Tuesday, April 16, 2024

కోరిందల్లా ఇస్తే కష్టమే!

- Advertisement -
- Advertisement -

Children

 

“ మార్కెట్‌లోకి వచ్చిన ఏ ఎలక్ట్రానిక్ వస్తువయినా మా బాబీ కోసం కొనాల్సిందే”
“ అవును మా కార్తీక్‌కు అన్నీ తెలుసండీ… నిండా ఆరేళ్లు లేవు గూగుల్ సర్చ్ చేసేస్తాడు. వాళ్ల నాన్న వాడికి గైడూ… ప్రతిదీ కొనాల్సిందే”.
“ ఉదయం అనగా వెళ్లిపోయి ఏ రాత్రికో ఇంటికి చేరతాం ఇద్దరూ. శనాదివారాలు కాస్త ఆటవిడుపు. ఇక షాపింగ్ కోసమే మా దీపూ కాచుకుని ఉంటాడు. ఏ ఫ్యాషన్ డ్రస్ వచ్చినా కొనాల్సిందే. పిల్లవాడికి కనీసం ఆ కోరిక అన్నా తీర్చాలి అనుకుంటాం. వాడ్ని కనిపెట్టుకుని ఎప్పుడైనా గడిపామా? అందుకే ఏది అడిగినా కాదనాలి అనిపించదు.”

ఇవ్వాల్టి తరం తల్లిదండ్రులు చెప్పే కబుర్లు దాదాపు ఇలాగే ఉంటాయి. పిల్లలు ఏం కోరినా కర్ణుడిలా కవచ కుండలాలు ఒలిచి ఇచ్చేంత ఉద్రేకంతో ఉంటారు. వాళ్లు బాగా సంపాదన కలిగి ఉండటం సరే మరి ఇవి కోరుకుంటున్న, బహుమతులుగా అందుకుంటున్నా లేదా కొనకపోతే ఏడ్చి రాగాలు పెట్టి మరీ వాటిని సాధించుకుంటున్న పిల్లల మాటేమిటీ? అవలీలగా ఇలాంటి ఖరీదైన అవసరం, అనవసరమైన వస్తువుల్ని ఒక్కచూపుతో సొంతం చేసుకోగల పిల్లలను ఈ వస్తు వ్యామోహం ఎక్కడికి తీసుకుపోతుంది? ఇది పిల్లల మానసిక భవిష్యత్తుని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వాళ్లు ఖరీదైన వస్తువులే అనుకుంటారు.

అలాంటివి ఉండటం వల్లే తమకు పేరు ప్రతిష్ట అనుకుంటారు. తమకంటే విలువైన వస్తువుల గలవాళ్లని చూసి అసూయపడతారు. లేదా వాళ్లని ఆరాధిస్తూ వెనక తిరుగుతూ, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకుంటారు అంటున్నారు సైకాలజిస్టులు. వస్తు వ్యామోహానికి బాల్యంలోనే పునాది పడుతుంది అంటున్నారు. స్నేహితుల దగ్గర ఏ విలువైన వస్తువు ఉన్నా అది తమ దగ్గర లేకపోతే అవమానం అని ఫీలవుతారు. ఖరీదైన వస్తువుల కలిగి ఉండడం స్టేటస్‌కి గుర్తింపుగా అనుకుంటారు. ఇలాంటి మనస్థితి పిల్లల్లో కలిగేందుకు బీజం వేసిన తల్లిదండ్రులు పిల్లల మనస్సుని తెలుసుకోగలుగుతున్నారా?

ఇవాల్టి రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదనా పరులుగానే ఉన్నారు. పిల్లలకు తగిన సమయం కేటాయించే అవకాశమే లేని పరుగుతో ఉన్నారు. అలా పిల్లలకు దూరంగా గడుపుతూ వాళ్లకి అవసరానికంటే ఎక్కువైన వస్తువుల్ని కానుకగా ఇస్తూ, తమలో పెరుగుతున్న అపరాధభావనని కప్పి పుచ్చుకుంటున్నారు.

ఇలా పిల్లలతో ఓ పూట తీరికగా గడపలేని తల్లిదండ్రులు వాళ్లకు కొని ఇచ్చే విలువైన బహుమతులను గిల్ట్ గిఫ్టింగ్ అంటున్నారు నిపుణులు. అలా వాళ్లని అనవసరమైన వస్తువులతో ముంచెత్తటం కంటే వాళ్ళతో నెలకోసారైన ఏదైన పర్యటనకు వెళ్లండి. ఆ అనుభవాలను పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అంటున్నారు. పిల్లలు తమ కోరుకున్న వస్తువులు అవసరమా, కోరిక తెలుసుకోనివ్వమంటున్నారు. ఆ వస్తువు విలువ వాళ్లు తెలుసుకునో దాన్ని భద్రపరుచుకొనే జాగ్రత్త వస్తుంది. వాళ్లకు ఇచ్చే పాకెట్ మనీని పొదుపు చేసుకుని కొనుక్కుంటే డబ్బు విలువ, వస్తువు విలువ రెండూ తెలుస్తాయి. పిల్లల కోరికలను వాళ్ల పుట్టినరోజు లేదా మంచి మారులు తెచ్చుకున్న సందర్భంలో ఇవ్వొచ్చు. అలా ఇస్తే ఒక ప్రత్యేకమైన రోజున తమకు బహుమతిగా భావిస్తారు అడిగితే, ఏడిస్తే మారాం చేస్తే అయాచితంగా చేతిలో పడితే దాన్ని ఎంత విలువగా చూడాలో వాళ్లకి బోధపడదు.

కష్టం విలువ వాళ్లకు తెలియకపోతే జీవితంలో ఎలాంటి కష్టాన్నయినా అంతులేని భారంగా చూసే అలవాటు వస్తుంది. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న పనికే వారికి వేతనం వస్తుంది. వాళ్లు తమకున్న సమయాన్ని మొత్తం పిల్లలకు కూడా కేటాయించకుండా, విశ్రాంతి లేకుండా గడుపుతున్నారని పిల్లలు తెలుసుకునేలా పెద్దవాళ్లు ప్రవర్తించకపోతే పిల్లలకు సమయం , డబ్బు, ఖర్చు ,కష్టం, త్యాగం మొదలైన వాటి విలువలే తెలియవు.. ఖరీదైన వస్తువులు, దుస్తులు మన స్టేటస్‌ను పెంచవనీ, విద్య, క్రమశిక్షణ, ప్రవర్తన ఇవే మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పిల్లలు తెలుసుకునేలా తల్లిదండ్రులు వాళ్లకి మొదటి గురువులుగా శిక్షణ ఇవ్వాలి. తాము సమయం ఇవ్వలేకపోవటాన్ని పిల్లలకు చేస్తున్న అన్యాయంలా ఫీలవకుండా, కుటుంబం కోసం పడుతున్న శ్రమగా పిల్లల్ని గుర్తించనివ్వాలి. నిజమే తల్లిదండ్రుల సంపాదనతో పిల్లలకు అనేక సౌకర్యాలు అమరుతున్నాయి. ఆ సంపాదన వెనక వాళ్ల కష్టం కూడా పిల్లలకు అర్థం అయితే వాళ్లు చిన్నతనం నుంచే ఏదైన కష్టపడితేనే సాధించుకోగలమన్న సూత్రాన్ని తెలుసుకుంటారు, కష్టపడతారు, దేన్నయినా సొంతం చేసుకోగలుతారు.

                                                                                                            సి. సుజాత

 

Children should also report hardship
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News