Home తాజా వార్తలు చేవెళ్లకు వరప్రదాయిని 111జీవో రద్దు

చేవెళ్లకు వరప్రదాయిని 111జీవో రద్దు

Ranjith Reddyమన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వ్యాపారవేత్తగా సక్సెస్. అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే టాప్ టెన్‌లో ఒకరుగా నిలిచారు. ఉన్నత విద్య అభ్యసించి పౌల్ట్రీ పరిశ్రమకు మకుటం లేని మహారాజు అయ్యారు. ఎస్‌ఆర్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆయనే డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.కెసిఆర్ స్ఫూర్తితో 2004లో రాజకీయాల్లోకి వచ్చినా ఏనాడూ టిక్కెట్లు, పదవులు ఆశించలేదు. క్రమశిక్షణ గల కార్యకర్తగా కెసిఆర్‌ను ఆకట్టుకున్న రంజిత్‌కు అనూహ్యంగా చేవెళ్ల టిక్కెట్ వరించింది. ఎన్నికల్లో నూటికి నూరుశాతం గెలుపు ఖాయమని టిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రంజిత్‌తో

‘మన తెలంగాణ’ ప్రతినిధి ఇంటర్వూ.
ప్రజల స్పందన ఎలా ఉంది?

జనం నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఉద్యమం చేపట్టినప్పటి నుంచి ప్రజల కష్టాలు తీర్చాలనే ప్రజలను దేవుళ్లుగా భావించి అధికారంలోకి రాగానే అనేక పథకాలు అమలు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, పేదలకు ఆసరా పింఛన్లు, ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసుపత్రుల్లో కెసిఆర్ కిట్లు, మంచినీటి కష్టాలు తీర్చేందుకు మిషన్‌భగీరథ, సాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్‌కాకతీయ, నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల అనుసంధానం. ఇలా ప్రతి పథకం, కార్యక్రమంతో సిఎం కెసిఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. జాతీయ పార్టీలు కూడా ఈ పథకాలను కాపీ కొట్టాయి. ప్రభుత్వ పథకాలు టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి సోపానాలుగా మారతాయి.

111 జీవో రద్దు ప్రభావం ఎలా ఉంటుంది ?

చేవెళ్ల ప్రాంతంలో ప్రతిబంధకంగా మారిన 111 జీవో రద్దు చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. పలు రాజకీయ పార్టీలు హామీలతో మోసం చేశాయి. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై కెసిఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే జీవోను రద్దు చేస్తామని మాటిచ్చారు. వికారాబాద్ ప్రచారసభలో చేసిన ప్రకటన శివారు ప్రాంతాల వారికి వరప్రదాయినిగా మారుతుంది. లక్షల మందికి మేలు చేకూరుతుంది. సిఎం ప్రకటన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. భారీ మెజార్టీతో నన్ను గెలిపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

కృష్ణా రైల్వేమార్గం కోసం ప్రయత్నిస్తారా?

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కృష్ణా రైల్వేలైన్‌కు మోక్షం లభించేలా చేస్తాం. కేంద్రంలో అధికారంలోకి రానున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఎంపిగా గెలుపొందిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించి కృష్ణా లైనుకు నిధులు తెస్తాం. వికారాబాద్ నుంచి పరిగి మీదుగా రాయచూరు వరకు రైలు మార్గం కోసం సర్వే పూర్తయింది. కానీ నిధుల కేటాయింపునకు మోక్షం లభించకపోవడం దురదృష్టకరం. ప్రతి బడ్జెట్‌లో మొండి చేయి చూపించారు. రైల్వే ప్రాజెక్టుల మంజూరుకు కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు విస్మరించాయి. ఈసారి అలా జరుగనివ్వం. పరిగి ప్రాంత ప్రజలకు రైల్వేసేవలు దక్కేలా చేస్తా. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.800 నుంచి వెయ్యి కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా.

ఎంఎంటిఎస్ పొడిగింపు ప్రతిపాదనపై మీ స్పందన

ప్రస్తుతం లింగంపల్లి వరకు నడుస్తున్న ఎంఎంటిఎస్ రైలును పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శంకర్‌పల్లి లేదా వికారాబాద్ వరకు ఎంఎంటిఎస్ పొడిగించేందుకు చొరవ తీసుకుంటాం. అందుకు రెండు ప్రభుత్వాల వాటా కింద నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయం. హైదరాబాద్ నుంచి ముంబాయి వెళ్లే ఈ ప్రధాన లైను దశాబ్దంన్నర క్రితమే డబ్లింగ్ జరిగింది. విద్యుదీకరణ కూడా పూర్తయినందున రెండు ప్రభుత్వాల సహకారంతో ఎంఎంటిఎస్ పొడగింపుకై కృషి చేస్తా. ప్రయాణికులకు అనుగణంగా తాండూరు వరకు పలు రైళ్ల పొడగింపు అవసరముంది.

తాండూరులో కంది బోర్డు ఆచరణ సాధ్యమేనా?

గట్టి సంకల్పం ఉంటే ఆచరణ సాధ్యమే. అది సాధించి తీరుతాం. వ్యవసాయ రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాండూరు ప్రాంతం కంది పంటకు ప్రసిద్ధి. ప్రతియేటా 5 నుంచి 6 లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడి అవుతున్నాయి. ఐదేళ్లుగా జిల్లా అంతటా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులకు మేలు చేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా రైతులు మోసపోతూనే ఉన్నారు. వారు పండించే పంటకు ధరలు నిర్ణయించే వీలుగా కంది బోర్డు ఏర్పాటు అవసరం ఉంది. కొంతమంది హామీలకే పరిమితం చేశారు. కానీ మేం ప్రత్యేక దృష్టి సారించి కంది బోర్డు సాధిస్తాం. వికారాబాద్ జిల్లా రైతులకు ఎంతో మేలు చేస్తాం.

స్థానికంగా ఉంటారా ?

నేను స్థానికుడినే. 35 ఏళ్లుగా చేవెళ్ల గడ్డపై ఉంటున్నా. వ్యాపారమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నా. కెసిఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రస్తుతం నాకెలాంటి బాధ్యతలు లేవు. మరింత సమయం ప్రజాసేవకే కేటాయిస్తా. ఎంపిగా గెలుపొందిన తర్వాత ప్రజాసమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తా.
గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు..!

ముందుగానే చెప్పా. కెసిఆర్ పథకాలే టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి సోపానాలు. కనీసం 2 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తాం. నామినేషన్ల ఘట్టం పూర్తయినప్పటి నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు విజయవంతమైనాయి. ఎక్కడకెళ్లినా సానుకూలతతో మహిళలు, పెద్దలు దీవెనలు అందించారు. యువకులు తెరాసకు ఓటు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వికారాబాద్‌లో సిఎంకెసిఆర్ సభ సూపర్ సక్సెస్ కావడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేశారు. తాండూరు, పరిగిలో కెటిఆర్ రోడ్‌షో కూడా సక్సెస్ అయ్యాయి. జిల్లాలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా నా కోసం ప్రచారం చేశారు.

డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి
పుట్టిన తేదీ : 18.09.1964
భార్య : సీతారెడ్డి
కూతురు : పూజారెడ్డి
కుమారుడు : రాజ్ ఆర్యన్
విద్యార్హతలు : పిజి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్.
ఉద్యోగం : చేవెళ్లలోని అజీజ్‌నగర్‌లో పౌల్ట్రీఫామ్‌కి టెక్నికల్ సలహాదారుగా కెరీర్ ప్రారంభించి ఆరేళ్ల పాటు ఉద్యోగం నిర్వహించారు.
వ్యాపారరంగ ప్రవేశం : 35 ఏళ్ల క్రితం డాక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి యస్‌ఆర్ హాచరీస్‌ను ప్రారంభించారు. ఆనతికాలంలోనే సక్సెస్ సాధిం చారు. పౌల్ట్రీ రైతుగా పేరుగాంచారు. దేశంలోనే టాప్ 10లో ఒకరుగా నిలిచారు. చేవెళ్ల ప్రాంతంలో ఎక్కువగా ఫామ్‌లు ఏర్పాటు చేశారు.
రాజకీయ ప్రవేశం : కెసిఆర్ స్ఫూర్తితో 2004లో టీఆర్‌ఎస్‌లో చేరిక. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

Chevella TRS MP Candidate Ranjith Reddy Interview