Home ఎడిటోరియల్ బాలల దీనోత్సవం

బాలల దీనోత్సవం

 Childrens Day Celebrations

నవంబర్ 14 భారతీయ బాలలకు ఎంతో ఇష్టమైన రోజు. ప్రభుత్వం అధికారికంగా వారికోసం కేటాయించిన ఒక్కగానొక్క రోజది. మనకు చాలా మంది దేశ నాయకులుండగా జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామో తెలుసా… పిల్లలంటే ఆయనకు చాలా చాలా ప్రేమ కాబట్టి! నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో బాధ్యతలుంటాయి. తీరిక అస్సలే ఉండదు. కానీ ఆయన మాత్రం అంత పని వత్తిడిలోనూ ఎలాగోలా వీలుచేసుకొని పిల్లలతో మాట్లాడేవారు. పిల్లలంతా ఆయన్ని ప్రేమగా ‘చాచా’ అని పిలిచేవారు.
నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ చూశారుగా! అది పెట్టుకోవడం ఆయనకు ఎలా అలవాటైందంటే… ఒకరోజు ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అది చూసి ఆనందంతో నవ్విన చిన్నారీ అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగే కన్పించాయట. తనకు అంత ఇష్టమైన పిల్లల గుర్తుగా ఆ తర్వాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటైందని చెబుతుంటారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లల్ని తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు. ఓసారి జపాన్‌కు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే ఆయన వారికొక ఏనుగును పంపించి, ‘భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా’ అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచింది. పిల్లలంతా బడికి వెళ్లాలనేది చాచా కోరిక. ఓసారి బాలల సినిమా చూసిన చాచా అందులో నటించిన ఏడేళ్ల పాపాయిని మెచ్చుకుంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి ‘థ్యాంక్స్’ చెప్పడం కూడా రాలేదు. దాంతో చాచాకు సందేహం వచ్చి ‘పాపను బడికి పంపడం లేదా’ అని వాళ్ల అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి, ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.
ఓసారి ఢిల్లీలో స్కూల్ పిల్లలు ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు పిల్లలు. దాన్ని దూరం నుంచి చూశాక కళ్లు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి… అదీ గేమ్. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించడానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ గేమ్ ఆడినందుకు అక్కడున్న పిల్లాడు రెండు అణాలు ఫీజు అడిగితే నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేశారట. తన సహాయకులనడిగి డబ్బు ఇప్పించుకొని ఫీజు చెల్లించారట. ఇలా పిల్లలతో చాచాకు ఉన్న అనుబంధం గురించి ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన, పిల్లలంటే ప్రాణమైన నెహ్రూ 1964లో కన్నుమూశారు. చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తు చేసుకోవడానికి ఆ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజైన నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మీకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు…
దేశంలో బాల్యాన్ని బాల్యంలా అనుభవిస్తున్న పిల్లల సంఖ్య చాల తక్కువ. తల్లిదండ్రుల పేదరికం పిల్లలను ఆనందానుభూతుల్లోకి కాకుండా నరకంలోకి నెడుతోంది. బాలకార్మికులు, ఆకలితో అల్లాడే పిల్లలు మన దేశంలోనే ఎక్కువ. కొన్ని కోట్ల మందికి అసలు బాల్యమే లేదు. ఎందుకంటే పుట్టిన 5 ఏళ్లలోపే వారు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ళ వయస్సు లోపున్న పిల్లల మరణాలలో మూడో వంతు మన దేశంలోనే జరుగుతున్నాయి. 2017లో మరణించిన పిల్లల్లో 22 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. భారత్‌లో పుట్టిన వెయ్యి మంది శిశువుల్లో 62 మంది ఏడాదిలోపే చనిపోతుంటే, మిగిలిన వారిలో కొంతమంది పోషకాహార లోపంతో మృతి చెందుతున్నారు. ఏటా 14.5 కోట్ల మంది పిల్లలు పుట్టిన రెండుమూడేళ్లకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలపడం మనదేశ పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. శిశు మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నాయి.
వాగాడంబరం… ఆచరణశూన్యత శైశవానికి శాపాలుగా మారుతున్నాయి. చాలా గ్రామాల ఆసుపత్రులలో మౌలిక వసతులు సైతం లేకపోవడం, ఆసుపత్రులున్నా డాక్టర్లు లేకపోవడం, మందులు లేకపోవడం … మరణాల రేటు పెరగడానికి ప్రధానకారణమౌతున్నాయి. ఏజెన్సీలో సరైన వసతులు లేకపోవడం వలన కలిగే చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర సమాజం, ప్రజాసంఘాలు వివరిస్తున్నా పాలకులకు చీమకుట్టినట్లయినా ఉండడం లేదు. భారతదేశంలో కోట్లాది చిన్నారుల్లో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు.
ఆర్థిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన నవభారతాన్ని నిర్మించాలంటే… నేటి బాలల అవసరాలను తీర్చడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అందుకు సమయమాసన్నమైనది. ఒకచోట బడి పిల్లలు రాజకుమారుల్లా దర్శనమిస్తారు. మరోచోట యోగి వేమనల్లా ఎదురొస్తారు. ఒకరికి వంటినిండా మోయలేనన్ని బరువులు. షూ, టై, బ్యాడ్జి, రిబ్బన్, వీపు మీద బ్యాగ్. వీటిలో ఏది లోపించినా అది నేరం. మరచిపోయినా, మాసిపోయినా వళ్లంతా వాతల శిక్ష. మరొకరిది సిగ్గుబిళ్లలు కూడా కప్పుకోలేని దైన్యం. సుర్రున కాలే రోడ్డు మీద నడవాలన్నా, ముళ్ల బాటలో పరుగెత్తాలన్నా కనీసం చెప్పులేసుకోలేని దౌర్భాగ్యం.

 Childrens Day Celebrations

Telangana News