Wednesday, April 24, 2024

అబద్ధాలు ఆడితే

- Advertisement -
- Advertisement -

Children

శ్రీను 6వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనుకబడేవాడు. పాఠశాలకు అప్పుడప్పుడు కారణం లేకుండా రాకుండా ఉండేవాడు. ఇంటిపని సరిగ్గా చేయకపోయేవాడు. పాఠశాలకు తరచూ ఆలస్యం గా వచ్చేవాడు. దేనికి కారణాలు అడిగినా అబద్ధాలు చెప్పేవాడు. అదే పాఠశాలలో నళిని అనే అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. శ్రీను వాళ్ళ పొరుగింటి అమ్మాయి. తరగతిలో మొదటి ర్యాంకు అమ్మాయి. ఆటల్లోనూ ఫస్టే. పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొనేది. నళిని శ్రీనును సొంత తమ్మునిలా చూసుకునేది. చిన్నప్పటి నుంచి నళిని, శ్రీనులు కలిసే పాఠశాలకు వెళ్ళేవారు. నళిని వాళ్ళ అమ్మా నాన్నా ఇచ్చిన డబ్బులతో తానేమీ కొనుక్కోకుండా శ్రీనుకే తినడానికి పండ్లు కొనిచ్చేది. శ్రీనూతో తరచూ ఇలా అనేది. ‘ఒరేయ్ తమ్ముడూ! బాగా చదువుకోరా! బాగుపడుతావు. ఎప్పుడూ అబద్ధాలు ఆడితే ఎప్పుడో ఒకప్పుడు దారుణంగా దెబ్బ తింటావు’ అని.

ఒకరోజు ఆ పాఠశాల విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్ళాలని ఉపాధ్యాయులు అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలో, ఏరోజు వెళ్ళబోతున్నారో, ఒక్కొక్క విద్యార్థి ఎంత డబ్బులు ఇవ్వాలో ప్రకటించారు. విహార యాత్రకు వారం రోజుల సమయం ఉంది. నాలుగు రోజులలోగా డబ్బులు చెల్లించిన వారినే విహారయాత్రకు తీసుకెళ్తామని అన్నాడు ప్రధానోపాధ్యాయుడు. నళినికి విహారయాత్రకు వెళ్ళాలని ఎంతో ఉంది. కానీ దగ్గర బంధువుల పెళ్ళి కారణంగా మరునాటి నుంచి 4 రోజుల పాటు పాఠశాలకు రాలేకపోతుంది. అయితే తాను కూడా విహారయాత్రకు వస్తానని, డబ్బులను మరునాడు శ్రీనుతో పంపిస్తానని ప్రధానోపాధ్యాయులకు చెబుతుంది నళిని. ఇంటివద్ద తల్లిదండ్రులను డబ్బులను అడిగి శ్రీనుకి ఇచ్చి, విషయం చెప్పి, డబ్బులను మర్చిపోకుండా ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలన్నది.

మరునాడు శ్రీను తన బ్యాగులో పెట్టుకున్న నళిని ఇచ్చిన డబ్బులను భోజన విరామం సమయంలో ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలనుకుంటాడు. ఆ సమయం అయింది. తన బ్యాగులో డబ్బులు మాయమయ్యాయి. ఎవరో దొంగతనం చేశారు. కంగారు పడ్డాడు. ప్రధానోపాధ్యాయులు శ్రీనుని పిలిపించి, నళిని ఇచ్చిన డబ్బులను ఇవ్వమంటాడు. నళిని విహారయాత్రకు వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రులు అనుమతి ఇవ్వలేదని అబద్ధం చెబుతాడు. నాలుగు రోజుల తర్వాత పాఠశాలకు వచ్చిన నళిని జరిగింది తెలుసుకుని తానిచ్చిన డబ్బులు ఏమైనాయని శ్రీనుని నిలదీస్తుంది. శ్రీను చెప్పింది నమ్మలేదు. తనకేమో డబ్బులు పోయినాయని చెప్పాడు. తాను డబ్బులే ఇవ్వలేదని ప్రధానోపాధ్యాయులకు చెబుతాడు. ‘నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం నీకు నిత్య కృత్యమైంది. నిన్నెవరు నమ్ముతారు? ఆ డబ్బులను నీ అవసరాలకు వాడుకొని నాతో అబద్ధం ఆడుతావా? అక్కనే మోసం చేసిన నిన్ను ఎప్పటికీ క్షమించను. నీతో ఎప్పటికీ మాట్లాడను అని కోపంగా వెళ్ళిపోయింది నళిని. అయ్యో! ఎంత పని జరిగింది. తన అబద్ధాల వల్ల ప్రాణ మిత్రురాలి స్నేహాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. ఇంకెప్పుడూ అబద్ధాలు ఆడకూడదని అనుకున్నాడు.

 

Children’s moral story telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News