Thursday, April 25, 2024

సిఎం సంకల్పం నెరవేరుతోంది

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ, ఎల్లంపల్లి నుంచి నిరంతర పంపింగ్ ప్రక్రియ
శ్రీరాంసాగర్, ఎల్‌ఎండి ప్రాజెక్టులను పూర్తిగా నింపుతాం
నిత్యం రెండు టిఎంసిల నీటి పంపింగ్ : కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు

Chief Engineering Nalla Venkateswarlu interview on Kaleshwaram

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సిఎం కెసిఆర్ సంకల్పంతో ఉన్నారని, ఆ సంకల్పం త్వరలోనే నెరవేరుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నంది పంపు హౌస్‌లో ఆయన ‘మన తెలంగాణ’తో మాట్లాడారు.

మనతెలంగాణ/ధర్మారం: తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో ఉన్నారని, ఆ సంకల్పం త్వరలోనే నెరవేరుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నంది పంపు హౌస్‌లో ఆయన ‘మన తెలంగాణ’తో మాట్లాడారు. ప్రస్తుతం మేడిగడ్డ, ఎల్లంపల్లి నుంచి నిరంతర పంపింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దిగువ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపుతామని తెలిపారు. మేడిగడ్డి వద్ద నీరు పుష్కలంగా ఉందని, లింక్ 1 పరిధిలో లక్ష్మి పంపు హౌస్‌లో 11 మోటార్లకు గాను 10 మోటార్లు పని చేస్తున్నాయని తెలిపారు. నిత్యం 2 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. సరస్వతీ పంపు హౌస్‌లో 8 మోటార్లకు గాను 7 మోటార్లు పని చేస్తున్నాయని, పార్వతీ పంపుహౌస్‌లో 9మోటార్లకు గాను 8 పంపింగ్ చేస్తున్నాయని తెలిపారు. లింక్ రెండు పరిధిలో నంది పంపు హౌస్‌లో 7మోటార్లకు 6 పంపులు పని చేస్తున్నాయని, గాయ త్రి పంపు హౌస్‌లో 7మోటార్లకు గాను 5 పని చేస్తున్నాయని తెలిపారు. నిత్యం రెండు టీఎంసీల నీటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీలకు గాను 12.798 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రివర్స్ పంపింగ్‌లో ప్రతి రోజు నీరు వస్తుండడంతో నంది, గాయత్రి పంపుల ద్వారా ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్‌కు నీటిని పంపిస్తున్నామని చెప్పారు. 26 టీఎంసీల రాజరాజేశ్వర రిజర్వాయర్‌లో 9 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 17 టీఎంసీల నీటిని నింపి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో 20.5 సామర్థానికిగాను 6.5 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, 14 టీఎంసీల నీటిని నింపి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ఇంజనీర్ ఇన్ చీఫ్ తెలిపారు. లక్ష్మి, సరస్వతీ, పార్వతీ, నంది, గాయత్రి, పంపు హౌస్‌లలో నిరంతరం పంపింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మేడిగడ్డ వద్ద పుష్కలంగా నీరు ఉండడంతో రివర్స్ పంపింగ్‌తో ఎల్లంపల్లి నుంచి ఎస్‌ఆర్‌ఆర్ వరకు సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని, ప్రతి నీటిచుక్కనూ సద్వినియోగం చేసుకునే సీఎం సంకల్పం మేరకు పని చేస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం నీటిని అందించడానికి నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు.

Chief Engineering Nalla Venkateswarlu interview on Kaleshwaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News