Thursday, March 28, 2024

భావితరాలపై వాతావ‘రణం’

- Advertisement -
- Advertisement -

ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం విష వలయంలో చిక్కుకుంది. వాతావరణంలో వస్తున్న పెను మార్పులు పసి మొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే ఒక తరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదముంది. గాలి, నీరు కాలుష్యంతో చిన్నారుల రక్తంలోకి విషకణాలు ప్రవేశిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరిలో ఈ విష కణాలు చొచ్చుకుపోతున్నాయి. దీంతో పిల్లల రక్తంలో న్యూరోటాక్సిన్ (సీసం) ఉంటోంది. పిల్లల ఆరోగ్యంపై నెమ్మదిగా కదిలి దీర్ఘకాలిక ప్రభావం చూపించనుంది. క్రమంగా మూత్రపిండాలు, హృద్రోగ సమస్యలకు దారి తీస్తోంది. వాతావరణంలో వస్తున్న అనూహ్యమైన మార్పులు ఆరేళ్ల పిల్లలపై తీవ్ర ప్రభావితం చూపిస్తోంది. ఫ్లూ, ఇన్‌ఫ్లూయింజా బారినపడుతున్నారు. కొంత మంది పిల్లలు ఆర్‌ఎస్‌వి వైరస్‌తో ఇబ్బందిపడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ వ్యాధులతో వైద్యుల వద్దకు క్యూ కడుతున్నారు. అసలే చలికాలం కావడం, దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువయ్యాయి.

ఇది కాస్త బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌గా రూపాంతరం చెందుతోంది. చల్లని వాతావరణం వైరస్ బలపడటానికి దారి తీస్తోంది. ఇన్‌ఫ్లూయింజా వైరస్ శక్తివంతమై జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో చాలా మంది పిల్లలు సతమతమవుతున్నారు. తేమ వాతావరణంలో అస్తమా, న్యుమోనియా, సిఒపిడి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.
జీవకోటిని నాశనం చేస్తున్న ‘కాలుష్యం’ సమస్త మానవాళికి ముప్పుగా పరిణమిస్తోంది. కేవలం గాలి కాలుష్యం మూలంగా ఏటా కోటి యాభై లక్షల మంది మరణిస్తుండగా, నీటి కాలుష్యంతో తొమ్మిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక 40 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. 60 శాతం మంది గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర వ్యాధులకు గురవుతున్నారు.

అప్పుడే పుట్టిన పసిబిడ్డలు కూడా కాలుష్యం కారణంగా ఉబ్బసం, ఊపిరితిత్తుల కేన్సర్, చర్మవ్యాధుల బారిన పడుతుండగా, వృద్ధి చెందుతున్న పసి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యశాస్త్ర నిపుణుల అధ్యయనం వెల్లడించింది. గర్భం దాల్చిన వెంటనే మెదడు అభివృద్ధి చెందడం ప్రారంభమైతే, ఆ తర్వాత దశలో న్యూరాన్స్ ఏర్పడుతాయి. గర్భం నుంచి ఐదేళ్ల వయసు వరకు అభివృద్ధి జరుగుతుండగా, శరీరానికి సంకేతాలను పంపడం ద్వారా అన్ని కార్యకలాపాలను న్యూరాన్స్ నియంత్రిస్తాయి. అయితే పిండంగా ఉన్న దశలో లేదా పుట్టిన తర్వాత టాక్సిన్స్, కాలుష్య కారకాలకు గురికావడం వల్ల ఎదుగుతున్న మెదడు, న్యూరాన్ల పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా, కాలుష్య కారకాలు న్యూరో ట్రాన్సిమీటర్ల పని తీరును నిరోధించడం మూలంగా సున్నితమైన సర్క్యూట్రీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

దీంతో పిల్లల ఎదుగుదలలో జాప్యం, ప్రవర్తన సమస్యలు, అటెన్షన్ డెఫినిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఆటిజం వంటి సమస్యలు తలెత్తడానికి అవకాశాలున్నాయి. విద్య విషయంలోనూ అభ్యాస వైకల్యాలను చూపేందుకు కాలుష్యం కారణమవుతోంది. కొన్ని ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల్లో ట్రాఫిక్ సంబంధిత కాలుష్యం, ఆటిజం మధ్య సంబంధాన్ని గుర్తించారు. మొత్తానికి కాలుష్యం కారణంగా ఐక్యూ తగ్గడంతో పాటు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. ఇక పర్యావరణ కాలుష్యం వల్ల చాలా మంది పిల్లలు కేన్సర్‌కు గురవుతున్నారు. తల్లిదండ్రులకు పొగ తాగే అలవాటు, పంట ధ్యానాలకు వాడే పురుగుమందల ప్రభావం కేన్సర్‌కు కారణమవుతోంది. తల్లులు తీసుకునే ఆహారం, పీల్చే గాలి ద్వారా గర్భంలో ఉన్న పిల్లలు విష ప్రభావాలకు లోనవుతున్నారు.

పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇంట, బయట ఉండే వాయు కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వాయువులు, సీసం వంటి లోహాల వల్ల శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయి. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గి ఎముకలు, కణాలు, రక్తంలో సీసం అధికంగా పేరుకుపోయి కేంద్రీయ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. తల్లిపాలు తీసుకునే ఆహారంలోనూ పురుగు మందుల అవశేషాలతో అనారోగ్యానికి గురవుతున్నారు. తాగునీటిలో ఉండే భారీ లోహాలు, ఫ్లోరైడ్‌ల వల్ల అస్వస్థతకు లోనవుతున్నారు. ప్లాస్టిక్ పాల సీసాలు, ప్లాస్టిక్ ఆట వస్తువుల ద్వారా పిల్లలు విష ప్రభావానికి చిక్కుకుంటున్నారు.
భూతాప నియంత్రణకు గట్టి చర్యలకు సమకట్టాలంటూ ఆసియా, ఐరాపాల్లోని వేలాది మంది పర్యావరణ ప్రేమికులు రెండేళ్ల క్రితమే వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ‘ప్రైడేస్ ఫర్ ప్యూచర్’ పేరుతో ఐరాస (ఐక్యరాజ్య సమితి) వాతావరణ సదస్సు ముందు గట్టి నినాదమిచ్చారు. ఢిల్లీలోనూ సుమారు 50 పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ‘వాతావరణ అత్యయిక పరిస్థితి’ ని ప్రకటించాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ‘మీరు వృద్ధాప్యంతో కాలం చేస్తే… మేము కాలుష్యంతో కన్నుమూస్తాం’ అంటూ వీధుల్లో ప్రదర్శనలు జరిపారు. అయినప్పటికీ పాలకులు తీసుకున్న చర్యలు శూన్యం. అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్ నివేదిక కూడా వెల్లడించింది. కాలుష్యం కారణంగా పిల్లల రక్తంలో న్యూరోట్యాక్సిన్ మెల్లిమెల్లిగా కదిలి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందని తెలిపింది.
పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో లోపాలు, అందులో రసాయనాలు ప్రమాదకర స్థాయిలో ఉండటం, వాహనాల ద్వారా వెలువడే పొగ కారణంగా పిల్లలు కాలుష్య సమస్యతో ఇబ్బందిపడుతుంటారని నివేదిక వివరించింది. అక్షరాల ఇప్పుడు జరుగుతుంది ఇదే. అధికాదాయ దేశాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నా, అభివృద్ధి చెందుతున్న దేశాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పారిశుద్ధ్య నిర్వహణ సరిగా ఉండటం, కాలుష్యాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు లేవు.
2015లో వేలాది మంది ప్రాణాల్ని తీసిన వడగాల్పులు వాతావరణ కాలుష్యం వల్ల రానున్న కాలంలో నిత్యకృత్యంగా మారనున్నాయి. పోషకాహార లోపం, పేదరికం, వైద్య సదుపాయాలలేమి వంటి సమస్యలతో పోరాడుతున్న మన దేశం, వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ర్పభావాలకు ఎక్కువగా ప్రభావితం కానున్నదని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. మనం పనికి రావనీ, అవసరం లేదనీ పడేసే వాటి వల్ల భూమిపై చెత్త పేరుకుపోవడం, దీని వల్ల పర్యావరణానికీ హాని కలుగుతుందని తెలిసిన విషయమే. పిల్లలు మూడేళ్ల వయసుకే పరిస్థితులపై అవగాహన మొదలవుతుంది.

కాబట్టి, వృథా వాటిపై అవగాహన కలిగించాలి. అది వారిలో రీసైకిలింగ్ ప్రాముఖ్యాన్ని పెంపొందేలా చేస్తుంది. ఆహారం, విద్యుత్, నీరు తదితరమైన వాటి విషయాల్లోనూ ఇదే ధోరణి అవలంబించాలి. వంటింటి వృథాతో మొక్కల పెంపకంలో భాగస్వాముల్ని చేయాలి. వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చెప్పాలి. పర్యావరణానికి అనుకూలమైన జీవన విధానం ప్రతిఫలించేలా ప్రతి చిన్న విషయాన్ని కూడా పిల్లలకు చిన్ననాటి నుంచి అలవాటు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News