Saturday, April 20, 2024

బహుజన చక్రవర్తి ఛత్రపతి

- Advertisement -
- Advertisement -

chhatrapati-shivaji

ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేననే జాతీయ భావనని శివాజీ కల్పించిండో అదే శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిన అదే బ్రాహ్మణ వర్గం శివాజీని కేవలం హిందు మతాభిమానిగా ముందు పెట్టడం ఈ దేశ బహుజనుల పాలిటి విషాదం. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్భీకాపు వ్యవసాయ కులం (ఒబిసి)లో పుట్టి ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన శివాజీ జీవితం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్న బహు జనులకు వీపు మీద ఒక చరుపులాంటిది. రాజ్యం కాదు ప్రజలు తమదిగా భావించే స్వరాజ్యంలో రైతులు, స్త్రీలు అస్పృశ్యులు గిరిజనులు సామాన్యులను ఎలా భాగస్వామ్యం చేయాలో బహుజన రాజ్య నిర్మాణం ఎలా ఉండాలో అనే ప్రణాళిక కి ఆయన పాలన విధానం మాతృక లాంటిది.

ఈ దేశమూలవాసులైన ముస్లింలు (మతం మారిన వారు), ఆస్పృశ్యులు (మహర్ మాoగ్), గిరిజనులు (రామోషి), మంగలి, చాకలి సకల కులాలు మొదలు పంట పూర్తయినంక అక్టోబర్ నుండి ఎప్రిల్ వరకు సైన్యంలో ఇష్టంగా పెద్ద ఎత్తున పని చేసిన రైతులది. శ్రమతో సంబంధం గల ఈ మట్టి మనుషులు రైతులు బయట స్త్రీలు కనిపిస్తే తమ ఇళ్ళల్లో తల్లి కూతుళ్ళను గుర్తుకు తెచ్చుకుంటారే తప్ప మానభంగం చేయరు. పంటలు గొల్లగొట్టరు. నాశనం చేయరు. తమ రాజు ఇస్తున్న సరిపోయే జీతాల వల్ల రాజు ఆజ్ఞ ప్రకారం డబ్బులివ్వకుండా ఎవరి దగ్గర వస్తువులు, తిండి పదార్థాలు జబర్‌దస్తీగా తీసుకోరు. శివాజీ దళితులను, సైన్యంలోకి తీసుకోని వారిని దుర్గాధిపతులని చేసిండు.

అలా సైన్యంలోకి చేరిన తొలితరం సైనికుల నుండే తర్వాతి కాలంలో మహార్ కులానికి చెందిన బాబాసాహేబ్ అంబేడ్కర్ తండ్రి రామ్జీ సక్పాల్ సైన్యంలో సుబేదార్ స్థాయికి చేరిండ్రు. శివాజీ గూఢాచారి విభాగం (ఇంటెలిజెన్స్) అధిపతి బాహిర్జీ నాయక్ గిరిజన రామోషి తెగ వ్యక్తి (బంజారా ఇక్కడ లంబాడా). ఇతని వారసుడు క్రాంతి వీర్ ఉమాజీ నాయక్ మరాఠా సామ్రాజ్యం కుప్పకూలిన దశలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఉరి తీయబడ్డడు. సముద్రంలో చేపలు పట్టే కోలీ (ముదిరాజ్ ), సొంకాలీ, భండారీ లాంటి బెస్త కులాల మట్టి మనుషులని నావిక దళ సైన్యంగా మార్చిండు. అది జాతీయ సైన్యం. అది దేశమంటే తమ రాజ్యమంటే ప్రేమ గల నిజమైన సైన్యం.

అందుకే అపుడు ప్రజలు ఈ దేశం మాది రాజు మా నాయకుడు అని భావించారు. అలా విదేశీ ముస్లింల దండయాత్రలతో భారత్ దేశం విదేశీయుల పాలైన సందర్భంలో ఈ దేశంలో తిరిగి స్వరాజ్యాన్ని స్థాపించింది ఇక్కడి ఈ మూలనివాసులే. ఆ మూల నివాసీల బహుజనుల నాయకుడు శివాజీ. బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. క్షత్రియులు మాత్రమే యుద్ధాలు చేయాలి, రాజ్యమేలాలి. వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి. శూద్రులుపై మూడు వర్గాలకి సేవ చేయాలన్న సందర్భంలో, నాలుగు శాతం ఉన్న క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేమని గ్రహించిన వ్యవసాయ కులానికి చెందిన మరో కున్భీకాపు సంత్ తుకారాం (భక్త తుకారాం) గురువుగా ఛత్రపతి శివాజీకి హితబోధ చేస్తాడు.

తన తల్లి జిజావు కుల, మత భేదంలేని తమ పూర్వీకుడైన బలి చక్రవర్తి రాజ్యాన్ని ఈ దేశంలో తిరిగి తీసుకు రావాలని ఉగ్గు పాలతో బోధిస్తుంది. ఆ మేరకు శివాజీ రాజ్యంలో జూన్ నుండి అక్టోబర్ నాటికి పంట చేతికి వచ్చినంక రైతులందరూ దసరాకి సైనిక శిక్షణ తీసుకొని సంక్రాంతి నుండి యుద్ధాలలో పాల్గొని శివాజీ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తరు. స్త్రీల విషయంలో శివాజీ చాలా ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్న వ్యక్తి. 1678లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ చేలాది దుర్గం ముట్టడించి సావిత్రిబాయి దేశాయ్ అనే ఆ దుర్గాధిపతిని మానభంగం చేస్తే శివాజీ కళ్ళు పీకించి యావజ్జీవ కారాగారవాసం విధించిండు. కళ్యాణ్ సుబేదార్ ని ఓడించాక ఆమె కోడలిని ఒక యోధుడు శివాజీకి కానుకగా సమర్పిస్తే ఆమెని చూసి శివాజీ ‘మా అమ్మ ఇంత అందంగా ఉంటే నేనెంత అందంగా ఉండేవాడినేమో!’ అని ఆమెని తిరిగి సగౌరవంగా వెనక్కి పంపిస్తాడు. ఒక సువిశాల మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి ఏ బ్రాహ్మణుడు ముందర రాలేదు.

కారణం శివాజీ శూద్రుడు కాబట్టి. హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గంగాభట్ అనే బ్రాహ్మణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలుతో గంగాభటుడు శివాజీ నుదిటకి తిలకం దిద్ది రాజ్యాభిషేకం చేస్తాడు. వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులుందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని ధర్మం విధించింది. ముసల్మాన్ రాజు కావచ్చు, కానీ శూద్రుడు కాలేడు. మహా చక్రవర్తి శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణవాదం ఆ తర్వాత కాలంలో తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది.

శివాజీని స్వయం శక్తిలేని వాడుగా భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్లు మూఢ విశ్వాసాన్ని ప్రచారం చేశారు. నిజానికి ఆధునికవాది (మోడ్రన్ ) అయిన శివాజీ దానిని అపుడు పోర్చుగల్‌లో తయారు చేయించిండు ఆ కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియంలో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది. ఛత్రపతి బ్రాహ్మణ మతానికి లోబడి పని చేసిండు. అవలంబించిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా కాదు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి కోసం నెల రోజులు నడక ద్వారా పోయి ఫిబ్రవరి 12, 1874న రాయగఢ్‌లో వెలికి తీసి, శుభ్రం చేయించి భారత దేశంలో తొలిసారిగా శివాజీ చరిత్ర వెలికి తీసి, సేకరించి శివాజీని ‘కుల్వాడీ భూషణ్’ ( రైతులలో శ్రేష్టుడు) అని పిలిచి ‘ఛత్రపతి శివాజీరాజే భోసలేయాంచా’ అనే గేయ కావ్యం (1885) ద్వారా శివాజీ చరిత్ర రాసి 1885లో శివాజీ ఏకాదశ ఉత్సవాలు ప్రారంభించిన మహాత్మ జ్యోతిబాఫూలే అటు విదేశీ పాలకులైన బ్రిటీష్ వారికి ఇటు పరిపాలనలో విద్యలో మిగతా కులాలకి వాటా దక్కనివ్వని అప్పటి అగ్రవర్ణమైన బ్రాహ్మణులకి వ్యతిరేకంగా శివాజీ స్ఫూర్తితో బహుజన శక్తిగా, తృతీయ శక్తిగా (తృతీయ రత్న) ఈ దేశంలో ఎన్నటికైన ఎదుగుతామని మొదట్లో శివాజీ ఏకాదశ (11) ఉత్సవాలని ప్రారంభించిండు మహాత్మ జ్యోతి బాఫూలే.

chhatrapati shivaji maharaj jayanti 2020

 

*ఇట్యాల వెంకటకిషన్ శాక్య, 9908198484

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News