Home జాతీయ వార్తలు చిదంబరం అరెస్ట్

చిదంబరం అరెస్ట్

Chidambaram

 

ఢిల్లీలోని నివాసం వద్ద కేంద్ర మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్న సిబిఐ

అంతకు ముందు అత్యవసర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
రేపు విచారణకు నిర్ణయం, ఇంటి వద్ద హైడ్రామా
ఎఐసిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడి ఇంటికి వచ్చిన వెంటనే అరెస్టు

బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ససేమిరా  శుక్రవారం విచారిస్తామన్న న్యాయస్థానం  అరెస్ట్‌పై భగ్గుమన్న రాహుల్, ప్రియాంక

న్యూఢిల్లీ : అత్యంత నాటకీయ పరిణామాల నడుమ ఐఎన్‌ఎక్స్ మీడియా అవకతవకల కేసులో మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరాన్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. బుధవారంనాడు రాత్రి దాదాపు గంటపాటు సాగిన హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికొచ్చిన సిబిఐ, ఇడి అధికారులను చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా సాగింది. దీంతో అధికారులు ఆయన నివాసం గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత సిబిఐ ప్రధాన కార్యాలయానికి కారులో చిదంబరాన్ని తరలించారు. అక్కడ విచారణ జరిపి గురువారంనాడు కోర్టులో హాజరు పరచనున్నారు.

అంతకుముదు మంగళవారం ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. దీంతో మంగళవారమే చిదంబరం ఇంటికి సిబిఐ అధికారులు వెళ్లారు. అయితే అక్కడ లేకపోవడంతో ఆ బృందం వెనుదిరిగింది. మరోవైపు హైకోర్టు ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన నేపథ్యంలో చిదంబరం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఊహించని విధంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. తాను ఏ నేరమూ చేయలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.

నాపై చార్జిషీటే లేదు : చిదంబరం
దర్యాప్తు సంస్థలు చట్టాన్ని గౌరవించాలని కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం చెప్పారు. శుక్రవారం సుప్రీంకోర్టు తన బెయిల్ పిటిషన్‌ను విచారిస్తుందని, అప్పటివరకూ వేచి ఉండాలని సూచించారు. బుధవారం ఆయన నాటకీయంగా ఇక్కడి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్చనే పునాది అని, దీనిని చట్ట పరిరక్షణ సంస్థలు గౌరవించాల్సి ఉందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చెప్పారు. రాజ్యాంగంలోని 21వ అధికరణలో వ్యక్తుల ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించారు. ఇందులో జీవితం కావాలా? స్వేచ్ఛ కావాలా? అనే ప్రశ్న వస్తే తాను స్వేచ్ఛనే కోరుకుంటానని చిదంబరం తెలిపారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తాను ఎటువంటి నేరం చేయలేదని, తానే కాకుండా తన కుటుంబంలోని ఏ ఒక్కరికి దీనితో సంబంధం లేదని, ఎటువంటి అక్రమాలకు దిగలేదని తెలిపారు.

అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి తనపై సిబిఐ కానీ ఇడి కానీ అధీకృత న్యాయస్థానం ఎదుట ఎటువంటి చార్జీషీటు దాఖలు చేయలేదని, మరి ఈ వేధింపలు ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా సిబిఐ వారు నమోదు చేసుకున్న ఎఫ్‌ఐఆర్‌లో కూడా తాను ఏదైనా తప్పు చేసిన విషయాన్ని ప్రస్తావించనేలేదని అన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా కూడా వేరు విధంగా ఉంటోందని, తానేదో ఘోరమైన తప్పిదం చేసినట్లు, తన కుమారుడు కూడా పలు నేరాలకు పాల్పడినట్లు చిత్రీకరణ జరుగుతోందని, అయితే ఎంతటి పరిణామం అయినా సత్యం ముందు నిలబడజాలదని, ఎటువంటి ఆరోపణల్లో అయినా నిజం లేనేలేదని తేల్చిచెప్పారు. తన లాయర్ల బృందంతో కలిసి తాను రాత్రంతా అప్పీల్‌ను సిద్ధం చేసేందుకు గడిపానని, ఇందుకు తగు పత్రాల తయారీలో ఉన్నామని వెల్లడించారు.

చట్టాన్ని తాను గౌరవిస్తానని దర్యాప్తు సంస్థలు సరైన రీతిలో వ్యవహరించకపోయినా చట్టం పట్ల తన భావనలో మార్పు ఉండదని తెలిపారు. శుక్రవారం ఆ తరువాత కూడా తన నిరీక్షణ సాగుతుందని, ఏది ఏమైనా స్వేచ్ఛాదీపం వెలుగుతుందని ఆశిద్దాం, ఇది దేశవ్యాప్తంగా దైదీప్యమానం అవుతుందని భావిస్తున్నానని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తంకా ఇతరులు ఉన్నా రు. విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండానే వెంటనే అక్కడి నుంచి నేరుగా తమ నివాసానికి వెళ్లారు.

సుప్రీంలోనూ నిరాశే
ఐఎన్‌ఎక్స్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. దీనిని శుక్రవారం విచారణకు చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. దీంతో వెంటనే సిబిఐ చిదంబరానికి వ్యతిరేకంగా లుక్‌ఔట్ నోటీసులను జారీ చేసింది. ఆయన దేశం వదిలివెళ్లకుండా లుక్‌ఔట్ నోటీసును వెలువరించినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. అన్ని విమానాశ్రయాలకు సిబి ఐ చిదంబరం గురించి తెలియచేస్తూ అప్రమత్తం చేసింది. ఇడి వర్గాలు కూడా అలర్ట్ అయ్యాయి.

త్రిసభ్య ధర్మాసనం ఎదుటికి వచ్చినట్లే వచ్చి….
తమ క్లయింట్ అరెస్టు నివారణకు అత్యవసర ప్రాతిపదికన విచారణ జరిగితీరాలని చిదంబరం లాయర్లు భావించారు. అత్యంత భారీ స్థాయి ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో కీలక పురోగతికి చిదంబరం అరెస్టు అవసరం అని సిబిఐ, ఇడి పట్టుపట్టాయి. వీరి నుంచి అరెస్టుల నివారణకు ముందస్తు బెయిల్ అభ్యర్థన హైకోర్టులో ఫలించకపోవడంతో తాజా పిటిషన్‌ను చిదంబరం లాయర్ల బృందం బుధవారం ఉదయం న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, ఎం శంతనగౌదర్ , అజయ్ రస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావనకు వచ్చేలా చేశారు. అయితే దీనిని అత్యవసర ప్రాతిపదికన విచారించాలనే అభ్యర్థన తమ పరిధిలో లేదని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. దీని కోసం ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపింది. దీనితో త్రిసభ్య ధర్మాసనం ఎదుటికి బుధవారం కేసు విచారణ వచ్చి, బెయిల్ మంజూరుకు అవకాశం వస్తుందా? రాదా? అనే మీమాంసతో చిదంబరం లాయర్ల బృందం చాలా సేపటివరకూ ఉత్కంఠతతో ఎదురుచూశారు.

మాల్యా వలె వ్యవహారం : బిజెపి విమర్శ
దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా చిదంబరం తప్పించుకు తిరుగుతున్నాడని బిజెపి విమర్శించింది, ఈ విధంగా ఆయన విజయ్ మాల్యా , నీరవ్ మోడీ జాబితాలోకి చేరేలా ఉన్నాడని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు బుధవారం విలేకరులతో అన్నారు. గాంధీ కుటుంబం ఈ నేతకు అవినీతి చేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు, అందుకే ఆయన భారీ స్థాయిలో ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌కు దిగినట్లు ఆరోపించారు.

రాజకీయ కక్ష సాధింపు : కార్తీ
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే సిబిఐ ఈ చర్యకు దిగిందని చిదంబరం కుమారు డు కార్తీ చిదంబరం విమర్శించా రు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దారి మళ్లిం చేందుకు కేంద్రం ఇటువంటి చర్యలకు దిగుతోందని మండి పడ్డారు. కొందరిని సంతృప్తి పర్చేందుకు ఇటువంటి వికృత జుగుప్సాకర చేష్టలకు దిగుతూ ఆనందిస్తున్నట్లున్నారని కార్తీ చెన్నైలో తమ నివాసంలో తెలిపారు.

‘మాజీ ఆర్థికమంత్రిపై వ్యక్తిత్వ దాడికి ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను వాడుకుంటోంది. పౌరులు నిజం మాట్లాడితే ప్రభుత్వం పీడిస్తోంది. చిదంబరాన్ని వ్యక్తిగతంగా దెబ్బతీ యడానికి మోడీ ప్రభుత్వం ఇడి, సిబిఐలను, మీడియాలో వెన్నెముక లేని వర్గాలను వాడుకుంటోంది. ఈ అవమానకర మైన అధికార దుర్వినియోగాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను’ రాహుల్‌గాంధీ

చిదంబరాన్ని వేటాడి వేధిస్తున్నారు. ఆయన రాజ్యసభలో గౌరవనీయ సభ్యుడు. దశాబ్దాల తరబడి దేశా నికి సేవ చేశారు. నిజం మాట్లాడేం దుకు ప్రభుత్వ వైఫల్యాలను బయ టపెట్టేందుకు ఆయన వెనకాడరు. సత్యంకోసం పోరాడేందుకు మేము ఆయన వెంటే ఉంటాం’ ప్రియాంక వాద్రా

‘నిన్న సాయంకాలం ఆరున్నర దాకా ఒక లీగల్ కాన్ఫరెన్స్‌లో నాతోపాటు ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా అదృ శ్యమవుతారు? మోడీ ప్రభుత్వం చేస్తున్న చాలా ఏహ్యమైన కక్షసాధిం పును భారతదేశం చూస్తోంది. బిజెపి పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తోం ది. జడ్జి ఏడు నెలలపాటు తీర్పు ఇవ్వలేదు. ఇప్పు డు ఆయన రిటైర్మెంట్‌కు 72 గంటల ముందు తీర్పు ఇవ్వబోతున్నారు. మాజీ ఆర్థికమంత్రిని వేటా డేందుకు సిబిఐ, ఇడిలను దాడికి పంపించింది’ సూర్జేవాలా.

Chidambaram was taken into custody by the CBI