫైర్స్ నుంచి వచ్చినవారు.
ఈ కమిటీలో ఆన్ లైన్ మీడియా ప్రతినిధులు ఎవరూ లేరు. నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ – ఈ రెండింటి నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. ఈ రెండు సంస్థలు టెలివిజన్ చానళ్ళకు సంబంధించినవి. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ప్రతినిధి ఉన్నారు. ఇటు ప్రెస్ కౌన్సిల్ అటు టెలివిజన్‌కు సంబంధించినదీ కాదు, ఇటు ఆన్ లైనుకు సంబంధించినదీ కాదు. ఈ కమిటీలో బ్యూరోక్రాట్లే ఎక్కువన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఆన్ లైన్ మీడియాకు సంబంధించిన నియమనిబంధనలు వాళ్ళే తయారు చేస్తారన్నమాట. దేశంలో ఆన్ లైన్ మీడియాను నియంత్రించే శక్తి సామర్థ్యాలు బ్యూరోక్రాట్లకు పుష్కలంగా ఉన్నాయని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. లైసెన్సింగ్ నియమాలు, కంటెంట్ కు సంబంధించిన నియమాలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నియమాలు వగైరా అన్నింటినీ బ్యూరోక్రాట్లు నిర్ణయించగలరని ప్రభుత్వ ఉద్దేశం.
కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఆన్ లైన్ మీడియా నిలదీయడమే కాదు, మూడు చెరువుల నీళ్ళు తాగిస్తోంది. ఆన్ లైన్ మీడియాకు కళ్ళెం వేయాలన్నదే మోడీ ప్రభుత్వ ఆలోచన అన్నది అర్ధం చేసుకోడానికి పెద్దగా కష్టపడవలసిన పనిలేదు. అలాగే ఫేస్ బుక్, గూగుల్ మొదలైన సంస్థలు ఎంత బలమైనవో కూడా బహుశా అర్ధమై ఉంటుంది. చిన్నస్థాయిలో ఉన్న వారైనా ఈ సోషల్ మీడియా విస్తృతమైన సమాచార పంపిణీ పొందవచ్చు. ఈ వేదికలు లేకపోతే ఇంత విస్తృతస్థాయిలో సమాచార పంపిణీ అనేది చిన్నస్థాయి సంస్థలకు సాధ్యం కాదు.
ఫేస్ బుక్ ప్రపంచవ్యాప్తంగా రెండువందల కోట్ల కన్నా ఎక్కువ మంది యూజర్లున్న వేదిక. ఒక అంచనా ప్రకారం గూగుల్ కు భారతీయ భాషల్లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. ఈ సోషల్ మీడియా వేదికలు బలమైన ప్రత్యామ్నయ మీడియా సాధనాలయ్యాయి. చిన్న స్థాయి మీడియా సంస్థ అయినా సరే బలమైన సాక్షాధారాలతో, పరిశోధనతో ఒక కథనాన్ని ఆన్ లైన్ మీడియాలో ప్రచురిస్తే, సాంప్రదాయిక మీడియాలో కన్నా ఎక్కువగా పంపిణీ అయ్యే అవకాశాలు ఇప్పుడు లభించాయి. క్లుప్తంగా చెప్పాలంటే భావప్రకటనా స్వేచ్ఛ ఇంతకు ముందు సాంప్రదాయిక మీడియాపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు మరింత ప్రజాస్వామికీకరణ చెందింది. అందరికీ అందుబాటులోకి వచ్చింది.
సహజంగానే, పాలకవర్గం ఈ విషయమై ప్రమాదాన్ని శంకిస్తుంది. వార్తా కథనాలను వైరల్ చేయడంలో ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ వంటి వేదికలు పోషిస్తున్న పాత్ర గురించి భయపడడం ప్రారంభమయ్యింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చివరి సంవత్సరం. ఇక ఎన్నికలు రావలసి ఉంది. ప్రజలకు చంద్రుడిని తీసుకొచ్చి పెడతామన్నట్లు చేసిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి. కాబట్టి సహజంగానే చేసిన వాగ్దానాల గురించి ప్రశ్నల పరంపర మొదలవుతుంది. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇబ్బంది పడే ప్రశ్నలు రావచ్చు.
ఇప్పుడు ఆన్ లైన్ మీడియాను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన కమిటీ టరమ్స్ ఆఫ్ రిఫరెన్సులో ఫేస్బుక్, గూగుల్ వంటి వేదికలను నియంత్రించడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం మరిచిపోలేదు. కాని ఇదెలా అన్నది స్పష్టంగా లేదు. ప్రభుత్వం టివీ చానళ్ళను అదుపులో ఉంచుకోడానికి, అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ పాలసీని నియంత్రిస్తుంది. దేశంలో 847 టీవీ చానళ్ళలో ప్రసారమయ్యే సమాచారంపై పూర్తి స్థాయి నిఘా పెట్టగలరు. నియమనిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే అలాంటి టీవీ చానల్ పై వేటు వేయడానికి అధికారాలు, అవకాశాలున్నాయి. వేలాది చిన్నస్థాయి ఆన్ లైన్ మీడియా సంస్థలు, వ్యక్తులు ఫేస్ బుక్ వంటి వేదికలపై నిరంతరం పోస్టు చేస్తున్న వీడియోలను, సమాచారాన్ని ఎలా నియంత్రిస్తారు? ఈ కమిటీలో ఉన్న ఐదుగురు బ్యూరోక్రాట్లు ఈ విషయం గురించి ఆలోచించారా? భారతదేశం ఒక పని చేయవచ్చు. చైనా మాదిరిగా విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు. అంటే దేశంలో సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టు ఖచ్చితంగా దేశంలో ఉన్న సర్వర్ల నుంచి మాత్రమే అప్ లోడ్ అయ్యేలా నిబంధనలు పెట్టవచ్చు. ఆన్ లైన్ మీడియాలో చాలా సంస్థలకు సర్వర్లు విదేశాల్లో ఉంటున్నాయి. అటువంటి నిబంధన వల్ల ఈ సంస్ధలన్నీ దెబ్బతింటాయి. అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా?
చైనా, రష్యాలకు మనకు ఈ విషయంలో తేడా ఉంది. ఇంటర్నెట్ కు సంబంధించి అనేక అంతర్జాతీయ వేదికలపై మనం స్వేచ్ఛా వాతావరణం కోరుతున్నాం. రష్యా చైనాలు అలా కాదు. అవి ఆంక్షలతో ఇంటర్నెట్ ను కట్టడి చేస్తున్నాయి. ఇంటర్నెట్ లో సమాచార పంపిణీ విషయంలో జాతీయస్థాయిలో పటిష్టమైన అదుపు ఉండాలని చైనా రష్యాలు వాదిస్తుంటాయి. ఈ తేడాను మనం దృష్టిలో ఉంచుకోవాలి.
అంతర్జాతీయ వేదికలపై ఇంటర్నెట్ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు, జాతీయంగా ఆన్ లైన్ సంస్థలపై నియంత్రణ అదుపు ఉండాలని కోరడంలోని వైరుధ్యాన్ని చాలా మంది ఎత్తి చూపుతారు. ఆన్ లైన్ మీడియాపై అదుపు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి అనేక వైరుధ్యాలు మన ముందుకు వస్తున్నాయి. ఆన్ లైన్ మీడియాను నియంత్రించడం కన్నా ముందు విదేశీ పెట్టుబడుల విషయంలో కఠినమైన నిబంధనలు కూడా అవసరం. ప్రస్తుతం వందశాతం విదేశీపెట్టుబడితో పనిచేస్తున్న సంస్థల్లో ఖచ్చితంగా కొంతశాతం దేశీయ పెట్టుబడి ఉండేలా చూడాలి. నిజం చెప్పాలంటే ఇదంతా చాలా అయోమయమైన పరిస్థితి. ఇప్పటి వరకు ఆన్ లైన్ మీడియాపై ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్లనే ఆన్ లైన్ మీడియా శరవేగంగా విస్తరించింది. నియంత్రణ, నియమనిబంధనలు వస్తే పరిస్థితి మారుతుంది. మరోవిధంగా చెప్పాలంటే ఇది మీడియా స్పేస్ ను కుదించడమే అవుతుంది. ఇదంతా కేవలం కొత్తగా వస్తున్న ఆన్ లైన్ మీడియాకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని సాంప్రదాయిక మీడియాలోని వార్తాపత్రికలు, టీవీ చానళ్ళు భావిస్తే పెద్ద పొరబాటు చేస్తున్నట్లే అవుతుంది.