Home జాతీయ వార్తలు కేసుల కేసుకు ఝలక్

కేసుల కేసుకు ఝలక్

case

విచారణకు స్వీకరించడానికి జస్టిస్ చలమేశ్వర్ నిరాకరణ
సుప్రీం కోర్టులో పరిస్థితుల పట్ల సీనియర్ న్యాయమూర్తి మళ్లీ ఆవేదన

న్యూఢిల్లీ: కేసుల కేటాయింపుల అంశం సుప్రీంకోర్టులో గురువారం పలు మలుపులు తిరిగింది. ప్రధాన న్యాయమూర్తికి, న్యాయస్థానం సీనియర్ న్యాయమూర్తులకు మధ్య ఉన్న విభేదాలను సంఘర్షణ దశకు చేర్చింది. సీనియర్ న్యాయవాది, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్  దాఖలు చేసుకున్న ప్రజా వ్యా జ్యం(పిల్) ఒక్కరోజులోనే రెండు ధర్మా సనాల ముందుకు అభ్యర్థనకు వచ్చింది. తాను ఈ పిల్‌ను విచారించేందుకు ముం దుకు రాలేనని సీనియర్ న్యాయవాది జస్టిస్ చలమేశ్వర్ అశక్తతను వ్యక్తం చేశా రు. సుప్రీంకోర్టులో ప్రస్తుత వ్యవహారాలపై తాను తీవ్రంగా కలత చెందుతున్నట్లు ఈ సీనియర్ న్యాయమూర్తి  ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం పనితీరు, అంతర్గత అంశాలపై జస్టిస్ చలమేశ్వర్ గురువారం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయడం కీలకంగా మారింది. జస్టిస్ చలమేశ్వర్ తన నిరసనను మాటలద్వారానే కా కుండా చేతలతో కూడా తెలియచేసుకున్నారు.

        కేసుల కేటాయింపులలో సరైన మార్గ దర్శకసూత్రాల ఖరారుకు దాఖలైన ప్ర జా వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేనని, దీనిని విచారణ జాబితాలో పొందుపర్చలేనని చలమేశ్వర్ గురువారం స్పష్టం చేశారు. ఈ పిల్ ను న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ దాఖలు చేశారు. తన పిల్‌ను తక్షణం విచారణకు చేపట్టాలని శాం తిభూషణ్ చేసుకున్న దరఖాస్తును ఆయన విచార ణ క్రమంలో పొందుపర్చకపోవడంతో వెనువెంటనే పిటిషనర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా దృష్టికి దీనిని తీసుకువెళ్లారు. తక్షణం దీనిని లిస్ట్‌లో పొందుపర్చాలని కోరారు. అయితే సిజెఐతో కూడిన ధర్మాసనం దీనిపై తాము పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిజెఐనే కేసుల కేటాయింపులలో సుప్రీం అని, తిరుగులేని నిర్ణయాధికారం ఉంటుందని ఒక్కరోజు క్రితమే సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది.

       ఈ తరుణంలోనే తక్షణ ప్రాతిపదికపై సీనియర్ న్యాయవాది అయిన శాంతిభూషణ్ ఈ పిల్ దాఖలు చేశారు. తాను ప్రస్తుతమున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తున్నానని, ఇందులో సిజెఐకే పూర్తి అధికారాలు ఉన్నందున ఈ పరిధిలో విచారణ వద్దని తొలుత శాంతిభూషణ్ పేర్కొన్నారు. అయితే సముచితమైన కారణాలతో తాను ఈ పిల్ విచారణను చేపట్టలేనని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొనడంతో పిల్ కథ మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలితో ఈ పీఠానికే  సంపూర్ణాధికారాలపై చాలా కాలంగా జస్టిస్ చలమేశ్వర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనూ, సుప్రీంకోర్టు పరిధిలోనూ జరుగుతున్న పరిణామాలను తెలియచేస్తూ తాను కొద్ది రోజుల క్రితమే ఒక లేఖ విడుదల చేశానని జస్టిస్ చలమేశ్వర్ వెల్లడించారు. ఇందులోని అంశాల ప్రాతిపదికన తాను ఇప్పుడు ఈ పిల్‌ను ఎందుకు స్వీకరించలేకపోతున్నానో తెలుసుకోవాలని చెప్పారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా సుప్రీం పరిణామాలపై బహిరంగ విమర్శలకు దిగడం కీలకంగా మారింది. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని , ఈ దశలో తాను స్పందించాల్సి ఉందని, ఇప్పుడు ఈ కేసులో తాను ఏమీ చేయలేనని చెప్పడం ద్వారా ఇప్పటి పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని చలమేశ్వర్ వివరించారు. తన పరిస్థితిని పిటిషనర్ దయచేసి అర్థం చేసుకుంటే మంచిదని జస్టిస్ చలమేశ్వర్ వేడుకున్నారు.

         ఇప్పుడు ఈ కేసును తాను విచారణకు తీసుకుని తీర్పు వెలువరించి తరువాత 24 గంటలకే దానిని సరిదిద్దుకోవల్సిన పరిస్థితిని తెచ్చుకోవడం కుదరదని తెలిపారు. క్షమించి ఈ విషయాన్ని గమనించాలని కోరారు. దేశం యావత్తూ అన్నింటినీ అర్థం చేసుకుంటుందని, వారి వైఖరిని స్పష్టం చేసుకుంటుందని జస్టిస్ పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 1౦న జస్టిస్ చలమేశ్వర్ వెలువరించిన తీర్పును ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మానం తరువాత రద్దు చేసిన అంశాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఇప్పుడు పరోక్షంగా ప్రస్తావించారు.