Home తాజా వార్తలు పెద్దల అనుభవం అపురూపం

పెద్దల అనుభవం అపురూపం

Children

 

ఇవ్వాల్టి రోజుల్లో భార్యాభర్తలు ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు.ఎదుగుతున్న పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే అవకాశమే లేదు. ఇంట్లో పెద్దవాళ్లు ఉండరు. పిల్లలు ఒంటరి ప్రపంచంలో విచిత్రంగా పెరుగుతూ ఉంటారు. వాళ్ల మనసు తెలుసుకుని, వాళ్ల ఆలోచనలు పంచుకునే తోడు ఎవరూ ఉండరు. చుట్టూ కనబడుతున్న ప్రపంచం గురించి వాళ్ల బుల్లి గుండెల్లో వందలాది ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. వాటికి సమాధానాలు, అటు స్కూళ్లలోనూ ఇటు ఇళ్లలోనూ దొరకవు. గడియారంలాగా పనులు పూర్తి చేసుకుపోతూ ఉండాలి. ఒక నిశ్శబ్దం పిల్లల మనసుల్లో పేరుకుపోతూ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ల మధ్య పెరిగే పిల్లల్లో వ్యక్తిత్వం బాగా వికసిస్తుందని, వాళ్లలో చక్కని పరిణితి కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పెద్దల ప్రేమ పర్యవేక్షణలో పిల్లల్లో వివేకం వృద్ధిచెందుతుందనీ, చుట్టూ పరిస్థితులపై అవగాహన వనరుల ఉపయోగం, తోటివాళ్ల పట్ల ప్రవర్తించవలసిన తీరుతెన్నులు తెలుస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు. పసితనం నుంచి యువతగా పెరిగే క్రమంలో పెద్దవాళ్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అనుబంధం విలువ: పని ఒత్తిడిలో తీరిక లేకుండా ఉండే తల్లిదండ్రుల పట్ల పిల్లలు చాలా అసంతృప్తిగా ఉంటారు. వాళ్ల మేధస్సుకి సరిపోయే పెంపకం కావాలి. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివైన నానమ్మలు, అమ్మమ్మలు, తాతలు కావాలి. అనునయంగా మాట్లాడే తాత బామ్మలపైన పిల్లలు ముఖ్యంగా యుక్తవయసులో పిల్లలు ఎక్కువగా ఆకర్షితులౌతారని వారి మాటే ఎక్కువగా వింటారని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. పిల్లలపైన పెద్దవాళ్ల ప్రభావం ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. పెద్దవాళ్ల ప్రేమ తమ పిల్లలపైన రెట్టింపుగా ఉంటుంది.

వాళ్లే ఫ్రెండ్స్ ఫిలాసఫర్స్: ఇంట్లో పెద్దవాళ్లు తమ గారాబంతో పిల్లల్ని చెడగొడతారని సాధారణంగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తుంటారు. వాళ్ల అలుసు చూసుకుని పిల్లలు పెంకిగా మొండిగా తయారవుతారనే పేరెంట్స్ ఆరోపణ నిజమే. పెద్దవాళ్ల గారాబంతో పిల్లలు కాస్త మొండిగా తయారు కావచ్చు. కానీ ఒంటరితనంతో ఏ ఫోన్‌లోనో కాలం గడపడం కన్నా, పెద్దవాళ్ల రక్షణలో ఉండటం మేలు కదా! పిల్లల సందేహాలు తీర్చడం, వాళ్లు ఎదిగేందుకు పుష్టికరమైన ఆహారం ఇవ్వడం, ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలిగే గుండె ధైర్యం ఇచ్చే మార్గదర్శకత్వం.. ఇవన్నీ పెద్దవాళ్లు ఇవ్వగలుగుతారు. ఇలాంటి వాతావరణం పిల్లలకోసం అద్భుతంగా సృష్టించగలరు. ఓర్పుతో, నేర్పుతో అనుభవంతో వాళ్లు పిల్లల మనసులు గెలుచుకుంటారు. ఎలాంటి సమస్యనైనా తమతో పంచుకోగలిగే స్వేచ్ఛని కల్పిస్తారు. వాళ్లు చెప్పే కథలు, కబుర్లు విలువలతో కూడుకుని ఉంటాయి. తల్లిదండ్రులు దృష్టి సారించలేని ఎన్నో అంశాలు, పిల్లల ఇష్టాయిష్టాలు గమనించి, వాళ్ల చేష్టలతో, వారి మనోభావాల గురించి వారి భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు.

వాళ్లకెన్నో బాధ్యతలు, బంధాలు : రిటైరైన ఎంతోమంది పెద్దవాళ్లు తమ ఆరోగ్యం సహకరించపోయినా, వయసు మీదపడ్డా, పిల్లల కోసం అహర్నిశలు శ్రమపడుతున్నారని ఒక సర్వే చెబుతుంది. పిల్లలు ఉద్యోగాల్లో, స్థిరపడే సమయానికి వాళ్ల జీవితంలో, కెరీర్‌లో ముందుకు వెళ్లే బంగారు రోజు, అలాంటి సమయంలో పిల్లల పెంపకాన్ని సంతోషం భుజాన వేసుకుని వాళ్ల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటు పడే పెద్దవాళ్లు మన చుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. అమెరికాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ల సంతానం ఇండియాలో అవ్వ, తాత పెంపకాల్లోనే కనిపిస్తారు. ఎల్లలు చెరిగిపోతున్న ఒక సంస్కృతిని ఇంకోదేశం ఆక్రమిస్తోంది.

అమెరికా వంటి దేశాల్లో పుట్టుకతోనే గ్రీన్‌కార్డ్ తెచ్చుకున్న పిల్లలు ఆ సంస్కృతికే అలవాటు పడిపోవటం, భారతదేశపు మూలాలున్న వాళ్ల తల్లిదండ్రులు వాళ్లని అదుపు చేయలేక పోవటం కనిపిస్తుంది. ఇలాంటి ప్రభావాల నుంచి కొత్త తరాలను కాపాడుకుని తమదైన మట్టిమూలాలను సాంస్కృతిక విలువలను, నైతిక విలువలను ఈ తరానికి అందించగలిగేది గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే. ఉత్తమమైన విలువలతో కూడిన మానవ వనరులను దేశంలో అభివృద్ధి పరచాలంటే మంచి నడత ఉండాలంటే ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటేనే సాధ్యం.

ఎంతో ముఖ్యం: ఒకప్పుడు పెద్దవాళ్లు ఎంత చెబితే అంత వినే తరం ఉండేది. ఆ తరంలో అంతులేని ప్రశ్నలు లేవు. విధేయత మాత్రమే ఉండేది. ఇవ్వాల్టి తరం ఆలోచనా విధానమే వేరు. వాళ్లలో తార్కిక దృష్టి ఆలోచనా సామర్ధం పెరిగింది. ప్రతి విషయానికి రుజువులు సాక్షాలు కావాలి. నమ్మకం కుదిరే వరకు ఏ విషయాన్ని ఒప్పుకోరు. సందేహాలు పరంపరగా కురుస్తూ ఉంటాయి. వాళ్ల తెలివితేటలకు తగ్గట్టు సమాధానాలు ఇస్తూ వాళ్లని సంతృప్తి పరిచే అనుభవపూర్వకమైన వృద్ధులు కావాలి.
వాళ్లని గమనించి వాళ్ల మనసెరిగి వాళ్లను సమర్ధించగలిగిన చాకచక్యం గ్రాండ్ పేరేంట్స్‌లోనే ఉంటుంది. వాళ్లు వయసుతో, అనుభవంతో, ఓర్పుతో, ప్రేమతో అన్నింటా ఒక్క అడుగుపైనే ఉంటారు. ముందుగా వాళ్ల మనసుల్లో మనుమల పట్ల అంతులేని ప్రేమాదరణలు ఉంటాయి.

ఫేస్‌బుక్ ఛాటింగ్స్, వీడియోగేమ్స్ లోకంగా ఉండే పిల్లల మనసుల్లో, మాతో మాట్లాడటం అంతకంటే గొప్పగా ఉంటుందనే అభిప్రాయం కలిగించగలుగుతారు. ఇంట్లో తమవైపు మాట్లాడే తాతా అమ్మమ్మలపైన పిల్లలకు ఎంతో నమ్మకం ఉంటుంది.
ఎప్పుడూ హితోపదేశాలు చేస్తూ చదువుసంధ్యల గురించి మాట్లాడే తల్లిదండ్రుల కంటే ప్రేమతో చేరదీసే వాళ్లను ఇష్టపడతారు పిల్లలు. పెద్దవాళ్లు పిల్లలను దండించరు. నిశ్శబ్దంగా తమ అనుభవంతో పిల్లల అనుభవాలు వింటారు. అందుకే ప్రతి ఇంట్లో పెద్దవాళ్లు ఉండాలి. వాళ్ల అనుభవం జ్ఞానం ఇంటి మేలు కోసం ఉపయోగించాలి. అప్పుడే ప్రతి ఇల్లు కళకళలాడుతుంది.

                                                                                                -చేబ్రోలు శ్యామ్ సుందర్

Children who grow up among big ones develop personality