Home జాతీయ వార్తలు చైనా నేతకు చెన్నై స్వాగతం

చైనా నేతకు చెన్నై స్వాగతం

Chinese President Xi Jinping
భరతనాట్యం, నాదస్వరంతో ఆహ్వానం

చెన్నై : చైనా విశిష్ట అతిథికి చెన్నై ప్రజలు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీతో రేవు పట్టణం మహాబలిపురంలో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ ఇక్కడికి చేరుకున్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అనేక జానపద నృత్యాలు, సాంప్రదాయక భరతనాట్య ఘట్టాల మధ్య కళాకారులు చైనా నేతకు స్వాగతం పలికారు. ఓ వైపు వేలాది మంది బాలలు భారత, చినీ జెండాలను పట్టుకుని కేరింతలు కొడుతూ జిన్‌పింగ్‌కు అభివాదం తెలిపారు. ఇక్కడి విమానాశ్రయానికి చేరుకున్న ప్రపంచ అతిరథ నేతకు రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి కె పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీరుసెల్వం, అసెంబ్లీ స్పీకర్ పి ధన్‌పాల్ ఇతరులు ఆయనకు సాదర ఆహ్వానం పలికారు.

మంద్రస్థాయిలో నాదస్వరం, ధావిల్‌ల ఆలాపన మధ్య 500 మంది వరకూ తమిళ జానపద కళాకారులు తమిళ ప్రత్యేకమైన తప్పట్టం, పొయికళ్ కుథిరాయి కళారూపాలను ప్రదర్శించారు. ఆకర్షణీయ వస్త్రధారణతో కూడిన మహిళలు భరతనాట్య ప్రదర్శన చేపట్టారు. వీటిని వీక్షిస్తూ చైనా నేత చిరునవ్వులు చిందిస్తూ నెమ్మదిగా ముందుకు కదిలారు. తన ప్రత్యేక కారు వద్దకు చేరుకునే ముందు ఆయనకు ఆలయ పూజారులు సాంప్రదాయక రీతిలో గౌరవ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి చైనా అధినేత తమ బస అయిన గియిండిలోని ఐటిసి గ్రాండ్ హోటల్‌కు చేరారు. ఇక్కడి నుంచి ఆయన మహాబలిపురం బయలుదేరి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.

మూడు భాషలలో ప్రధాని ట్వీట్
చైనా అధినేతతో మహాబలిపురంలో ముఖాముఖీ చర్చలకు దేశ రాజధాని నుంచి శుక్రవారం ప్రధాని మోడీ చెన్నైకు తరలివచ్చారు. చైనా అధినేతకు ఇంగ్లీషు, తమిళం, చినీ మండరియా భాషలలో స్వాగతం చెపుతూ ట్వీట్ వెలువరించారు. ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌కు భారతదేశ సాదర స్వాగతం అంటూ మూడు భాషలలో ప్రధాని సందేశం వెలువడింది. అంతకు ముందు ప్రధాని మోడీ తాను చెన్నైకు వచ్చినట్లు తెలియచేసుకుంటూ ఇదే విధంగా ట్వీటు వెలువరించారు. ఇక్కడికి వచ్చానని, ఘనమైన తమిళనేలపై అడుగిడటం పట్ల సంతోషిస్తున్నానని , ఇక్కడ అద్భుతమైన సంస్కృతి , ఇక్కడ ఆతిథ్యం సర్వదా విదితం అని స్పందించారు. చైనా అధ్యక్షులకు తమిళనాడు ఆతిధ్య వేదిక కావడం ఆనందదాయకం. ఇక్కడ జరిగే ఇష్టాగోష్టి సదస్సు ఇరుదేశాల పటిష్ట బంధానికి దోహదం కాగలదని భావిస్తున్నట్లు తెలిపారు.

టిబెటన్ల నిరసన.. నిర్బంధం
చైనా అధినేత జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగేందుకు టిబెటన్లు యత్నించారు. విమానాశ్రయం వద్ద, ఆ తరువాత చైనా అధినేత అధికారిక బస అయిన స్టార్ హోటల్ సమీపంలో గుమికూడిన 11 మంది టిబెటన్లను గుర్తించి వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టిబెట్ పతాకంతో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి చైనా అధినేత ముందు నిరసనకుదిగాలని యత్నించారు. వెంటనే పోలీసులు మెరుపువేగంతో వారిని అక్కడి నుంచి ఆటోలో తరలించారు, కొందరిని తీసుకుని పోలీసు జీపు వెళ్లింది. వారిని అక్కడి నుంచి తొలిగించినట్లు, ఎటువంటి కేసులు నమోదు చేయనట్లు పోలీసు అధికారులు తెలిపారు. సాంస్కృతిక, చారిత్రక నేపథ్యపు మహాబలిపురం వేదికగా జరిగే మోడీ జిన్‌పింగ్ భేటీ నేపథ్యంలో చెన్నై పరిసర ప్రాంతాలు, మహాబలిపురం దరిదాపుల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. సముద్ర మార్గాలపై కూడా నిఘా వేశారు.

హెలికాప్టర్ బదులు స్పెషల్ కారు
చైనా చరిత్ర పూర్వాపరాలు ఉన్న మహాబలిపురం వెళ్లేందుకు జిన్‌పింగ్ రోడ్డు మార్గ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా అత్యంత ప్రముఖ వ్యక్తులు ఇండియాలో అయితే హెలికాప్టర్లలో ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. అయితే మామల్లాపురం పరిసర ప్రాంతాలను వీక్షించాలనే ఆలోచనతో ఛోపర్ పర్యటన వద్దన్నారు. అంతేకాకుండా హెలికాప్టర్ల ప్రయాణం చైనా నేతల విధానానికి విరుద్ధం. చైనా నేత బసచేసిన హోటల్ నుంచి 57 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకూ చైనాకు చెందిన అత్యంత విలాసవంతమైన హాంగ్కీ కారులో ప్రయాణించారు. ఈ కారును ప్రత్యేకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతల పర్యటనలకే వినియోగిస్తారు. మావో మొదలుకుని ప్రతి అగ్రనేత ప్రయాణానికి వాడే ఈ కారుకు చైనా భాషలో ఎర్రజెండా అని అర్థం ఉంది. అంతర్గత చర్చల తరువాత మోడీ, జిన్‌పింగ్‌లు అక్కడి పరిసర ప్రాంతాలలో పర్యటిస్తారు. సాధారణంగా చైనా నేతలు హెలికాప్టర్‌లలో పర్యటనకు వెళ్లరని, విమానాలు లేదా కార్లు వాడుతారని ఇందుకు అనుగుణంగానే చైనా వివిఐపి కారును తెప్పించి ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Chennai organised special welcome for Chinese President