Home కలం బాల సాహిత్యం ‘బాలల వికాసం’ కోసమే

బాల సాహిత్యం ‘బాలల వికాసం’ కోసమే

 

ఇవ్వాళ్ళ తెలుగు ప్రాంతాల్లో బాల సాహిత్యం ‘సోయి’ చాలా మందిలో కలిగింది. గతంలో కంటే ఎక్కువ మంది ఆ దిశగా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇది ఏ ప్రాంతానికో కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ఆ దిశగా సాగిన చైతన్యమే బడిలో పాఠాలు చదువుకుంటున్న మన పిల్లల రచనలు పాఠ్యాంశాలుగా ఎంపికవుతున్నాయి. పాఠశాలలు ప్రచురణ సంస్థలుగా పిల్లల రచనలను తెస్తున్నాయి. ఇది ఆసిఫాబాద్ నుండి అనకాపల్లి దాకా, అనంతపురం నుండి సిరిసిల్ల దాకా అత్యంత వేగంగా జరుతుతోంది. ఫలితంగా వందలాది పిల్లల రచనలు, వేలాది మంది బాల సృజనకారులు వస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం’ గా జరుపుకుంటున్నాం. అంటే పిల్లల కోసం, వాళ్ళ పుస్తకాల కోసం ఆలోచించాల్సిన సమయం అన్నమాట. నేను పైన పేర్కొ న్న బాల వికాసకారులు, బాలచెలిమి కారుల్లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ ఒకరు.

నేటి బాల సాహిత్యాన్ని గురించి సిద్దిపేటలో జరిగిన ఒక చర్చలో ‘నేటి బాల సాహిత్యం తీరుతెన్నుల ఎలా ఉన్నాయి, నేడు బాల సాహిత్యం పేరుతో వస్తున్న సాహిత్యం ఏ మేరకు పిల్లల అవసరాలను తీర్చడంలో ఏ మేరకు ఉపయోగంగా ఉంది, నేడు వస్తున్నదంతా బాల సాహిత్యమేనా’ అన్న ప్రశ్నలను సంధించినప్పుడు తిరిగి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరఉందనిపించింది.
నేటి ఆధునిక బాల సాహిత్య వికాసానికి ముందు తొలినాళ్ళలో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు అందరు భారత, భాగవత, రామాయణాల పద్యాల్ని, సుమతి, వేమన, రామరామ శతకాలని బాల సాహిత్యంగా చదివి వికాసం చెందిన వాళ్ళే. తొలినాళ్ళలోనే ఉత్కృష్టంగా వెలిసిన బాల సాహిత్య వికాసాన్ని ఇవ్వాళ్ళటి కంప్యూటర్ యుగంలో పోల్చి చూస్తే ఇంకా అక్కడే ఆగిపోయామేమో అనిపిస్తోంది. ఇవ్వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది బాల సాహిత్యాన్ని వివిధ ప్రక్రియల్లో రాస్తున్నాం. అయినా ఎక్కడో ఒకదగ్గర దేనినో ఒకదాన్ని మరిచిపోతున్నామేమో అనిపిస్తుంది. ఆంగ్ల్లం మొదలుకుని ఇతర భారతీయ భాషల్లో వచ్చిన పిల్లల పుస్తకాలను, మన తెలుగులో వస్తున్న పిల్లల పుస్తకాలను చూస్తే ప్రచురణలో, ప్రచారంలో తేడా కనిపించకమానదు.

ఇది కేవలం అచ్చువేసుకోవడం, ప్రాచారం వంటి అంశాలకే కాక వస్తువు విషయంలో కూడా అలానే ఉన్నామేమో అనిపిస్తోంది. నలభైయేండ్ల క్రితం మన ఇండ్లల్లో రేడియోలు తప్ప టి.విలు లేని కాలంలో విన్న చందమామ కథలు, గేయాలు ఇప్పటికీ నేటి పిల్లల సాహిత్యంలో చూస్తున్నాను. అట్లని అవి పనికిరావని కాదు, తరంలో మార్పు వచ్చింది. జీవితాల్లో వేగం పెరిగింది. ఆ చందమామ ఆ కథలు ఈ పిల్లలకు నచ్చాలంటే సాంకేతికంగా ఆ మార్పు వీటిలోనూ చోటు చేసుకోవాలి. మనం చదివిన కథలను అట్లాగే చదవమంటే ఈ తరానికి రుచించకపోవచ్చు. కాలానికి తగ్గట్లు త్రిడి సహాయంతోనో, ఇతరత్రా విధానాల్లో వస్తే మనను ప్రభావితం చేసిన భేతాళకథ నేటి పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇప్పటికి మనం పిల్లల కోసం రామాపురం, రంగాపురాలు, రాజుగారి పెద్ద కొడుకు, చిన్న కొడుకు వారిలో బుద్ధిమంతుడెవరో తెలుసుకోవడం వంటి కథలు రాస్తున్నాం. ఇక గేయాల విషయానికి వస్తే ‘ఉగాది పండుగు వచ్చింది’ వంటి వాటి వద్దే ఆగుతున్నాం. విజ్ఞాన శాస్త్రం పేరుతో ‘పాలకూర, గోంగూర’, వివిధ వస్తువుల గురించి రాసి వాటిని విజ్ఞాన రచనలు అంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అన్నింట్లో ఆవిష్కృతమైనట్లే బాల సాహిత్యంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బాల భాషలో, వస్తువులో, ముద్రణలో అన్నింట్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా చూస్తే సమకాలీన భారతీయ బాల సాహిత్యం మాత్రం ఆంగ్ల సాహిత్యంతో పోలిస్తే కొంత వెనుకనే ఉంది. తొలి నాళ్ళలో రష్యన్ బాల సాహిత్యాన్ని రాదుగ, ప్రగతి ప్రచురణాలయాల ద్వారా తెలుగులో చదివిన మనం ఆ జ్ఞాపకాలను ఇప్పటికీ స్మృతిపథంలో ఉంచుకున్నామంటే వాటిలోని కథలు, విలువలే కారణం.

ఇరుగు పొరుగు భారతీయ భాషల్లోనూ బాల సాహిత్య రచనలో కొత్త ఆలోచనలు వచ్చాయి. వస్తున్నాయి. ముఖ్యంగా రేపటి పౌరులైన బాలల కోసం వస్తున్న సాహిత్యం వాళ్ళు భవిష్యత్తు తరంతో పోటీపడేట్టు ఉండాలి. ముఖ్యంగా కల్పిత కథలూ, గాథల కంటే ఎక్కువగా విజయగాథలు, సాహస గాథలు ప్రధానంగా వారి రచనల్లో చోటు చేసుకోవాలి. విలుల్ని పెంచి, సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసే మన బాల్యం నాటి కథలతోపాటు విజయం వైపు నడిపించే సామాన్య వీరుల కథలు, విజయగాథలు ఉండాలి. భయపెట్టే మంత్ర తంత్రాలు, దయ్యాలు భూతాల కథలకు కాలం చెల్లింది. వైజ్ఞానిక దృక్పథాన్ని, హేతువును పెంపొందించే రచనలు ఎక్కువగా రావాలి. అట్లని కేవలం వైజ్ఞానిక దృక్పథాన్ని మాత్రమే పెంచితే సరిపోదు. దీనికి తోడు పిల్లల మనస్తత్వాన్ని, నేటి కాలమాన పరిస్థితుల్ని అవగాహన చేసుకుని రచనలు రావాలి. బాల సాహిత్యమంటే కేవలం కథ, కవిత, గేయం మాత్రమే అన్న అభిప్రాయం నుండి బయటకు వచ్చి ‘బాలల వికాసానికి సంబంధించిన ప్రతిదీ బాల సాహిత్యమే’ అన్న పెద్దల అభిప్రాయం ప్రకారం అన్ని ప్రక్రియల్లో రచనలు చేయాల్సిన అవసరముంది. అప్పుడే బాల సాహిత్యం మరింత పరిపుష్టమవుతుంది.

గతంలో బాల సాహిత్య, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కొత్త విషయం చూసాను. బాలల కోసం కథలు, గేయాలు ప్రచురిస్తూనే ప్రేంచంద్, శరత్‌చంద్ర, రవీంద్రనాథ్ టాగూర్ వంటి రచయితల ప్రసిద్ధ కథలు, నవలలు, గాథలను పిల్లల స్థాయిలో సంక్షిప్తీకరించి ప్రచురిస్తున్నారు. అలా ప్రేమ్‌చంద్ కఫన్, రవీంద్రుని కాబూలీవాలా, ఘర్‌వాపసి వంటి కథలను నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఇవేకాక ప్రసిద్ధ ఆంగ్ల నవలలు, పుస్తకాలను కూడా సంక్షిప్తీకరించి పిల్లల కోసం తీసుకువచ్చారు. ఇవి కేవలం ఒక్క తెలుగులోనే రావాలనడం లేదు. ఇవే తెలుగు పుస్తకాలు ఆంగ్లంలో కూడా ప్రచురిస్తే వాటి పాఠకులు వాటిని ఆస్వాదిస్తారు.

పిల్లల కోసం రచనలతో పాటు ఎన్నో పత్రికలు పనిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమి, పబ్లికేషన్ డివిజన్, విజ్ఞాన్ ప్రసార్ వంటివి పిల్లల కోసం పుస్తకాలను ప్రచురిస్తున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే పైన పేర్కొన్న ప్రభుత్వ సంస్థలతో పాటు ఎంతోమంది ప్రచురణ కర్తలు పిల్లల పుస్తకాలు ప్రచురిస్తున్నారు. వందలాది స్వచ్ఛంద సంస్థలు మంచి పుస్తకాలను పిల్లల వద్దకు చేరుస్తున్నాయి. ఇలా విభిన్న పార్శ్వాలుగా అన్ని రంగాల్లో వికాసం జరిగినప్పుడే బాల సాహిత్యం ఉద్దేశం నెరవేరుతుంది. అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం వెనుక ఉన్న ఆలోచన ఫలవంతమౌతుంది. ‘జయహో…. బాల సాహిత్యం.’

 

డా. పత్తిపాక మోహన్

99662 29548